ప్రభుత్వరంగ రుణదాత కెనరా బ్యాంక్ కీలక నిర్ణయం తీసుకుంది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచింది. పెరిగిన వడ్డీ రేట్లు 2022 ఆగస్టు 8 నుంచి అమల్లోకి వచ్చాయి. సవరించిన రేట్ల ప్రకారం.. 7 రోజుల నుంచి 10 సంవత్సరాల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేట్లను సాధారణ ప్రజలకు 2.90 శాతం నుంచి 5.75 శాతం, సీనియర్ సిటిజన్లకు 2.90 శాతం నుంచి 6.25 శాతం వరకు అందిస్తోంది.
* తాజా ఫిక్స్‌డ్ డిపాజిట్ల రేట్లు
7 నుంచి 45 రోజుల్లో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 2.90 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తుంది. అలాగే 46 నుంచి 90 రోజుల్లో మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై కూడా 4.00 శాతం వడ్డీ రేటును కెనరా బ్యాంకు కొనసాగిస్తుంది. 91 - 179 రోజుల మధ్య మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లలో ఎలాంటి మార్పులు చేయలేదు. 4.05 శాతం వడ్డీ రేటునే కొనసాగిస్తోంది. ఇక 180- 269 డేస్ టర్మ్ డిపాజిట్లపై 15 బేస్ పాయింట్లు పెరగడంతో గతంలో ఉన్న 4.50 శాతం ఉన్న వడ్డీ రేటు, ఇప్పుడు 4.65కి పెరిగింది.
కెనరా బ్యాంక్ తాజాగా, 270 రోజుల నుంచి ఒక సంవత్సరం కంటే తక్కువ వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 10 బీపీఎస్ పాయింట్లు పెరగడంతో 4.65 శాతం వడ్డీ రేటును ఇస్తుంది. గతంలో ఇది 4.55 శాతంగా ఉండేది. 333 డేస్ స్కీమ్‌పై వడ్డీ రేటును 5.10 శాతం వద్ద కొనసాగిస్తూనే, ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై వడ్డీ రేటును 20 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. దీంతో వడ్డీ రేటు 5.30 శాతం నుంచి 5.50 శాతానికి పెరిగింది. 1 -2 సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధిలో మెచ్యూర్ అయ్యే డిపాజిట్లపై 15 బీపీఎస్ పాయింట్ల పెంపుతో వడ్డీ రేట్ 5.40 శాతం నుంచి 5.55 శాతానికి పెరిగింది.
కెనరా బ్యాంక్ తాజాగా 666 రోజులతో కొత్త కాల వ్యవధిని ప్రకటించింది. దీనిపై వడ్డీ రేట్ అత్యధికంగా 6 శాతం ఇస్తోంది. 2 సంవత్సరాల కంటే ఎక్కువ 3 సంవత్సరాలలోపు మెచ్యూర్ అయ్యే ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 15 బేసిస్ పాయింట్ల పెంపుతో 5.60 శాతం వడ్డీ రేటును అందిస్తుంది, ఇది గతంలో 5.45 శాతంగా ఉండేది.
3 సంవత్సరాల కంటే ఎక్కువ 5 సంవత్సరాలలోపు కాలపరిమితి ఫిక్స్‌డ్ డిపాజిట్లపై 5.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. గతంలో ఇది 5.70 శాతంగా ఉండేది. ఇక 5 సంవత్సరాల నుంచి 10 ఏళ్లలోపు ఎఫ్‌డీలపై 5.75 శాతం వడ్డీ రేటును కొనసాగించింది. ₹1.5 లక్షల వరకు డిపాజిట్‌లపై, ట్యాక్స్ సేవర్ డిపాజిట్ స్కీమ్ కింద జనరల్ పబ్లిక్‌కు 5.75 శాతం వార్షిక వడ్డీని కెనరా బ్యాంక్ ఆఫర్ చేస్తోంది. ఇక సీనియర్ సిటిజన్లకు 6.25 శాతం వడ్డీని ఇస్తుంది. 180 రోజులు- అంతకంటే ఎక్కువ కాల వ్యవధి ఉన్న డిపాజిట్లపై సీనియర్ సిటిజన్స్ 0.50 శాతం అదనపు వడ్డీ రేటు పొందేందుకు అర్హులు.
కాగా, రిజర్వ్ బ్యాంక్ రెపో రేటును 50 బేసిస్ పాయింట్లు 4.9 శాతం నుండి 5.4 శాతానికి పెంచడంతో, కెనరా బ్యాంక్ కూడా తన ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేటును పెంచింది. అలాగే కెనరా బ్యాంక్ తన రెపో రేట్-లింక్డ్ లెండింగ్ రేటును 50 బేసిస్ పాయింట్లు (bps) పెంచింది. దీంతో వడ్డీ రేటును 8.30%కు తీసుకువచ్చింది. ఇక, గృహ రుణాలపై వడ్డీ రేటు కూడా 8.10% కి పెరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Banks, Canara Bank, FD rates, Fixed deposits