CENTRAL GOVERNMENT PLANNING TO SELL 5 KG CAPACITY SMALL CYLINDERS AT RATION SHOPS SS
Gas Cylinder: ఇక రేషన్ షాపులో గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు... వారికి మాత్రమే
Gas Cylinder: ఇక రేషన్ షాపులో గ్యాస్ సిలిండర్ తీసుకోవచ్చు... వారికి మాత్రమే
(ప్రతీకాత్మక చిత్రం)
Gas Cylinder | త్వరలో రేషన్ షాపుల్లో చిన్న గ్యాస్ సిలిండర్లు (Small Gas Cylinder) అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. అంతేకాదు... రేషన్ షాపుల ద్వారా రుణాలు కూడా ఇచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తోంది.
ఇంట్లో గ్యాస్ అయిపోయిందా? వెంటనే గ్యాస్ సిలిండర్ కావాలా? గ్యాస్ సిలిండర్ బుక్ (Gas Cylinder Booking) చేస్తే డెలివరీకి ఒకట్రెండు రోజులు పడుతుంది. మరి అలాంటి సమయంలో ఏం చేయాలి? ఈ సందర్భాల్లో చిన్న సిలిండర్లు ఆదుకుంటాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం లాంటి ఆయిల్ కంపెనీలన్నీ చిన్న సిలిండర్లను (Small cylinder) కూడా అమ్ముతుంటాయి. కమర్షియల్ సిలిండర్ 19 కిలోలు, డొమెస్టిక్ సిలిండర్ 14.2 కిలోల కెపాసిటీతో వస్తే ఈ చిన్న సిలిండర్లు కేవలం 5 కిలోల కెపాసిటీతో వస్తాయి. అత్యవసరంగా గ్యాస్ సిలిండర్ అవసరం అయినవారికి, బ్యాచిలర్స్‌కు, వలస కూలీలకు ఈ చిన్న సిలిండర్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ చిన్న సిలిండర్లను ఇకపై రేషన్ షాపుల్లో అమ్మేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇండియన్ ఆయిల్ కంపెనీ ఛోటు పేరుతో, హిందుస్తాన్ పెట్రోలియం అప్పు పేరుతో, భారత్ పెట్రోలియం మినీ పేరుతో చిన్న సిలిండర్లను అమ్ముతున్నాయి. ఇవి ఫ్రీ ట్రేడ్ ఎల్పీజీ సిలిండర్లు. వీటిని ఎవరైనా కొనొచ్చు. ఈ చిన్న సిలిండర్లు కొనడానికి అడ్రస్ ప్రూఫ్ అవసరం లేదు. కేవలం ఐడీ ప్రూఫ్ చూపించి ఈ సిలిండర్ తీసుకోవచ్చు. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తీసుకెళ్లొచ్చు. ఎక్కడైనా రీఫిల్ చేయొచ్చు. చిన్న సిలిండర్లను రేషన్ షాపుల్లో అమ్మేలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ కంపెనీలతో సమన్వయం చేస్తోందని ఫుడ్ సెక్రెటరీ సుధాన్షు పాండే తెలిపారు. ప్రజాపంపిణీ వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న రేషన్ షాపులు ఆర్థికంగా పుంజుకోవడానికి తీసుకుంటున్న చర్యల్లో ఇది ఒక భాగమని ఆయన అన్నారు.
భారతదేశంలో మొత్తం 5.32 లక్షల రేషన్ షాపులు ఉన్నాయి. ఈ షాపుల ద్వారా 80 కోట్ల మంది లబ్ధిదారులకు సబ్సిడీ ధరలకే ఆహారధాన్యాలను జాతీయ ఆహార భద్రతా చట్టం ద్వారా సరఫరా చేస్తోంది కేంద్ర ప్రభుత్వం. రేషన్ షాపుల ద్వారా చిన్న సిలిండర్లను అమ్మడంతో పాటు రుణాలు అందించడం లాంటి ఆర్థిక సేవల్ని కూడా ఈ నెట్వర్క్ ద్వారా అందించాలని భావిస్తోంది ప్రభుత్వం.
రేషన్ షాపుల ఆర్థిక ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి బుధవారం వివిధ రాష్ట్రాల మంత్రులతో జరిగిన సమావేశంలో పలు అంశాలు చర్చించినట్టు సుధాన్షు పాండే తెలిపారు. పెట్రోలియం, సహజ వాయువుల మంత్రిత్వ శాఖతో పాటు ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్తాన్ పెట్రోలియం ప్రతినిధులు ఆసక్తి చూపిన రాష్ట్ర ప్రభుత్వాలకు మద్దతు ఇచ్చేందుకు అంగీకరించాయి. రేషన్ షాపుల ద్వారా చిరు వ్యాపారులకు ముద్ర రుణాలు కూడా ఇచ్చే ఆలోచనలో ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.