Life Insurance: లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేస్తున్నారా? అయితే ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిందే

(ప్రతీకాత్మక చిత్రం)

జీవిత బీమా తీసుకునే పాలసీదారుడు నామినీగా ఒక వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉంటుంది. పాలసీదారులు చనిపోయినప్పుడు.. పాలసీ అందించే బీమా మొత్తాన్ని నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు.

  • Share this:
కరోనా తరువాత లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీల కొనుగోళ్లు పెరిగాయి. మహమ్మారి కారణంగా ఎంతోమంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. దీంతో బాధితుల కుటుంబాలకు ఆర్థిక భద్రత కొరవడింది. అందువల్ల ప్రజలు జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేస్తున్నారు. సాధారణంగా ఏదైనా దురదృష్టకర సంఘటన జరిగి ప్రాణనష్టం వాటిల్లితే.. ఈ పాలసీలు కుటుంబానికి ఆర్థిక భద్రతను అందిస్తాయి. ఇలాంటి సందర్భాల్లో పాలసీదారుల కుటుంబానికి బీమాచేసిన మొత్తాన్ని ఒకేసారి చెల్లిస్తామని సదరు ఇన్సూరెన్స్ కంపెనీ హామీ ఇస్తుంది. జీవిత బీమా పాలసీ కింద క్లిష్టమైన అనారోగ్యాలను కూడా కవర్ చేయవచ్చు. అయితే సంబంధిత పాలసీలో పేర్కొన్న అనారోగ్యం ఉన్నట్లు నిర్ధారణ అయితేనే చెల్లింపులకు హామీ లభిస్తుంది. అయితే జీవిత బీమా పాలసీలను ఎంచుకునే వారు పరిగణనలోకి తీసుకోవాల్సిన కొన్ని అంశాలు ఉన్నాయి. వాటిలో క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ప్రధానమైనది.

జీవిత బీమా తీసుకునే పాలసీదారుడు నామినీగా ఒక వ్యక్తిని ఎంచుకోవాల్సి ఉంటుంది. పాలసీదారులు చనిపోయినప్పుడు.. పాలసీ అందించే బీమా మొత్తాన్ని నామినీ క్లెయిమ్ చేసుకోవచ్చు. అయితే కొన్ని కారణాలతో సంబంధిత క్లెయిమ్‌లను కంపెనీలు తిరస్కరిస్తాయి. కంపెనీ చెల్లించే క్లెయిమ్‌ల సంఖ్యను క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో సూచిస్తుంది. ఇది సంస్థపై కస్టమర్లకు ఉండే నమ్మకాన్ని సూచిస్తుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువల్ల జీవిత బీమా పాలసీలను కొనుగోలు చేసేటప్పుడే క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో గురించి ఆరాతీయాలి. ఇది మెరుగ్గా ఉన్న కంపెనీనే కస్టమర్లు ఎంచుకోవాలి.

క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో దేన్ని సూచిస్తుంది?
నిర్ణీత కాలవ్యవధిలో కంపెనీ చెల్లించిన క్లెయిమ్‌ల సంఖ్య, సంస్థకు వచ్చిన క్లెయిమ్ దరఖాస్తుల సంఖ్యకు నిష్పత్తిని ఇది సూచిస్తుంది. ఇది ఎక్కువగా ఉంటే.. కస్టమర్ల క్లెయిమ్ చెల్లింపులకు అవకాశం అధికంగా ఉంటుందని భావించాలి. అంటే ఫైల్ చేసిన క్లెయిమ్‌లను బీమా సంస్థ ఆమోదించే అవకాశాలు ఎక్కువ అని అర్థం. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ప్రతి సంవత్సరం దేశంలోని అన్ని కంపెనీల క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియోను విడుదల చేస్తుంది. లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలను ఎంచుకునే ముందు ఈ డేటాను తప్పనిసరిగా తనిఖీ చేయాలి.

బజాజ్ అలియాంజ్ సంస్థకు ఎక్కువ రేషియో
బీమా రంగంలో ముందంజలో ఉండేందుకు అనేక సంస్థలు కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తున్నాయి. బజాజ్ అలియాంజ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో మిగతా సంస్థల కంటే ఎక్కువగా ఉన్నట్లు ఐఆర్‌డీఏఐ డేటా ద్వారా తెలుస్తోంది. 2020- 2021 సంవత్సరానికి సంస్థ క్లెయిమ్ సెటిల్‌మెంట్ రేషియో ఏకంగా 98.48 శాతంగా ఉంది. అందువల్ల మొదటిసారి జీవిత బీమాను ఎంచుకునే వారు ఈ సంస్థ అందించే లైఫ్ ఇన్సూరెన్స్‌లను పరిశీలించవచ్చు. అయితే వినియోగదారులు తమ ఇతర అవసరాల ఆధారంగా సొంత నిర్ణయం ప్రకారం పాలసీలను ఎంచుకోవడం మంచిది.
Published by:Krishna Adithya
First published: