కరోనా కష్టకాలంలో ఉద్యోగం కోల్పోయారా? ఉద్యోగం పోయినవారిని ఆర్థికంగా ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కొద్ది రోజుల క్రితం అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకంలో నియమనిబంధనల్ని సడలించింది. తాజాగా ఈ పథకం గడువును మరో ఆరు నెలలు పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈఎస్ఐసీ సబ్‌స్క్రైబర్ ఉద్యోగం కోల్పోతే 90 రోజుల వేతనంలో 25 శాతం వేతనాన్ని అందించడమే ఈ పథకం లక్ష్యం. కొద్ది రోజుల క్రితం 25 శాతాన్ని 50 శాతానికి పెంచుతూ భారీ ఊరట కల్పించింది కేంద్ర ప్రభుత్వం. దీంతో ఉద్యోగం కోల్పోయిన ఈఎస్ఐ సబ్స్క్రైబర్లు 50 శాతం వేతనాన్ని పొందొచ్చు. అంతేకాదు... గతంలో ఉన్న నిబంధనల ప్రకారం ఉద్యోగం పోయిన 90 రోజుల తర్వాతే ఈ పథకం ద్వారా సాయం పొందడానికి దరఖాస్తు చేయాలి. కానీ ఇటీవల ఈ నిబంధనల్ని కూడా మార్చిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం కోల్పోయిన 30 రోజుల తర్వాత పథకం ద్వారా సాయం పొందొచ్చని తెలిపింది. ఈ మారిన నిబంధనలన్నీ 2020 డిసెంబర్ 31 వరకే వర్తిస్తాయని గతంలో ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం ఈ సడలింపుల్ని మరో ఆరు నెలలు పొడిగించింది. అంటే మారిన నిబంధనలు 2021 జూన్ 30 వరకు వర్తిస్తాయి. కాబట్టి ఉద్యోగం కోల్పోయిన ఈఎస్ఐ సబ్స్క్రైబర్లు 2021 జూన్ 30 వరకు ఈ పథకం ద్వారా లబ్ధి పొందొచ్చు. ఆ తర్వాత పాత నిబంధనలే అమలులోకి వచ్చే అవకాశముంది. క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసిన 5 రోజుల్లో సెటిల్మెంట్ పూర్తవుతుంది.
ఇక అటల్ బిమిత్ వ్యక్తి కళ్యాణ్ యోజన పథకం వివరాలు చూస్తే ఉద్యోగాలు కోల్పోయిన ఈఎస్ఐ సబ్స్క్రైబర్లను ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఈ స్కీమ్‌ను 2018 జూలై 1న ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ఈఎస్ఐ కార్పొరేషన్ ద్వారా బీమా పొందిన సంఘటిత రంగ ఉద్యోగులకు ఈ స్కీమ్ వర్తిస్తుంది. ఈఎస్ఐసీ చట్టం, 1948 లోని సెక్షన్ 2(9) ప్రకారం ఈ బెనిఫిట్స్ పొందొచ్చు. జీవితంలో ఒకసారి మాత్రమే క్లెయిమ్ ద్వారా సాయం పొందొచ్చు. రెండేళ్లుగా ఉద్యోగం చేస్తున్నవారే క్లెయిమ్‌కు దరఖాస్తు చేయడానికి అర్హులు. ఈఎస్ఐలో కంట్రిబ్యూషన్ కొనసాగుతూ ఉండాలి. ఉద్యోగుల బ్యాంకు అకౌంట్‌కు ఆధార్ నెంబర్ లింక్ చేసి ఉండాలి. ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ పొందాలంటే https://www.esic.nic.in/ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.