Savings: బ్యాంకులో డబ్బులు దాచుకున్నారా? అయితే మీకు షాకే

Savings: బ్యాంకులో డబ్బులు దాచుకున్నారా? అయితే మీకు షాకే (ప్రతీకాత్మక చిత్రం)

Small Savings Schemes | భవిష్యత్ అవసరాల కోసం బ్యాంకులో వివిధ పథకాల్లో డబ్బులు దాచుకొని వడ్డీతో కలిపి ఎక్కువ రిటర్న్స్ పొందడం సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ఓ అలవాటు. ఇలా డబ్బులు దాచుకున్నవారికి త్వరలో షాక్ ఇవ్వనుంది కేంద్ర ప్రభుత్వం.

  • Share this:
    పొదుపు పథకాల్లో డబ్బులు దాచుకునేవారికి కేంద్ర ప్రభుత్వం త్వరలో షాక్ ఇవ్వనుంది. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను తగ్గించే ఆలోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకోవాలని కొంతకాలంగా భావిస్తోంది కేంద్రం. ఈ నిర్ణయం వాయిదా పడుతూ వస్తోంది. చిన్న మొత్తాల పొదుపు పథకాలకు ఎక్కువ వడ్డీ ఉండటంతో తాము డిపాజిట్లపై వడ్డీ రేట్లు తగ్గించలేకపోతున్నామని బ్యాంకులు సైతం కేంద్రానికి ఫిర్యాదు చేస్తున్నాయి. దీంతో ఈ స్కీమ్స్‌పై వచ్చే త్రైమాసికంలో తప్పనిసరిగా వడ్డీ రేట్ల కోత తప్పదని వార్తలొస్తున్నాయి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్-NSC లాంటి పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గడం ఖాయం.

    ప్రస్తుతం ఏడాది మెచ్యూరిటీకి బ్యాంకుల్లో డిపాజిట్ రేట్లకు, చిన్న మొత్తాల పొదుపు పథకాలపై ఇచ్చే వడ్డీకి మధ్య 100 బేసిస్ పాయింట్లు అంటే 1 శాతం వడ్డీ తేడా ఉంది. ఈ గ్యాప్‌ను తగ్గించాలన్నది కేంద్ర ప్రభుత్వం ఆలోచన. వడ్డీ రేట్ల తగ్గింపుపై మానెటరీ పాలసీ కమిటీ-MPC నిర్ణయం తీసుకుంటుందని, అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నామని ఇటీవల ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అయితే ఫిబ్రవరిలో జరిగిన ఎంపీసీ సమావేశంలో చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను సవరించాల్సిన అవసరం లేదని నిర్ణయించారు. కానీ ప్రస్తుతం బ్యాంకుల ఒత్తిడితో పొదుపు పథకాలపై వడ్డీ రేట్లు తగ్గే అవకాశం కనిపిస్తోంది.

    సాధారణంగా పొదుపు పథకాలపై మూడు నెలలకోసారి వడ్డీ రేట్లను సవరిస్తుంది కేంద్ర ప్రభుత్వం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం అంటే 2020 జనవరి నుంచి మార్చి వరకు స్మాల్ సేవింగ్స్ స్కీమ్స్‌పై వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్టు 2019 డిసెంబర్ 31న కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దాని ప్రకారం 5 ఏళ్ల సీనియర్ సిటిజన్స్ సేవింగ్స్ స్కీమ్‌కు 8.6 శాతం, ఇతర సేవింగ్స్ డిపాజిట్లకు 4 శాతం, సుకన్య సమృద్ధి యోజన పథకానికి 8.4 శాతం చొప్పున వడ్డీ చెల్లిస్తోంది. 2020 ఏప్రిల్-జూన్ త్రైమాసికానికి సంబంధించి వడ్డీ రేట్లను ప్రకటించాల్సి ఉంది. ప్రభుత్వం చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను తగ్గిస్తే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్-PPF, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్-NSC, సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్-SCSS, సుకన్య సమృద్ధి యోజన-SSY స్కీమ్స్‌తో పాటు ఇతర పొదుపు పథకాల ఖాతాదారులకు వడ్డీ తక్కువగా లభిస్తుంది.

    ఇవి కూడా చదవండి:

    Smartphone: కొత్త ఫోన్ కొనాలా? మార్చి 31 లోపే తీసుకోండి... ఎందుకంటే

    Aadhaar SMS Services: ఎస్ఎంఎస్‌ ద్వారా ఆధార్ సేవలు... స్టెప్స్ ఇవే

    Credit Card: క్రెడిట్ కార్డుపై మీరు కట్టే వడ్డీ ఎంతో తెలిస్తే షాకే
    Published by:Santhosh Kumar S
    First published: