IPO Trend: బహిరంగ మార్కెట్‌కు క్యూ కడుతున్న కంపెనీలు.. ఈ ఏడాది పెరిగిన కంపెనీల ఐపీవో లిస్టింగ్

(ప్రతీకాత్మక చిత్రం)

2021 చివరినాటికి స్టాక్ మార్కెట్ లిస్టింగ్ పొందడానికి మరిన్ని సంస్థలు ఐపీవో మార్గాన్ని ఎంచుకుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 55 వేల కోట్ల రూపాయలను సేకరించడానికి 30 కంపెనీలు ఇప్పటికే ఐపీవోకు దరఖాస్తు చేసుకున్నాయి.

  • Share this:
సాఫ్ట్‌వేర్ అంకుర సంస్థల నుంచి రెస్టారెంట్లు, రసాయనాల తయారీ కంపెనీల వరకు.. అనేక సంస్థలు ఐపీవో (ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌)కు వెళ్లేందుకు ప్రణాళికలు వేస్తున్నాయి. ముఖ్యంగా ఈ ఏడాది చాలా కంపెనీలు ఐపీవోతో ప్రజల ముందుకు వచ్చాయి. 2021 చివరినాటికి స్టాక్ మార్కెట్ లిస్టింగ్ పొందడానికి మరిన్ని సంస్థలు ఐపీవో మార్గాన్ని ఎంచుకుంటాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. దాదాపు 55 వేల కోట్ల రూపాయలను సేకరించడానికి 30 కంపెనీలు ఇప్పటికే ఐపీవోకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో కనీసం 10 నుంచి 15 కంపెనీలు ప్రజల్లోకి వెళ్లి మరో రూ.25 వేల కోట్లను సేకరించే ప్రక్రియను ప్రారంభించాయి. ఈ ఏడాది ఇప్పటికే కంపెనీలు ఐపీవో ద్వారా దశాబ్దంలో నమోదయ్యే మొత్తం కంటే అత్యధిక నిధులను సేకరించాయి.

ఐపీవో అంటే ఏంటి?
ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్‌కు సంక్షిప్త రూపమే ఐపీవో. ప్రైవేటు సంస్థలు నిధులను సేకరించడానికి ఎంచుకునేందుకు తొలిసారిగా స్టాక్ మార్కెట్లో నమోదు చేయించుకోవడాన్ని ఐపీవోకు రావడం అంటారు. ఈ విధానంతో ప్రజలకు (డీమ్యాట్ ఖాతాలు ఉన్నవారికి) సంస్థలు తమ షేర్లను అమ్మి, నిధులు సమీకరిస్తారు. ఈ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా కంపెనీలు బహిరంగ మార్కెట్లో లిస్టింగ్ సంస్థలుగా మారతాయి. కొన్ని ఐపీవోలు ఆపర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్)ను కలిగి ఉంటాయి. దీని ద్వారా ఇప్పటికే ఉన్న ప్రమోటర్లు లిస్టెడ్ కంపెనీల్లో తమ వాటాను తగ్గించడానికి వీలవుతుంది.

యూనికార్న్ హోదా (బిలియన్ డాలర్ విలువను అధిగమించిన) పొందిన సంస్థలు సాధారణంగా ఐపీవోల కోసం వెళ్తాయి. అయితే ఇందుకు స్థిరమైన నియమాలు లేవు. బలమైన ఫండమెంటల్స్, లాభాన్ని కలిగిన ప్రైవేటు కంపెనీలు సాధారణంగా లిస్టింగ్ కోసం ఐపీవోకు దరఖాస్తు చేసుకుంటాయి. దీని ద్వారా ప్రజల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు సేకరించవచ్చు. ఐపీవోల ద్వారా సేకరించిన నిధులను విస్తృత కార్యకలాపాల కోసం, వ్యాపార విస్తరణ కోసం, అప్పులు తీర్చడానికి, కార్పొరేట్ ఖర్చుల కోసం ఉపయోగిస్తాయి.

ఐపీవోల గురించి ముఖ్యమైన విషయాలు..
ఈక్విటీ వాటాను ఉచితంగా జారీ చేసేందుకు ప్రైవేటు సంస్థలు వాటాలను ప్రజలకు ఐపీవో ద్వారా అందిస్తాయి. ప్రజల్లోకి వెళ్లే ముందు కంపెనీలు మార్కెట్ రెగ్యులేటర్ అయిన సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ (SEBI) చెప్పిన రిక్వైర్మెంట్లను పాటించాలి. కంపెనీలు డ్రాఫ్ట్ రెడ్ హీయరింగ్ ప్రాస్పెక్టివ్ (DRHP)ను సమర్పించాల్సి ఉంటుంది. దీన్ని ఐపీవో అమ్మకపు ప్రక్రియకు బాధ్యత వహించే మర్చెంట్ బ్యాంకర్లు తయారు చేసిన ప్రాథమిక నమోదుగా పరిగణిస్తారు. DRHP అనేది సంస్థ వ్యాపారం, కార్యకలాపాలు, ప్రమోటర్లు, ఆర్థిక స్థితి, వాటాదారుల నమూనా సహా ఐపీవో గురించి కీలక వివరాలను కలిగి ఉంటుంది.

ఏదైనా సంస్థ ప్రజల నుంచి నిధులను ఎందుకు సమకూర్చుకోవాలనుకుంటుందో, సేకరించిన డబ్బు ఎలా ఉపయోగించుకోవాలో కూడా ఈ డాక్యుమెంట్ వివరిస్తుంది. సెబీ.. DRHPని సమీక్షించిన తర్వాత దాన్ని క్లియర్ చేస్తుంది. లేదా నిర్దిష్ట సంస్థ తరఫున ఐపీవోను నిర్వహించే మర్చెంట్ బ్యాంకర్ల నుంచి మార్పులను కోరుతుంది. మార్కెట్ రెగ్యులేటర్ ద్వారా ఐపీవోకి మార్గం క్లియర్ అయిన తర్వాత ఐపీవో సైజ్, ధరను నిర్ణయిస్తారు.

ఐపీవోలు ఎలా పనిచేస్తాయి?
ఏదైనా ఓ సంస్థ ప్రజల్లోకి వెళ్లడానికి మార్కెట్ రెగ్యులేటర్ నుంచి అనుమతి పొందిన తర్వాత అది ఐపీవో గురించి ముఖ్య వివరాలను విడుదల చేస్తుంది. సంస్థాగతేతర పెట్టుబడిదారులు, సంస్థాగత పెట్టుబడుదారులు, ప్రస్తుత ఉద్యోగులు, అర్హత పొందిన సంస్థాగత పెట్టుబడుదారులు, యాంకర్ ఇన్వెస్టర్లు లాంటి విభిన్న పెట్టుబడిదారులకు సైజ్, లాంచ్ తేదీ, వాటా అమ్మకం వివరాలు ఇందులో అందిస్తారు. ఐపీవో ప్రక్రియ ప్రారంభించిన తర్వాత వర్తకం కోసం ఓ సంస్థ వాటాలు మొదట గ్రే మార్కెట్లో, లిస్టింగ్ చేయని వాటాలను అనధికారిక మార్కెట్లో పొందుపరుస్తారు.

ఐపీవోలు ఎందుకు పెరుగుతున్నాయి?
గత ఏడాది నుంచి నిధులను సేకరించడానికి అనేక కంపెనీలు ఐపీవోకు వెళ్లాయి. గత ఏడాది ఐపీవోల నుంచి కంపెనీలకు 4.6 బిలియన్ డాలర్ల నిధులు వెళ్లాయని డేటా సూచిస్తుంది. 2021లో ఎక్కువ కంపెనీలు పబ్లిక్ ఆఫర్ ను ఎంచుకోవడంలో ఈ మొత్తాన్ని సులభంగా అధిగమించవచ్చని ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్లు భావిస్తున్నారు. గతేడాదితో పోలిస్తే కంపెనీలు రెట్టింపు డబ్బును సమీకరిస్తాయని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. కోవిడ్ మహమ్మారి, స్టాక్ మార్కెట్ కార్యకలాపాల ప్రభావ కారణంగా 2020 నుంచి చాలా కంపెనీలు ఐపీవోలను ఎంచుకుంటున్నాయి.

స్టాక్ మార్కెట్లో అద్భుతమైన పనితీరు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తులతో సహా మొదటిసారి పెట్టుబడి పెట్టే వారు పెరగడంతో.. కంపెనీలు ఐపీవోకు వెళ్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. 2020-21లో 14.2 మిలియన్లకుపైగా కొత్త వ్యక్తిగత పెట్టుబడుదారులు స్టాక్ మార్కెట్లలో పాల్గొన్నారని ఎస్బీఐ నివేదిక సూచించింది. ఎక్కువమంది పెట్టుబడుదారులు దీన్ని ఉపయోగించుకోవాలని చూస్తున్నారు. రిటైల్ పెట్టుబడుదారులు అనేకమంది సైతం ఇన్వెస్ట్‌మెంట్‌పై ఆసక్తి కనబరుస్తున్నారు. మహమ్మారి వల్ల ఎదురైన నష్టాల నేపథ్యంలో మూలధనాన్ని సమీకరించడానికి పెరిగిన డిమాండ్ కారణంగా వ్యాపార విస్తరణకు నిధుల సమీకరణకు కంపెనీలు ఐపీవోను మార్గంగా ఎంచుకుంటున్నాయి. పేటీఎం, మొబిక్విక్, జొమాటో తదితర సంస్థలతో పాటు టెక్, ఆన్‌లైన్ డెలివరీ స్టార్టప్స్ ప్రజాదరణ పొందడానికి ప్రధాన కారణం ఇదే. డిమాండ్ పెరిగే కొద్దీ మూలధనాన్ని పెంచడం, వ్యాపారాన్ని విస్తరించాలని సంస్థలు భావిస్తున్నాయి.

ఈ ఏడాది అధికం..
ఈ సంవత్సరం కొన్ని ప్రధాన ఐపీవోలపై పెట్టుబడిదారులు దృష్టి సారించారు. కేంద్ర కేబినెట్ క్లియరెన్స్ పొందిన తర్వాత ప్రభుత్వ రంగ బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఐపీవో ఒక్కటే కనీసం రూ.70 వేల కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద ఐపీవో అవుతుందని అంచనా వేస్తున్నారు. డిజిటల్ చెల్లింపుల సంస్థ పేటీఎం కూడా దాదాపు 17 వేల కోట్ల రూపాయల ఐపీవోకు వాటాదారుల నుంచి ఆమోదం పొందింది. ఈ వారం సంస్థ DRHPని విడుదల చేయనుంది.

పేటీఎం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పబ్లిక్ ఆఫర్ గురించి విశ్లేషకులు ఇప్పటికే ఆశాజనకంగా ఉన్నారు. ఫుడ్ డెలివరీ దిగ్గజం జోమాటో కూడా రూ.9375 కోట్ల ఐపీవోతో సంచలనం సృష్టించింది. ఈ సంవత్సరం ఫ్లిప్‌కార్ట్, మొబిక్విక్, బజాజ్ ఎనర్జీ, హోటెల్స్, అరోహన్ ఫైనాన్షియల్ సర్వీసెస్, గ్లెన్ మార్క్ లైఫ్ సైన్సెస్, ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, పురాణిక్ బిల్డర్స్, శ్రీరామ్ ప్రాపర్టీస్ సహా అనేక ఇతర సంస్థలు ఐపీవోలకు వెళ్లాలని యోచిస్తున్నాయి.
Published by:Krishna Adithya
First published: