news18-telugu
Updated: January 11, 2021, 10:10 AM IST
ప్రతీకాత్మకచిత్రం
ఆడపిల్లల ఉన్నత చదువులు, పెళ్లి, ఇతర ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ప్రకటించిన సుకన్య సమృద్ధి యోజన పథకానికి మంచి ఆధరణ లభించింది. ఈ పథకంలో మంచి వడ్డీ రేటుతో హామీనిచ్చే రాబడి పొందవచ్చు. దీని ద్వారా ఆడపిల్లలు భవిష్యత్తులో ఆర్థిక భరోసాను పొందవచ్చు. మెచూరిటీ తరువాత దీంట్లో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని వారి చదువులు, పెళ్లి కోసం ఉపయోగించుకోవచ్చు. సుకన్య సమృద్ది యోజన పథకంలో మెచూరిటీ గడువు అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 21 సంవత్సరాలుగా ఉంటుంది. కానీ ఈ పథకంలో పెట్టుబడిగా పెట్టే కాంట్రిబ్యూషన్ గడువు అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 15 సంవత్సరాల వరకు మాత్రమే ఉంటుంది.
ఎలాంటి నియమాలు ఉన్నాయి?అమ్మాయిలకు 18 సంవత్సరాలు వచ్చే వరకు ఈ అకౌంట్లో పెట్టుబడి పెట్టిన మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడం కుదరదు. అంతవరకు అకౌంట్‌ను మూసివేయడమూ కుదరదు. వారికి 18ఏళ్లు నిండిన తరువాత, వారి ఉన్నత చదువుల కోసం పెట్టుబడి పెట్టిన మొత్తంలో 50 శాతం వరకు విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంది. ఆమె పెళ్లి కోసం ఈ అకౌంట్ నుంచి డబ్బు తీసుకోవచ్చు. సుకన్య సమృద్ది అకౌంట్ నుంచి మెచూరిటీ మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి అర్హత సాధించాలంటే.. వరుసగా 14 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ కాలం తప్పనిసరిగా డిపాజిట్ చేయాలి. సుకన్య సమిద్ధి యోజన నుంచి వచ్చే ఆదాయాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఇలాంటి అన్ని నిబంధనలు, షరతులను పాటించాలి. డిపాజిటర్లు చెప్పిన కారణంతో సంబంధిత అధికారులు సంతృప్తి చెందితేనే డబ్బు తీసుకోవడానికి అనుమతిస్తారు.
అకౌంట్ ను మూసివేయవచ్చా?
మెచూరిటీ తీరిన తరువాత సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ను శాశ్వతంగా మూసివేయవచ్చు. ఈ పథకంలో అకౌంట్ ఓపెన్ చేసిన తేదీ నుంచి 21 సంవత్సరాల తరువాత మెచూరిటీ గడువు ముగుస్తుంది. ఆ తర్వాత ఖాతాదారుడు పథకం ద్వారా వచ్చిన పూర్తి ఆదాయాన్ని (డిపాజిట్ చేసిన మొత్తం, దానిపై లభించే వడ్డీ) ఉపసంహరించుకోవచ్చు.
సంబంధిత యువతి మాత్రమే డబ్బు తీసుకోవచ్చు
మెచూరిటీ తరువాత అకౌంట్ ఎవరి పేరుతో ఉంటే, వారే(సంబంధిత యువతి) ఆదాయాన్ని పూర్తిగా విత్‌డ్రా చేసుకోవచ్చు. 18 సంవత్సరాలు నిండిన తరువాత అమ్మాయి పెళ్లి చేసుకుంటే, అకౌంట్ నుంచి డబ్బు మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు. ఇందుకు సంబంధిత యువతి తనకు 18 ఏళ్లు పైబడి వయసు ఉందని, పెళ్లి కోసం మెచూరిటీకి ముందే అకౌంట్‌ను మూసివేస్తున్నామని అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. పెళ్లి తరువాత ఈ అకౌంట్‌ను కొనసాగించే అవకాశం లేదు.
మెచూరిటీకి ముందే అకౌంట్‌ను మూసివేయవచ్చా...
ఖాతాదారులు చనిపోతే ఈ అకౌంట్‌ను శాశ్వతంగా మూసివేస్తారు. ఒకవేళ వారు ఏదైనా ప్రాణాంతక వ్యాధి బారిన పడినా, చికిత్స కోసం డబ్బు విత్‌డ్రా చేసుకొని అకౌంట్‌ను మెచూరిటీకి ముందే మూసివేయవచ్చు.
Published by:
Krishna Adithya
First published:
January 11, 2021, 10:10 AM IST