ఒకప్పటితో పోలిస్తే, కార్ ఇన్సూరెన్స్ (Car Insurance) కొనుగోలు అనేది చాలా సులభమైపోయింది. వివిధ కంపెనీలు అందించే ఇన్సూరెన్స్ ప్లాన్స్ పోల్చుకునేందుకు అనేక ఆప్షన్స్ కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. అయితే హెల్త్ ఇన్సూరెన్స్‌లో (Health insurance) క్యాష్‌లెస్ క్లెయిమ్స్ ఉన్నట్టుగానే చాలా బీమా కంపెనీలు రీయింబర్స్మెంట్ ఆప్షన్స్‌తో పాటు క్యాష్‌లెస్ కార్ ఇన్సూరెన్స్ (Cashless Car Insurance) పాలసీలు అందిస్తున్నాయి. దీని గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. యాక్సిడెంట్లు లేదా అనుకోని ఘటనల్లో ఆర్థికంగా ఆదుకోవడంలో కారు ఇన్సూరెన్స్(Insurence) కీలక పాత్ర పోషిస్తుంది. పాలసీ కొనుగోలు చేయడం, క్లెయిమ్ ప్రక్రియ కూడా అత్యంత కీలకం.
అయితే ఇప్పుడు చాలా ఇన్సూరెన్స్ కంపెనీలు క్యాష్‌లెస్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీల తరహాలో రీయింబర్స్మెంట్ ఆప్షన్స్‌తో పాటు క్యాష్‌లెస్ కారు ఇన్సూరెన్స్ పాలసీలు కూడా అందిస్తున్నాయి. జేబు నుంచి డబ్బు చెల్లించాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా మంది క్యాష్‌లెస్ కార్ ఇన్సూరెన్స్ వైపు మొగ్గుచూపుతున్నారు. క్యాష్‌లెస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ తరహాలోనే క్యాష్‌లెస్ కార్ ఇన్సూరెన్స్ పాలసీల్లోనూ కారు డ్యామేజీ ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీలు నేరుగా భరిస్తాయి.
ఈ పాలసీలు ఎలా పనిచేస్తాయంటే?
కొన్ని గ్యారేజీలు కార్ ఇన్సూరెన్స్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంటాయి. వీటిని నెట్వర్క్ గ్యారేజీలు అంటారు. వీటికి ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి గుర్తింపు ఉంటుంది కాబట్టి వారు బీమా చేయించిన వాహన క్లెయిమ్‌లు చూడగలుగుతారు. ఈ గ్యారేజీల్లో ఎటువంటి చెల్లింపులు జరపకుండా బీమా చేయించిన వ్యక్తి తమ కారు రిపేర్ చేయించుకోవచ్చు. ఈ రిపేర్ ఖర్చును ఇన్సూరెన్స్ సంస్థ భరిస్తుంది. క్లెయిమ్ ప్రాసెస్ అంతా చాలా సులభంగా, ఎటువంటి చికాకులు లేకుండా ఉంటాయి. ఈ నెట్వర్క్ గ్యారెజీల జాబితాను బీమా కంపెనీలు అందిస్తుంటాయి. ఒకవేళ అవి ఇవ్వకపోతే సదరు సంస్థకు చెందిన టోల్ ఫ్రీ నెంబర్ లేదా కస్టమర్ సపోర్టును సంప్రదించి యాక్సిడెంట్ స్పాట్‌కు సమీపంలోని గ్యారేజీల వివరాలు పొందవచ్చు.
బీమా చేయించిన కారుకు ప్రమాదం జరిగి డ్యామేజీ లేదా ఏమైనా విడిభాగాలు పోయినప్పుడు, ఆ ప్రమాద వివరాలు బీమా కంపెనీకి తెలియజేయాల్సి ఉంటుంది. అలాగే డ్యామేజైన కారు తనిఖీ కోసం నెట్వర్క్ గ్యారేజీని బీమా చేయించిన వ్యక్తి సందర్శించాల్సి ఉంటుంది.
ఈ గ్యారేజీలు ఎలా సాయపడతాయి?
పాలసీ డాక్యుమెంట్‌లోని నిబంధనలు, కవరేజీని అనుసరించి ఈ గ్యారెజీలు ఇన్సూరెన్స్ చేయించిన కారును రిపేర్ చేస్తాయి. అనంతరం ఆ బిల్లును ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తాయి. ఆ కంపెనీ నుంచి కొన్ని తనిఖీల అనంతరం నెట్వర్క్ గ్యారేజీకి పేమెంట్ విడుదలవుతుంది. అయితే కొన్ని డ్యామేజీలు, రిపేర్లు పాలసీ పరిధిలోకి రానివి కూడా ఉంటాయి. కాబట్టి పాలసీ తీసుకునే వ్యక్తి సదరు పాలసీ కవరేజీ డాక్యుమెంట్‌ను ముందుగానే పూర్తిగా చదవడం మంచిది.
క్యాష్‌లెస్ కార్ క్లెయిమ్ ఎలా పనిచేస్తుందంటే:
మొదటి దశ: కారుకు డ్యామేజ్ అియతే మీరు ఆ విషయాన్ని ఇన్సూరెన్స్ సంస్థకు తెలియజేయాలి.
రెండవ దశ: కారును సమీపంలోని నెట్వర్క్ గ్యారెజీకి తరలించాలి లేదా కారు తరలింపు కోసం మీరు ఇన్సూరెన్స్ సంస్థ సాయం తీసుకోవచ్చు.
మూడవ దశ: అవసరమైన పాలసీ సంబంధిత పత్రాలన్ని నింపి క్యాష్‌లెస్ రిపేర్ల ఆమోదం కోసం వాటిని షేర్ చేయాలి.
నాలుగో దశ: రిపేర్ అనంతరం, ఇన్వాయిస్, ఇతర పత్రాలను ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాలి.
ఐదో దశ: పేపర్ల పరిశీలన తర్వాత, ఇన్సూరెన్స్ కంపెనీ పేమెంట్ విడుదల చేస్తుంది.
క్యాష్‌లెస్ కారు పాలసీలతో ప్రయోజనాలు
పాలసీదారులు తమ జేబు నుంచి ఎటువంటి చెల్లింపులు జరపకుండా చూడటంలో ఈ పాలసీలు సాయపడతాయని పరిశ్రమ నిపుణులు సూచిస్తున్నారు. ఈ ప్రాసెస్ కూడా చాలా సునాయాసంగా, వేగవంతంగా ఉంటుందనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. గ్యారేజీలకు చెల్లింపుల ప్రక్రియ చాలా సౌకర్యవంతంగా ఉంటుంది కాబట్టి ఈ నెట్వర్క్ గ్యారెజీలు ఇన్సూరెన్స్ ఉన్న కార్ల రిపేర్ల విషయంలో ప్రాధాన్యత ఇస్తాయి. రీయింబర్స్మెంట్ ప్రక్రియతో పోల్చితే క్యాష్‌లెస్ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియ చాలా వేగంగా (సాధారణంగా 7 నుంచి 10 రోజులు) ఉంటుంది.
అత్యున్నత నాణ్యతతో కూడిన సేవలందించేందుకు ఇన్సూరెన్స్ కంపెనీలు, చక్కని గ్యారెజీ నెట్వర్క్స్తో ఒప్పందం కుదుర్చుకుంటాయి కాబట్టి పాలసీదారులకు అత్యున్నత సేవలు అందుతాయి. అన్నింటిని మించి ఈ మొత్తం ప్రక్రియలో మోసానికి తావు ఉండదు కాబట్టి ఇవి అత్యంత విశ్వసనీయమైనవిగా నిలుస్తాయి. ఇందులో ఇన్సూరెన్స్ సంస్థకు చెందిన సర్వేయర్ నేరుగా క్లెయిమ్ ప్రక్రియలో ఇన్వాల్వ్ అవుతారు.
రిపేర్ ప్రారంభించడానికి ముందు అందించిన ఎస్టిమేట్స్‌కు తగిన విధంగా పనులు జరిగాయన్నది ప్రారంభం నుంచి బిల్లింగ్ వరకు సర్వేయర్ నిశితంగా గమనిస్తారు. ఈ క్లెయిమ్ ప్రక్రియలో సర్వేయర్ కారును పరిశీలించి డ్యామేజ్‌ను అంచనా వేయవచ్చు. అంతే కాదు పెద్ద ప్రమాదం జరిగితే, ఆ స్థలాన్ని సర్వేయర్ పరిశీలించే అవకాశాలు ఉన్నాయి. పాలసీ డాక్యుమెంట్లో పొందుపరిచిన కవరేజ్ మేరకు డ్యామేజీలకు అయ్యే ఖర్చును ఇన్సూరెన్స్ సంస్థ భరిస్తుంది. అవి కాకుండా రిపేరింగ్‌కు అదనంగా ఇంకా ఏమైనా ఖర్చు అయితే, వాటిని పాలసీదారు స్వయంగా భరించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.