హోమ్ /వార్తలు /బిజినెస్ /

Reliance Retail: ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్ డీల్‌కు సీసీఐ

Reliance Retail: ఫ్యూచర్ గ్రూప్, రిలయన్స్ రిటైల్ డీల్‌కు సీసీఐ

Reliance Retail (credit - twitter)

Reliance Retail (credit - twitter)

ఆగస్టు 29, 2020న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ సంస్థ కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ ‌లో కొన్ని విభాగాలను రూ.24713 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది.

  ఫ్యూచర్ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్ సేల్, లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ వ్యాపారాలను రిలయన్స్ ఇండస్ట్రీస్ విభాగమైన రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌, రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌ సముపార్జనకు కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. నవంబర్ 10న దీనికి ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు తమ ట్విటర్ ఖాతాలో సీసీఐ వెల్లడించింది. గతంలో ఆగస్టు 29, 2020న ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ రిటైల్ సంస్థ కిషోర్ బియానీకి చెందిన ఫ్యూచర్ గ్రూప్ ‌లో కొన్ని విభాగాలను రూ.24713 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది. సెప్టెంబర్‌లో ఫ్యూచర్ గ్రూప్‌లో మణిహారంలా పేరుపొందిన రిటైల్ బిజినెస్ విభాగాన్ని ముఖేష్ అంబానీకి అప్పగించింది. ఈ మెగా లావాదేవీతో ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్‌కు చెందిన రిటైల్, హోల్ సేల్ విభాగాలు రిలయన్స్ రిటైల్ అండ్ ఫ్యాషన్ లైఫ్ స్టైల్ లిమిటెడ్‌‌‌కు (RRFLL) బదిలీ అవుతాయి. RRFLL అనేది రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్‌లో ఓ భాగం. కాబట్టి, ఫ్యూచర్ గ్రూప్ నుంచి అవి రిలయన్స్ రిటైల్ గ్రూప్‌నకు బదిలీ అవుతాయి.

  మరోవైపు ఈ డీల్ పూర్తయిన తర్వాత RRFLL సంస్థ ఫ్యూచర్ ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్లో 6.09 శాతం ప్రిఫరెన్షియల్ ఈక్విటీ షేర్ల కోసం రూ.1200 కోట్లు పెట్టుబడి పెట్టాలని భావించింది. అలాగే మరో రూ.400 పెట్టుబడితో FEL వారెంట్లను ఈక్విటీ షేర్లుగా మార్చుకోవాలని చూస్తుంది. దీంతో FELలో RRFLL సంస్థ 7.05 శాతం అదనంగా వాటాను పొందుతుంది.

  ఫ్యూచర్‌ గ్రూప్‌నకు చెందిన రిటైల్, హోల్‌సేల్‌ వ్యాపారాలతోపాటు, లాజిస్టిక్స్, వేర్‌హౌజింగ్‌ విభాగాల కొనుగోలుకు రిలయన్స్ ఒప్పందం చేసుకుంది. అయితే ఈ ఒప్పందాని కంటే ముందే ఫ్యూచర్ గ్రూప్ తమతో ఒప్పందం చేసుకుందని అమెజాన్ చెప్పింది. ఫ్యూచర్ గ్రూప్‌లో భాగమైన ఫ్యూచర్ కూపన్స్‌లో అమెజాన్ 49 శాతం వాటాను కంపెనీ ప్రమోటర్ల నుంచి కొనుగోలు చేసింది. ఈ డీల్ నిబంధనల ప్రకారం మూడేళ్ల తర్వాత నుంచి పదేళ్లలోపు సమయంలో ప్రమోటర్‌కు చెందిన వాటాలను పూర్తిగా లేదా పాక్షికంగా కొనుగోలు చేసే అధికారం అమెజాన్‌కు ఉంది. ఆ తర్వాత రిలయన్స్ ఫ్యూచర్ గ్రూప్‌లో రిటైల్, హోల్ సేల్ వ్యాపారాలతో పాటు లాజిస్టిక్స్, వేర్ హౌసింగ్ విభాగాలను కొనుగోలు చేయడంతో దాన్ని సవాలు చేస్తూ అమెజాన్ సంస్థ సింగపూర్ ఆర్బిట్రేషన్ సెంటర్‌లో అప్పీలు చేసింది. సింగపూర్ ఆర్బిట్రేషన్ ఈ ఒప్పందంపై కొన్ని రోజుల క్రితం స్టే విధించింది. ఐక్యరాజ్యసమితి విధించిన అంతర్జాతీయ వ్యాపార నిబంధనల ప్రకారం సింగపూర్ ఆర్బిట్రేషన్ పనిచేస్తుంది. రిలయన్స్, ఫ్యూచర్ ఒప్పందంపై 90 రోజులపాటు ఈ స్టే అమలులో ఉంటుందని సింగపూర్ ఆర్బిట్రేషన్ చెప్పింది. అయితే, ఇప్పుడు సీసీఐ డీల్‌కు ఆమోదముద్ర వేసింది.

  Published by:Ashok Kumar Bonepalli
  First published:

  Tags: Reliance, Reliance Digital, Reliance Industries

  ఉత్తమ కథలు