హోమ్ /వార్తలు /బిజినెస్ /

Covid-19 Vaccines Price: వ్యాక్సిన్​ ధరలను ప్రకటించిన సీరం ఇన్​స్టిట్యూట్​, భారత్​ బయోటెక్​...ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే..?

Covid-19 Vaccines Price: వ్యాక్సిన్​ ధరలను ప్రకటించిన సీరం ఇన్​స్టిట్యూట్​, భారత్​ బయోటెక్​...ఇతర దేశాల వ్యాక్సిన్లతో పోలిస్తే..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

కేంద్రం.. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్​ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్​ ఉత్పత్తి కంపెనీలు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్​ అమ్మాలని నిర్ణయించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా రేట్లను ప్రకటించాయి.

ఇంకా చదవండి ...

దేశంలో పెరుగుతోన్న కరోనా కేసులను నియంత్రించేందుకు ప్రభుత్వాలు పాక్షిక లాక్​డౌన్లు​, నైట్​ కర్ఫ్యూ వంటివి అమలు చేస్తోన్నా ఫలితం లేకుండా పోతుంది. కేసుల తగ్గుముఖం అటుంచితే.. రోజురోజుకు మరిన్ని కేసులు పెరుగుతున్నాయి. దీంతో కరోనా కట్టడికి ఏకైక ఆయుధంగా పేర్కొంటున్న వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసింది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటివరకు ఫ్రంట్​లైన్​ వారియర్స్​, 45 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్​ అందజేస్తున్న కేంద్రం.. మే 1 నుంచి 18 ఏళ్ల పైబడిన వారందరికీ వ్యాక్సిన్​ ఇవ్వాలని నిర్ణయించింది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్​ ఉత్పత్తి కంపెనీలు కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యాక్సిన్​ అమ్మాలని నిర్ణయించాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు విడివిడిగా రేట్లను ప్రకటించాయి. దేశంలో ప్రస్తుతం సీరం ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఇండియాకు చెందిన కోవిషీల్డ్​, భారత్​ బయోటెక్​కు చెందిన కోవాగ్జిన్​ టీకాలను ఇస్తున్నారు. అయితే, ఈ రెండు సంస్థలు తాము ఉత్పత్తి చేసే టీకాల్లో 50 శాతం టీకాలను కేంద్రానికి ఇస్తామని ఒప్పందం చేసుకున్నాయి. ఒక్కో డోసు వ్యాక్సిన్​ను రూ. 150లకే కేంద్రానికి అందజేయనున్నాయి. ఇక, మిగిలిన టీకాలను రాష్ట్ర ప్రభుత్వాలకు, ప్రైవేటు సంస్థలకు అమ్మాలని నిర్ణయించాయి.

సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (SII) తన కోవిషీల్డ్ టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక్కో డోసుకు రూ.400, ప్రైవేటు ఆసుపత్రులకు రూ.600 ధరకు అమ్మాలని నిర్ణయించింది. ఇదే క్రమంలో భారత్​ బయోటెక్​ మాత్రం కోవాగ్జిన్​ ఒక్కో డోసు రాష్ట్ర ప్రభుత్వాలకైతే రూ.600, ప్రైవేటు సంస్థలకైతే రూ.1200లకు విక్రయిస్తామని​ వెల్లడించింది. ఇక విదేశాలకు 15 నుంచి 20 డాలర్లకు ఎగుమతి చేయనున్నట్లు తెలిపింది. ఈ మేరకు భారత్ బయోటెక్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణ ఎల్లా ప్రకటన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ... ‘మా సంస్థ ఉత్పత్తి చేసే వ్యాక్సిన్లలో 50 శాతం కేంద్ర ప్రభుత్వానికి రూ.150లకే సరఫరా చేయాలని నిర్ణయించాం. ఇంట్రానాసల్ కోవిడ్–19, చికెన్‌గున్యా, జికా వైరస్, కలరా వంటి వ్యాధులకు వ్యాక్సిన్లను రూపొందించడానికి పెద్ద ఎత్తున నిధులు అవసరం. అందువల్ల సామాజిక కోణంలో ఆలోచించి కేంద్రానికి తక్కువ ధరకే వ్యాక్సిన్​ను ఇస్తున్నప్పటికీ, రాష్ట్రాలకు, ప్రైవేటు సంస్థలకు సమాన ధరకు ఇవ్వలేకపోతున్నాం. అయినప్పటికీ, ఇతర దేశాల్లో అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లతో పోలిస్తే మా వ్యాక్సిన్​ ధర తక్కువగానే ఉంది’ అని తెలిపారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలు..

ప్రైవేట్ మార్కెట్​లో అమెరికన్ వ్యాక్సిన్​ డోస్​కు రూ. 1,500 కంటే ఎక్కువ ఖర్చవుతుంది. ఇక రష్యా, చైనా వ్యాక్సిన్లకు ఒక్క డోస్​కు రూ.750 కంటే ఎక్కువ ఖర్చవుతుంది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు అందించిన 12.76 కోట్ల కోవిడ్​–19 వ్యాక్సిన్లలో కోవిషీల్డ్ 90 శాతానికి పైగా ఉందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్లతో పాటు మెడికల్ గ్రేడ్ ఆక్సిజన్, సంబంధిత పరికరాల దిగుమతిపై కస్టమ్స్ సుంకాన్ని మాఫీ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 24న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఒకే దేశం ఒకే పన్ను అని చెబుతున్న కేంద్రం.. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వేర్వేరు ధరలు నిర్ణయించడం సరికాదంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

First published:

Tags: Covaxin, Covishield

ఉత్తమ కథలు