ప్రజలు భవిష్యత్తులో ఆర్థికంగా ఎదగాలని, ఉన్న సంపదను రెట్టింపు చేసుకోవచ్చని రకరకాల ఆర్థిక ప్రణాళికలు అనుసరిస్తుంటారు. ముఖ్యంగా పెట్టుబడులు పెట్టడానికి ప్రప్రథమంగా ప్రాధాన్యత చూపిస్తుంటారు. అయితే ఆర్థిక స్థిరత్వం కోసం పెట్టుబడులు పెట్టడం కంటే ముందుగా ఆర్థిక రక్షణ (Financial Protection) పొందడం మంచిది. ఎందుకంటే భవిష్యత్‌లో అనుకోని జబ్బుల వల్ల డబ్బంతా ఆవిరైపోవచ్చు. ఆ తర్వాత తీవ్ర ఆర్థిక చిక్కుల్లో పడొచ్చు. అందుకే వైద్య ఖర్చుల (Medical Expenses)కు తగినంత డబ్బు కూడబెట్టడం లేదా హెల్త్ ఇన్సూరెన్స్ (Health Insurance) తీసుకోవడం ముఖ్యం. అయితే కొందరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు కొన్ని తప్పులు చేస్తుంటారు. వీటివల్ల యాక్టివ్ పాలసీ ఉన్నా పూర్తి స్థాయిలో వారు ప్రయోజనాలు పొందలేరు. అందుకే ఇలాంటి తప్పులను చేయకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఆ తప్పులు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
* కార్పొరేట్ హెల్త్ పాలసీ చాలు, పర్సనల్ పాలసీ అవసరం లేదు
సాధారణంగా కార్పొరేట్ సెక్టార్‌లో పనిచేసే వ్యక్తులు తమ కంపెనీలు ఆఫర్ చేసే గ్రూప్ పాలసీలో సభ్యులుగా ఉంటారు. వీరు తమకు ఇప్పటికే గ్రూప్ పాలసీ ఉంది కదా అని పర్సనల్ కవర్ తీసుకోరు. అయితే కంపెనీలో పని చేస్తున్నంత కాలం మాత్రమే ఆఫీస్ పాలసీ వర్తిస్తుంది. ఉద్యోగం మానేసిన తర్వాత ఎలాంటి హెల్త్ కవరేజీ అందదు. దీనివల్ల సొంత జేబు నుంచే వైద్య బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే, ఉద్యోగులు తమ మలి వయసులో కంపెనీ నుంచి తప్పుకుంటారు. ఆ తర్వాత పాలసీ వర్తించదు. ఆ సమయానికి పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం చాలా ఆలస్యం అవుతుంది. ఫలితంగా ప్రీమియం ఎక్కువ చెల్లించాల్సి రావచ్చు. అందుకే, కంపెనీ గ్రూప్ పాలసీలో ఉన్నా లేకపోయినా పర్సనల్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.
* తగినంత కవరేజీ లేకపోవడం
కుటుంబానికి రూ.5 లక్షల కవరేజీ సరిపోయే రోజులు ఎప్పుడో పోయాయి. ఈ రోజుల్లో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చిన్న ఆపరేషన్‌కు దాదాపు రూ.40,000 ఖర్చు అవుతుంది. ఐసీయూ ఖర్చులు కూడా భగ్గుమంటున్నాయి. మొత్తంగా వైద్య బిల్లులు గతంతో పోలిస్తే చాలా రేట్లు పెరిగాయి కాబట్టి కవరేజీ కూడా ఎక్కువగా ఉండేలా జాగ్రత్త పడటం మంచిది. ఈ రోజుల్లో కుటుంబానికి కనీసం రూ.20-25 లక్షల ఆరోగ్య బీమా పాలసీ అవసరం.
* ముందుగానే ఇన్సూరెన్స్ తీసుకోకపోవడం
ఆరోగ్య బీమా మాకెందుకులే అనే భావనతో కొందరు ఇన్సూరెన్స్ తీసుకోరు. కానీ ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్య బీమా తీసుకోవడం ఉత్తమం. భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తితే.. అప్పటికప్పుడు పాలసీలు తీసుకోవడం తలకు మించిన భారంగా మారుతుంది. ఈ టైమ్‌లో ప్రీమియంలు అధికంగా ఉండొచ్చు లేదా కంపెనీలు బీమా జారీ చేయకపోవచ్చు.
* తప్పుడు సమాచారం అందించడం
ప్రీమియం ఖర్చులను కొంతమేర తగ్గించుకోవాలని ప్రజలు తమ గత ఆరోగ్య సమస్యలు లేదా ప్రస్తుత అలవాట్లను బీమా కంపెనీలతో పంచుకోరు. ఇలా చేస్తే అసలుకే ఎసరు వస్తుంది. ఈ విషయం బీమా కంపెనీకి తెలిస్తే పాలసీ ఎందుకూ పనికి రాకుండా పోతుంది. కవర్‌ను సైతం కోల్పోతారు. ఈ పొరపాటు ఎట్టిపరిస్థితుల్లో చేయకుండా బీమా సంస్థలతో మీ ఆరోగ్యం గురించి పూర్తి సమాచారం అందించాలి. అలాగే ముందస్తు పాలసీ రిజెక్షన్/క్లెయిమ్ తిరస్కరణల గురించి కూడా చెప్పాలి. లేనిపక్షంలో పాలసీ మళ్లీ నిరుపయోగంగా మారచ్చు.
* పాలసీ ఫైన్ ప్రింట్‌ను చదవకపోవడం
బీమాదారుల పాలసీలు ఒకదానికొకటి విభిన్నంగా ఉంటాయి. కొన్ని పాలసీలు చౌకగా ఉంటూ చాలా తక్కువ ప్రయోజనాలు అందించవచ్చు. కంపెనీ పాలసీలలో రకరకాల నిబంధనలు పెట్టవచ్చు. అందువల్ల పాలసీని కొనుగోలు చేసేటప్పుడు మీ అవసరాలకు తగిన ఫీచర్లు, ప్రయోజనాలు పాలసీ అందిస్తుందో లేదో తెలుసుకోవాలి. ఇందుకు పాలసీ గురించి క్షుణ్నంగా చదవాలి.
* తీవ్రమైన అనారోగ్యం & ప్రమాద వైకల్యం
ఆరోగ్య బీమా పాలసీ అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు ఆసుపత్రిలో అయ్యే ఖర్చులను కవర్ చేస్తుంది. కానీ తీవ్రమైన అనారోగ్యాలు లేదా దురదృష్టకర ప్రమాదాల కారణంగా అయ్యే వైద్య ఖర్చులు సాధారణ బీమా పాలసీ కవర్ చేయదు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని క్రిటికల్ ఇల్‌నెస్ పాలసీ, పర్సనల్ ఆక్సిడెంట్ డిసెబిలిటీ తీసుకోవడం మంచిది.
* వైద్య అత్యవసర నిధిని ఏర్పర్చుకోకపోవడం
ఉత్తమమైన ఆరోగ్య కవరేజీని ఉన్నా, వైద్యానికి అయ్యే ఖర్చులను భరించేందుకు అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఒకసారి ఆరోగ్య బీమా కవర్ చేయని కొన్ని ఖర్చులు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: General insurance, Health Insurance, Health policy, Insurance