భారతదేశంలోని అతిపెద్ద టీ ఉత్పత్తిదారులలో లక్ష్మీ టీ (Luxmi Tea) ఒకటి. ఈ కంపెనీకి అస్సాం, పశ్చిమ బెంగాల్, త్రిపుర నుంచి రువాండా, ఆఫ్రికా వరకు విస్తారమైన ఎస్టేట్లు ఉన్నాయి. శతాబ్దాల నాటి చరిత్ర గల ఈ భారతీయ బ్రాండ్ ఇప్పుడు గ్లోబల్ కంపెనీగా ఎదిగేందుకు వడివడిగా అడుగులు వేస్తోంది. గ్లోబల్ మార్కెట్‌కు స్వదేశీ, సేంద్రీయ ఉత్పత్తులను పరిచయం చేస్తున్న ఈ కంపెనీ ప్రస్తుతం సరికొత్త మేకోవర్‌పై దృష్టి సారిస్తోంది. ఇందులో భాగంగా టీ తమ సొంత ఎస్టేట్ నుంచే వస్తుందనే సందేశాన్ని విస్తరించడమే లక్ష్యంగా లక్ష్మీ టీని లక్ష్మీ ఎస్టేట్స్ (Luxmi Estates)గా రీబ్రాండింగ్ చేసింది. కొత్త లోగో, కొత్త ప్యాకేజింగ్ సహా లక్ష్మీ టీ తన మరిన్ని ఉత్పత్తుల కోసం Luxmi Estates అనే కొత్త బ్రాండ్ నేమ్ ఎంపిక చేసుకుంది.
“మా దృష్టి మా ఎస్టేట్లపైనే ఉంది. మా బ్రాండ్ మొత్తం ఎస్టేట్లపై ఆధారపడుతుంది. మొక్కల పెంపకం దగ్గర నుంచి ప్యాకేజింగ్ వరకు అన్నీ మా ఎస్టేట్లలోనే జరుగుతాయి’’ అని లక్ష్మీ టీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ రుద్ర ఛటర్జీ తాజాగా ఓ న్యూస్ మీడియాతో చెప్పుకొచ్చారు. టీ వారి సొంత ఎస్టేట్ల నుంచి వస్తుందా లేదా వారు కేవలం టీ కొని ప్యాక్ చేస్తున్నారా అనేది తెలుసుకోవడం ప్రజలకు కష్టం. అయితే రీబ్రాండింగ్ తీసుకురావడం వల్ల తమ బ్రాండ్ విశ్వాసాన్ని, గుర్తింపును నిలుపుకుంటుందని ఛటర్జీ ఆశాభావం వ్యక్తం చేశారు. బ్రాండ్ మార్పులలో కంపెనీ కొత్త లోగో చాలామంది దృష్టిని ఆకర్షిస్తోంది. 'ది హ్యాండ్ ఆఫ్ అబండెన్స్' పిలిచే ఈ లోగో వెనకున్న అర్థాన్ని ఛటర్జీ వివరించారు. ఎస్టేట్‌లోని తేయాకు కోసేవారిని బ్రాండ్ అంబాసిడర్లు.. కాగా హ్యాండ్ లోగో వారి హస్తం అని తెలిపారు.
ఈ కంపెనీ 1912లో త్రిపురలో ప్రారంభం కాగా, గత నాలుగేళ్లలో వ్యాపారాన్ని రెట్టింపు చేసి మొత్తం ఆదాయాన్ని ఈ ఏడాదిలో రూ.1,500 కోట్లకు చేర్చారు ఛటర్జీ. కరోనా వల్ల ఆన్లైన్లో ప్రొడక్ట్స్ విక్రయించడం ప్రారంభించామని.. అప్పుడే వ్యాపారం కీలక మలుపు తిరిగిందని ఆయన చెప్పారు.
“ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు శ్రీలంక టీ, బ్రిటిష్ టీ, కెనడియన్ టీ, ఆస్ట్రేలియన్ టీ గురించి మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. ప్రపంచంలోనే అత్యుత్తమ టీ ఉత్పత్తిదారుగా భారతదేశం ఉన్నా.. బెస్ట్ టీ ప్రొడ్యూసర్స్ జాబితాలో ఎప్పుడూ చేరలేదు. మేం ఆన్లైన్లో విక్రయించడం.. ప్రపంచవ్యాప్తంగా షిప్పింగ్ చేయడం ప్రారంభించినప్పుడు, మా ఉత్పత్తి ఫ్రెష్‌గా ఉన్నందున మాకు గొప్ప ఫీడ్‌బ్యాక్ వచ్చింది. దానివల్ల ఈ ట్రెండ్‌లో మేం ఎలా ఉండాలో ఆలోచించేలా చేసింది” అని ఛటర్జీ వివరించారు.
వేగంగా విస్తరణ
ప్రస్తుతం వెస్ట్రన్ మార్కెట్లలో లక్ష్మీ ఎస్టేట్స్ కంపెనీ విస్తరిస్తోంది. ప్రస్తుత కంపెనీ డిమాండ్‌లో 50 శాతానికి పైగా ప్రపంచ మార్కెట్ల నుంచి వస్తోంది. కంపెనీ యూఎస్‌లో దాని సొంత టీమ్ కూడా ఏర్పాటు చేసింది. యూఎస్ త్వరలో భారతదేశం తర్వాత అతిపెద్ద మార్కెట్ అయ్యే అవకాశం కూడా ఉంది. కంపెనీ మూలికలు, పసుపు, అశ్వగంధ వంటి పాత స్వదేశీ ఉత్పత్తులను కొత్త బ్రాండింగ్‌లతో విక్రయించడమే ప్రపంచ మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి కారణం అవుతుందని ఛటర్జీ అన్నారు. తమ బ్రాండ్ నేమ్ చేంజ్ చేయడం వల్ల తాము కనుమరుగు కాకుండా జాగ్రత్త పడేందుకు ఆదాయంలో 25 శాతం ప్రచార కార్యక్రమాలకు వెచ్చిస్తామని తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.