Colgate: మీ పేస్టులో ఉప్పుందా... తాజా శ్వాస అంటూ యాడ్లతో అదరగొట్టే కోల్గేట్ కంపెనీకి షాక్ ఇచ్చింది వినియోగదారుల ఫోరం. ఈ కంపెనీ అమ్మాల్సిన దాని కంటే ఎక్కువ రేటుకు పేస్టు అమ్ముతోందని ఓ వినియోగదారుడు కన్సూమర్ కోర్టులో కేసు వేశాడు. విచారించిన కోర్టు కోల్గేట్ కంపెనీకి రూ.65,000 ఫైన్ వేసింది. ఇది ఎక్కడో జరగలేదు. మన తెలుగు రాష్ట్రం తెలంగాణలోని... సంగారెడ్డిలో జరిగింది. పిటిషన్ వేసింది ఓ లాయర్ కావడంతో... ఆయన తన వాదనను బాగా వినిపించారు. దీనిపై శుక్రవారం వినియోగదారుల ఫోరం తీర్పు ఇచ్చింది. ఇదంతా చదివాక... ఇదెలా జరిగింది? కోల్గేట్ ఎక్కువ ధరకు అమ్ముతోంది అని ఆయన ఎలా నిరూపించారు అని మనకు డౌట్ రావచ్చు. తెలుసుకుందాం.
CH నాగేందర్ ఓ లాయర్. ఎక్కడైనా అన్యాయం జరిగితే ఆయన రాజీ పడరు. 2019 ఏప్రిల్ 7న సంగారెడ్డిలోని రిలయన్స్ ఫ్రెష్ రిటైల్ మాల్లో 150 గ్రాముల కోల్గేట్ మాక్స్ టూత్ పేస్ట్‌ని కొన్నారు. దాని రేటు రూ.92. దాంతోపాటు 20 గ్రాముల కోల్గేట్ మాక్స్ టూత్‌పేస్ట్ రూ.10కి కొన్నారు. జనరల్‌గా మనం పావు కేజీ టమాటాలు రూ.10కి కొంటే... కేజీ టమాటాలను రూ.40 లేదా అంతకంటే తక్కువ రేటుకి కొంటాం. ఎందుకంటే... కేజీ కొంటున్నాం కాబట్టి రేటు తగ్గించాలని అడుగుతాం. ఇక్కడ ఈ కేసులో రూ.10కి 20 గ్రాముల పేస్ట్ వచ్చింది. ఆ లెక్కన 150 గ్రాముల పేస్ట్ రేటు రూ.75 లేదా అంతకంటే తక్కువ ఉండాలి. కానీ... 150 గ్రాముల పేస్ట్‌కి కోల్గేట్ కంపెనీ MRP రూ.92 పెట్టింది. దీనిపై నాగేందర్ ఆశ్చర్యపోయారు. రూ.17 ఎక్కువగా తీసుకుంటున్నారని గుర్తించారు. అధికంగా ఎందుకు తీసుకుంటున్నారని కోల్గేట్ కంపెనీకి నోటీసులు పంపారు. కానీ కంపెనీ పట్టించుకోలేదు.
తన నోటీసులకు కోల్గేట్ కంపెనీ రిప్లై ఇవ్వకపోవడంతో నాగేందర్... సంగారెడ్డిలోని వినియోగదారుల ఫోరమ్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ పిటిషన్‌ను విచారించిన కోర్టు... నాగేందర్ వాదనతో ఏకీభవించింది. కోల్గేట్ కంపెనీ అదనంగా వసూలుచేసిన రూ.17 తిరిగి ఇవ్వాలని చైర్మన్ పి.కస్తూరి, సభ్యురాలు డి.శ్రీదేవి తీర్పు ఇచ్చారు. అంతేకాదు... ఆయనను ఇబ్బంది పెట్టినందుకు రూ.10 వేలు, కోర్టు ఖర్చుల కింద రూ. 5వేలు అదనంగా ఇవ్వాలని చెప్పారు. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి మరో రూ.50 వేలు ఇవ్వాలని కోల్గేట్ కంపెనీని ఆదేశించారు. నెల రోజుల్లో ఇవి చెల్లించాలని తీర్పు ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Halwa: గోధుమ పిండి హల్వా... తిన్నారంటే వదలరంతే...
ఇక్కడ మనం ఓ విషయాన్ని గమనించాలి. కోల్గేట్ మాత్రమే కాదు చాలా కంపెనీలు ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాయి. ఉదాహరణకు ఓ షాంపూ శాషే... 10 గ్రాములు 3 రూపాయలు ఉంటుంది. అదే కంపెనీకి చెందిన అదే షాంపూ 100 గ్రాముల బాటిల్ కొంటే... దాని ధర రూ.30 ఉండాలి. కానీ రూ.80 లేదా ఇంకా ఎక్కువే అమ్ముతున్నాయి చాలా కంపెనీలు. మరి ఇలాంటి వాటిపైనా కేసులు వేస్తేనేగానీ వినియోగదారులకు న్యాయం జరగదు అనుకోవచ్చు.
Published by:Krishna Kumar N
First published:January 23, 2021, 10:59 IST