CARS AND TWO WHEELERS PRICE WILL HIKE AS MADRAS HIGH COURT ORDER ON BUMPER TO BUMPER INSURANCE SS GH
రేపటి నుంచి పెరగనున్న వాహనాల ధరలు... కారణం ఏంటంటే
రేపటి నుంచి పెరగనున్న వాహనాల ధరలు... కారణం ఏంటంటే
(ప్రతీకాత్మక చిత్రం)
Vehicle Insurance | కొత్త వాహనం కొనాలనుకునేవారికి అలర్ట్. మద్రాస్ హైకోర్టు ‘బంపర్ టూ బంపర్’ బీమాను (Bumper to Bumper Insurance) తప్పనిసరి చేయాలని ఆదేశించడంతో కార్లు, టూవీలర్లు, ఇతర వాహనాల ధరలు పెరగనున్నాయి.
సెప్టెంబర్ 1 నుంచి అన్ని వాహనాల కొనుగోలుపై ‘బంపర్ టూ బంపర్’ బీమాను (Bumper to Bumper Insurance) తప్పనిసరి చేయాలని మద్రాస్ హైకోర్టు ఇటీవల ఆదేశించిన విషయం తెలిసిందే. దీనివల్ల సెప్టెంబర్ 1 నుంచి కొత్త వాహనాలపై ఐదేళ్ల బీమా (Vehicle Insurance) తప్పనిసరి కానుంది. ఫలితంగా ఆయా వాహనాల ధరలు 10 శాతం మేర పెరగనున్నాయి. టూ వీలర్స్‌పై రూ. 5,000 నుంచి రూ.6000 వరకు, ఎంట్రీ లెవెల్ కార్ల కొనుగోలుపై రూ.50 వేలు, మధ్య శ్రేణి ఎస్యూవీ కార్లపై రూ. 2 లక్షలకు పైగా భారం పడనుందని ఫెడరేషన్ ఆటో మొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ (ఫాడా) ప్రెసిడెంట్ వింకేశ్ గులాటి చెప్పారు.
సాధారణంగా రూ.లక్షలు పెట్టి వాహనం కొనుగోలు చేసే సందర్భంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టడంలో చాలా మంది వెనుకాముందు ఆలోచిస్తుంటారు. ప్రీమియం భారం తగ్గించుకునేందుకు రకరకాల ప్లాన్లు వేస్తారు. ఇప్పటి వరకు ఈ తరహా పద్దతే ఎక్కువగా చెల్లుబాటు అవుతూ వస్తోంది. అయితే వాహనం కొనుగోలు చేసిన తర్వాత మొదటి ఐదేళ్ల పాటు బంపర్ టూ బంపర్ ఇన్సూరెన్సును తప్పనిసరి చేసింది మద్రాసు హైకోర్టు. అంటే వాహనానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆ వాహనంతో పాటు దాని యజమాని లేదా డ్రైవర్, అందులో ప్రయాణించే వ్యక్తులందరికీ నష్టపరిహారం పొందే హక్కు ఉంటుంది.
కొత్త వాహనాలను కొనుగోలు చేసేటప్పుడు నూటికి తొంబై శాతం మంది బంపర్ టూ బంపర్ ఇన్సూరెన్స్నే చేయిస్తున్నారు. ఆ తర్వాత రెన్యువల్ చేయించేప్పుడే థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్లకు వెళ్తున్నారు. ప్రస్తుతం వాహన మొత్తం ధరలో 3 శాతం మొత్తాన్ని ఒక ఏడాది పాటు బంపర్ టూ బంపర్ ఇన్సూరెన్స్ ప్రీమియంగా చెల్లిస్తున్నారు. ఇప్పుడు ఈ కాలాన్ని ఐదేళ్లకు పొడిగించాలని కోర్టు సూచించింది. ఆ లెక్కన వాహనం ధరలో 3 శాతం మొత్తాన్ని ఐదేళ్లకు పెంచితే.. మార్కెట్ వాల్యూ, తరుగుదల ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకుంటే ఇన్సూరెన్స్ ప్రీమియం దాదాపు మూడింతలు పెరిగిపోతుంది.
కరోనా సంక్షోభం తర్వాత ఇప్పుడిప్పుడే ఆటో మొబైల్ పరిశ్రమ కోలుకుంటోంది. కొనుగోలుదారులను ఆకట్టుకునేందుకు వాహన తయారీ సంస్థలు అనేక ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో.. ఐదేళ్లకు బంపర్ టూ బంపర్ ఇన్సూరెన్స్‌ని మద్రాస్ కోర్టు తప్పనిసరి చేసింది.ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వాహన ధరలు పెరిగిపోతాయని, ఫలితంగా అమ్మకాలపై ఆ ప్రభావం పడుతుందని వాహన తయారీ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.