మరో బ్యాంక్‌పై తాత్కాలిక మారటోరియం, విత్ డ్రా పరిమితులు విధింపు

తమిళనాడు కేంద్రంగా పని చేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ లిమిటెడ్ మీద కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మారటోరియం విధించింది.

news18-telugu
Updated: November 17, 2020, 11:08 PM IST
మరో బ్యాంక్‌పై తాత్కాలిక మారటోరియం, విత్ డ్రా పరిమితులు విధింపు
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
తమిళనాడు కేంద్రంగా పని చేస్తున్న లక్ష్మీ విలాస్ బ్యాంక్ లిమిటెడ్ మీద కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మారటోరియం విధించింది. ఈ బ్యాంక్ కస్టమర్లు నెలకు రూ.25,000కు మించి విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి లేదు. డిసెంబర్ 16 వరకు ఈ షరతులు అమల్లో ఉంటాయి. ఒకవేళ అంతకు మించి విత్ డ్రా చేసుకోవాలంటే అందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతి తీసుకోవాలి. అయితే, మెడికల్, ఉన్నత విద్య, పెళ్లి వంటి కొన్ని అత్యవసర సందర్భాలకు మాత్రమే ఆర్బీఐ రూ.25,000కు మించి విత్ డ్రా చేసుకోవడానికి అనుమతి ఇస్తుంది. లక్ష్మీ విలాస్ బ్యాంక్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో ఆ బ్యాంకులో విత్‌డ్రాయల్స్‌పై పరిమితులు విధించాలని ఆర్బీఐ సూచన మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.

మరోవైపు బ్యాంకును పట్టాలెక్కించేందుకు సరైన ప్రణాళికతో ముందుకు రానందు వల్లే మారటోరియం విధించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు ఆర్బీఐ ఓ ప్రత్యేక ప్రకటనలో పేర్కొంది. బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్‌ - 1949‌లోని సెక్షన్ 45 కింద తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని, బ్యాంకు కస్టమర్లు, డిపాజిటర్ల డబ్బుకు రక్షణ కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది.

లక్ష్మీ విలాస్ బ్యాంక్ షేర్లు ఈ రోజు బీఎస్ఈలో ఒక శాతం నష్టపోయాయి. షేర్ ధర రూ.15.60 వద్ద ముగిసింది. లక్ష్మీ విలాస్ బ్యాంక్‌కు అత్యవసరంగా నిధులు అవసరం. ఒక ఏడాది నుంచి కొనుగోలుదారుకోసం ఎదురుచూస్తోంది. ఇప్పటికే క్లిక్స్ క్యాపిటల్ సంస్థతో సంప్రదింపులు జరిపినట్టు తెలిసింది. బ్యాంకులో పెట్టుబడి పెట్టడం లేదా, బ్యాంక్‌ను అందులో విలీనం చేసే అంశాలపై చర్చించినట్టు సమాచారం.

లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ను ఇండియా బుల్స్ హౌసింగ్‌లో విలీనం చేస్తామంటూ 2019లో ఆర్బీఐ ముందు ప్రతిపాదించారు. కానీ, అందుకు రిజర్వ్ బ్యాంక్ అంగీకరించలేదు. గత నెలలో లక్ష్మీ విలాస్ బ్యాంక్‌ వ్యవస్థాపకుడు కేఆర్ ప్రదీప్ బ్లూంబర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమకు లిక్విడిటీ సమస్య లేదని తెలిపారు. బ్యాంకుకు లిక్విడిటీ కవరేజ్ రేషియ 80 శాతం అవసరం కాగా, తమ వద్ద 260 శాతం ఉందని వెల్లడించారు. సెప్టెంబర్ నెలలో ఆ బ్యాంకుకు చెందిన ఏడుగురు డైరెక్టర్లను తప్పించాలంటూ షేర్ హోల్డర్లు కోరారు. ఈ క్రమంలో ఆర్బీఐ.. బ్యాంకు కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు త్రిసభ్య కమిటీని నియమించింది.

మార్చిలో యెస్ బ్యాంక్‌పై మారటోరియం
ఈ ఏడాది మార్చిలోనే మరో ప్రైవేట్ బ్యాంక్ యెస్ బ్యాంక్ మీద ఆర్బీఐ మారటోరియం విధించింది. యెస్ బ్యాంక్ సంక్షోభంలో కూరుకుపోవడంతో దానిపై కూడా ఇలాగే ఆంక్షలు విధించింది. ఆ తర్వాత మెల్లమెల్లగా ఆంక్షలను తొలగించింది. గత నెలలో యెస్ బ్యాంక్ కో ప్రమోటర్ రానా కపూర్‌‌కు చెందిన రూ.127 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ అటాచ్ చేసింది. లండన్ లోని 77 సౌత్ ఆడ్లీ స్ట్రీట్ లో ఉన్న అపార్ట్మెంట్ 1 ఫ్లాట్‌ను మనీలాండరింగ్ నివారణ చట్టం కింద ఆస్తిని జప్తు చేయడానికి సెంట్రల్ ఏజెన్సీ తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేసింది.ఈ ఆస్తిని 2017లో రానా కపూర్ 9.9 మిలియన్ పౌండ్లకు (రూ.93 కోట్లు) డి‌ఓ‌ఐ‌టి క్రియేషన్స్ జెర్సీ లిమిటెడ్ పేరిట కొనుగోలు చేసినట్టు ఈడీ ఓ ప్రకటనలో తెలిపింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 17, 2020, 10:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading