భారత ఆర్థిక వ్యవస్థ ఇప్పటివరకు నగదు లావాదేవీలు, ఆన్లైన్ ట్రాన్సాక్షన్ లు మాత్రమే చూసింది. ఇప్పుడు తీసుకొచ్చిన డిజిటల్ రూపీని కీలక మైలు రాయిగా చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI) డిసెంబర్ 1న డిజటల్ రూపీ పైలెట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది. తొలుత ఈ ప్రాజెక్ట్‌ను ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, భువనేశ్వర్ నగరాల్లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ICICI బ్యాంక్, యెస్ బ్యాంక్, IDFC ఫస్ట్ బ్యాంక్‌లలో రిటైల్ వినియోగం కోసం అనుమతించినట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇప్పటికే ఈ నాలుగు నగరాల్లో నాలుగు బ్యాంకులు నిర్వహించిన డిజిటల్ రూపీ క్లోజ్డ్ యూజర్ గ్రూప్ (CUG) పైలట్ ప్రాజెక్టుకు సంబంధించి బ్యాక్-టెస్టింగ్, ఫీడ్‌బ్యాక్ సమాచారాన్ని ఆర్బీఐ వెల్లడించింది. కస్టమర్ల సందేహాలకు ఆర్బీఐ సమాధానాలు తెలియజేసింది.
* డిజిటల్ రూపీపై అవగాహన
ఇక రెండవ దశలో, బ్యాంక్ ఆఫ్ బరోడా, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్ వంటి- మరో నాలుగు బ్యాంకుల్లో ఈ ప్రాజెక్టును ప్రారంభించనుంది. మరోవైపు సీబీడీసీ మరో తొమ్మిది నగరాల్లో డిజిటల్ రూపీ సేవలను విస్తరించే యోచనలో ఉంది. అయితే అసలు ఈ డిజిటల్ రూపీపై పూర్తిగా అవగాహన కల్పించేందుకు బ్యాంకులు సిద్ధమయ్యాయి. ప్రతి బ్యాంకు సీబీడీసీ కస్టమర్లను ఎంపిక చేసి, అవగాహన కల్పించాలని భావిస్తున్నాయి. కొంతమంది కస్టమర్లకు మాత్రమే డిజిటల్ రూపీని వినియోగించే అవకాశం కల్పిస్తున్నామని, వారికి కాన్సెప్ట్, ప్రాసెస్‌ని వివరిస్తామని కోటక్ మహీంద్రా బ్యాంక్ ప్రెసిడెంట్-గ్లోబల్ ట్రాన్సాక్షన్ బ్యాంకింగ్ శేఖర్ భండారి అన్నారు. ప్రతి బ్యాంకు కనీసం 10,000 మంది కస్టమర్లు లేదా వ్యాపారులను పైలెట్ ప్రాజెక్టులో భాగం చేయాలని భావిస్తున్నాయి.
* డిజిటల్ రూపీ ఎలా పని చేస్తుంది?
IDFC ఫస్ట్ బ్యాంక్, ఎండీ. సీఈఓ వి వైద్యనాథన్ మాట్లాడుతూ.. ‘కస్టమర్లు/వ్యాపారుల నుంచి అవసరమైన అంగీకారం పొందిన తర్వాత బ్యాంకులు ఈ–వాలెట్ల ద్వారా డిజిటల్ రూపాయి పంపిణీ చేస్తాయి. కస్టమర్లు నో-యువర్- కస్టమర్ (KYC) ప్రక్రియలను పూర్తి చేసిన తర్వాత బ్యాంక్ మొబైల్ యాప్‌లో వాలెట్ అందుబాటులోకి వస్తుంది. కస్టమర్ ప్రాధాన్యత ఆధారంగా, నిర్దిష్ట మొత్తంలో డబ్బు సీబీడీసీగా మారుతుంది. ఆ డబ్బు సేవింగ్స్ ఖాతా నుంచి వాలెట్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది. నిధులను డిజిటల్ రూపీగా మార్చడానికి కస్టమర్లు ఎటువంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ ప్రక్రియ ఈ-వాలెట్‌ను లోడ్ చేయడం లాంటిది.’ అని చెప్పారు.
డిజిటల్ రూపీ అంటే ఏంటి?
డిజిటల్ రూపీ అనేది ఎలక్ట్రానిక్ రూపంలో ఉండే కరెన్సీ. ఇది కూడా మామూలు డబ్బుల మాదిరిగానే పనిచేస్తుంది. ఆర్బీఐ మొదటగా రిటైల్ డిజిటల్ రూపీని పరీక్షిస్తోంది. దీన్ని డిజిటల్ టోకెన్ రూపంలో అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం చలామణిలో ఉన్న రూ.2 వేలు, రూ.500, రూ.100 కరెన్సీ నోట్లలాగే దీన్ని కూడా ఆర్బీఐ జారీ చేస్తుంది. బ్యాంకులు ఈ–రూపీని డిజిటల్ వ్యాలెట్ ద్వారా ఆఫర్ చేస్తాయి. డిజిటల్ రూపీకి ఉన్న మరో పేరు సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ(సీబీడీసీ). దేశంలో డిజిటల్ లావదేవీలు పెరగడంతో పాటు ఫిజికల్ కరెన్సీ నిర్వహణకు అయ్యే ఖర్చును తగ్గించుకోవడం లో భాగంగా ఆర్బీఐ డిజిటల్ కరెన్సీని తీసుకొచ్చింది. డిజిటల్ రూపీ వర్చువల్ కాబట్టి, దీనికి రిస్క్ కూడా చాలా తక్కువగా ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Digital, Digital currency, Indian currency, Rbi