వాహనాలు కొనుగోలు చేసిన వారు.. వాటిని సొంత రాష్ట్రాల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే తరచుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లేవారు ఈ రిజిస్ట్రేషన్ విధానంతో ఇబ్బందులు ఎదుర్కొంటారు. కొత్త రాష్ట్రంలో సొంత వాహనాలకు రీ-రిజిస్ట్రేషన్ చేయించాల్సి ఉంటుంది. ఇలా ఉద్యోగ, వ్యాపార అవసరాల కోసం తరచుగా వివిధ రాష్ట్రాల్లో నివాసం ఉండే వారికి గుడ్ న్యూస్ చెప్పింది కేంద్ర రవాణా శాఖ. ప్రతిసారీ వాహనం రిజిస్ట్రేషన్‌ని ట్రాన్స్‌ఫర్ చేసే అవసరం లేకుండా ప్రత్యేకంగా ఒక సిరీస్‌ను ప్రారంభించింది.
వాహన కొనుగోలు దారులు భారత్ సిరీస్ లేదా 'BH' పేరుతో ఉండే సిరీస్‌తో రిజిస్ట్రేషన్ చేయించుకునే అవకాశం కల్పించింది కేంద్ర ప్రభుత్వం. భారత్ సిరీస్ రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన నోటిఫికేషన్‌ను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ శుక్రవారం విడుదల చేసింది. కొత్త BH సిరీస్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది దేశవ్యాప్తంగా చెల్లుబాటు అవుతుంది. ఈ సదుపాయం రక్షణ సిబ్బందితో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అందుబాటులోకి వచ్చింది. నాలుగు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల్లో కార్యాలయాలు ఉన్న ప్రైవేట్ కంపెనీల ఉద్యోగులు కూడా ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు.
ట్రాన్స్‌ఫర్‌లో భాగంగా కొత్త రాష్ట్రాలకు బదిలీ అయ్యే ఉద్యోగులకు ఈ నిర్ణయం మేలు చేకూర్చనుంది. సాధారణంగా ఒక రాష్ట్రం నుంచి మరొక రాష్ట్రానికి వెళ్లి నివసించే వారు.. కొత్త రాష్ట్రానికి వెళ్లిన ప్రతిసారీ తమ వాహనాల రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్‌ని ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. మోటార్ వాహనాల చట్టం- 1988లోని సెక్షన్ 47 ప్రకారం, వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసిన రాష్ట్రం మినహా.. ఏ రాష్ట్రంలోనైనా ఒక యజమాని తన వాహనాన్ని ఒక సంవత్సరానికి మించి ఉంచకూడదు. నిర్ణీత గడువులోగా యజమాని కొత్త రాష్ట్రంలో వాహనాన్ని రీ-రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అయితే ఈ ప్రక్రియకు కొత్త భారత్ సిరీస్ చెక్ పెట్టనుంది.
కొత్త రిజిస్ట్రేషన్ ‘YY BH #### XX’ ఫార్మాట్‌లో ఉంటుంది. YY అనేది.. వాహనాన్ని రిజిస్ట్రేషన్ చేసిన సంవత్సరాన్ని సూచిస్తుంది. BH అనేది భారత్ సిరీస్ కోడ్. #### అంటే.. ర్యాండమైజ్డ్ వేహికల్ నెంబర్‌కు సూచిక కాగా, XX అనేవి రెండు ఇంగ్లీష్ అక్షరాలను సూచిస్తాయి. వాహనాన్ని కొనుగోలు చేసిన వారు ఇప్పుడు భారత్ సిరీత్‌తో దాన్ని రిజిస్ట్రేషన్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఈ సిరీస్ వాహనాలపై రెండు సంవత్సరాలు లేదా రెండు గణాంక సంవత్సరాల ప్రాతిపదికన మోటార్ వెహికల్ ట్యాక్స్ వర్తిస్తుంది. అయితే పద్నాలుగో సంవత్సరం తర్వాత ఏటా మోటార్ వెహికల్ ట్యాక్స్ వర్తిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Technology