టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత బ్యాంకు లావాదేవీల నుంచి ఆన్‌లైన్ షాపింగ్ వరకు అన్నీ సులువైపోయాయి. అయితే ఎప్పుడైతే ఇలాంటి సౌకర్యాలు పెరుగుతాయో, రిస్క్ కూడా అదే స్థాయిలో ఉంటుంది. ఆన్‌లైన్ లావాదేవీల్లో జరుగుతున్న మోసాలు అలాంటివే. ఆన్‌లైన్‌లో జరిగే మోసాలకు లెక్కే లేదు. రోజు కొన్ని వేల మంది లక్షల రూపాయలు నష్టపోతుంటారు. ఆన్‌లైన్ లావాదేవీల్లో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా మోసపోవడం ఖాయం. ఏటీఎం కార్డులు, మీ బ్యాంకు వివరాలన్నీ మీ దగ్గరే ఉన్నాయని ధీమాగా ఉంటే సరిపోదు. సైబర్ నేరగాళ్లు ఏదో ఓ రకంగా టార్గెట్ చేసి మీ అకౌంట్లు ఖాళీ చేస్తుంటారు. ఆన్‌లైన్‌లో ఎక్కువగా జరుగుతున్న 9 రకాల మోసాల గురించి తెలుసుకోండి. మీరూ అలా మోసపోకుండా జాగ్రత్తపడండి.
1. స్మిషింగ్: ఇది ఆన్‌లైన్ షాపింగ్‌కు సంబంధించిన మోసం. ఆన్‌లైన్ షాపింగ్ లేదా క్యాష్‌బ్యాక్ పేరుతో కస్టమర్లకు ఎస్ఎంఎస్‌లు పంపిస్తారు సైబర్ నేరగాళ్లు. అమాయకులు వలలో పడ్డారంటే క్రెడిట్ కార్డ్, ఏటీఎం కార్డు నెంబర్లు, పిన్, సీవీవీ, యూపీఐ పిన్ లాంటి వివరాలు తెలుసుకొని మోసం చేస్తారు.
2. జ్యూస్ జాకింగ్: బస్టాపులు, రైల్వే స్టేషన్లలో ఫోన్ ఛార్జింగ్ పెట్టేవారి నుంచి డేటాను కొట్టేసే టెక్నిక్ ఇది. మీరు పబ్లిక్ ఛార్జింగ్ పోర్ట్‌లో మీ మొబైల్ ఛార్జింగ్ పెట్టగానే అందులోని డేటా మొత్తం సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది.
3. విషింగ్: సైబర్ నేరగాళ్లు మీకు కాల్ చేసి, మీరు గతంలో జరిగిన ట్రాన్సాక్షన్ల వివరాలు చెబుతూ మీ బ్యాంకు వివరాలు, ఓటీపీ లాంటివి తెలుసుకుంటారు సైబర్ నేరగాళ్లు. వాటి ద్వారా మీ బ్యాంక్ అకౌంట్‌ని యాక్సెస్ చేస్తారు.
4. రిమోట్ అసిస్టెన్స్: మీ స్మార్ట్‌ఫోన్ లేదా కంప్యూటర్‌ను సైబర్ నేరగాళ్లు తమ ఆధీనంలోకి తీసుకొని మోసాలకు పాల్పడుతుంటారు. ఇందుకోసం టీమ్ వ్యూయర్, క్విక్ సపోర్ట్, ఎనీడెస్క్ లాంటి యాప్స్‌ని ఉపయోగిస్తారు.
5. ఫిషింగ్: మీకు ఇమెయిల్స్ లేదా ఎస్ఎంఎస్‌లో లింక్స్ పంపిస్తారు. వాటిని క్లిక్ చేయగానే మీ బ్యాంకు, ఏటీఎం కార్డు వివరాలను అప్‌డేట్ చేయమనే పేజీ ఓపెన్ అవుతుంది. అందులో వివరాలు ఎంటర్ చేస్తే అంతే సంగతులు.
6. క్యాష్ బ్యాక్: మీకు క్యాష్ బ్యాక్ వచ్చిందని, వెంటనే క్లెయిమ్ చేసుకోవాలని నేరగాళ్లు వల వేస్తారు. క్యాష్ బ్యాక్ కోసం ఆశపడితే మీ అకౌంట్ ఖాళీ కావడం ఖాయం.
7. రీఫండ్: అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లాంటి ప్లాట్‌ఫామ్స్‌లో మీరు జరిపిన ఆన్‌లైన్ లావాదేవీలకు రీఫండ్ వచ్చిందని నమ్మిస్తారు నేరగాళ్లు. మీ వివరాలన్నీ కరెక్ట్‌గా చెప్పారని నమ్మితే మోసపోయినట్టే.
8. కేవైసీ: పేటీఎం నుంచి మాట్లాడుతున్నామని మీ కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలని నమ్మించి డబ్బులు కొట్టేసే టెక్నిక్ ఇది. కేవైసీ వివరాలు అప్‌డేట్ చేయాలంటే అధికారిక వెబ్‌సైట్ లేదా యాప్ మాత్రమే ఉపయోగించాలి.
9. సిమ్ స్వాప్: మీ ఫోన్‌లో మీ సిమ్ కార్డు ఉంటుంది. కానీ... రాత్రికి రాత్రే మీ నెంబర్ వేరేవాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. దీన్నే సిమ్ స్వాప్ అంటారు. మీ పేరుతో మరో సిమ్ కార్డ్ తీసుకొని మీకు బ్యాంకు నుంచి వచ్చే ఓటీపీలను సైబర్ నేరగాళ్లు తెలుసుకొని లావాదేవీలు జరుపుతుంటారు.
ఇవి కూడా చదవండి:
Realme PaySa: ఐదు నిమిషాల్లో రూ.1,00,000 వరకు అప్పు... 'రియల్‌మీ పేసా' ఆఫర్
Kakeibo: కాకీబో... ఈ జపనీస్ టెక్నిక్ తెలిస్తే లక్షాధికారి కావొచ్చు
Debit Card: షాక్... మీ ఏటీఎం, క్రెడిట్ కార్డ్ వివరాలు వేరేవాళ్లకు తెలుసు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AMAZON PAY, BHIM UPI, CYBER CRIME, Google pay, MI PAY, Online business, Online shopping, Paytm, PhonePe, RuPay, UPI