BUSINESS NEWS TELUGU PAYTM FILES FOR 16600 CRORE RUPEES IPO HERE IS OTHER MORE DETAILS SK
Paytm IPO: రూ.16,600 కోట్లతో పేటీఎం ఐపీవో.. పూర్తి వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
Paytm IPO: మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి వన్ 97 కమ్యూనికేషన్స్ సంస్థ రూ.1696 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరం 2,420 కోట్ల నష్టాన్ని చనిచూసింది.
వ్యాపార విస్తరణ, ఎకో సిస్టంను బలోపేతం చేసుకునేందుకు పేటీఎం (Paytm) మాతృసంస్థ వన్ 97 కమ్యూనికేషన్స్ భారీ ప్రణాళికలు రచించింది. ఇందుకోసం ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) ద్వారా రూ.16,600 కోట్ల పెట్టుబడులు ఆహ్వానించేందుకు సిద్ధమైందని రాయిటర్స్ పేర్కొంది. రూ.8,300 కోట్ల షేర్లను మార్కెట్లో పెట్టడంతో పాటు కొత్తగా రూ.8,300 విలువైన తాజా షేర్లను ఇష్యూ చేయనుంది. ఇలా రూ.16,600 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకునేందుకు ఐపీవో బాటపట్టింది. ఈ నెల 12న జరిగిన వన్ 97 కమ్యూనికేషన్స్ సమావేశంలో షేర్హోల్డర్లు ఐపీవోకు అంగీకరించారు.
మొత్తంగా రూ.16,600 కోట్ల (2.23 బిలియన్ డాలర్ల) విలువైన షేర్లను మార్కెట్లో విడుదల చేసేందుకు అనుమతి ఇవ్వాలని మార్కెట్ రెగ్యులేటరీ సెబీకి పేటీఎం దరఖాస్తు చేసుకుంది. జేపీ మోర్గాన్ చేస్, మోర్గాన్ స్టాన్లీ, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, గోల్డ్‌మన్ సచ్స్, యాక్సిక్ క్యాపిటల్, సిటీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఈ ఐపీవోకు బుకింగ్ రన్నింగ్ మేనేజర్స్‌గా ఉండనున్నాయి. వన్ 97 కమ్యూనికేషన్స్ సొంతం చేసుకున్న పేటీఎంలో బెర్క్‌షైర్ హాత్వే, చైనాకు చెందిన యాంట్ గ్రూప్, జపాన్ సాఫ్ట్‌బ్యాంక్ కంపెనీల పెట్టుబడులు కూడా ఉన్నాయి. ప్రి ఐపీవోల భాగంగా ఆలిబాబ్.కామ్ కూడా 7.2శాతం షేర్లు దక్కించుకోనుంది.
మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి వన్ 97 కమ్యూనికేషన్స్ సంస్థ రూ.1696 కోట్ల నష్టాన్ని ప్రకటించింది. అంతకు ముందు సంవత్సరం 2,420 కోట్ల నష్టాన్ని చనిచూసింది.
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్స్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిబంధనల ప్రకారం ప్రమోటర్లు పోస్ట్ ఇష్యూ పెట్టుబడిలో కనీసం 20 శాతం కలిగి ఉండాలి. పేటీఎంను స్థాపించిన ఓసీఎల్ సంస్థ యజమాని విజయ్ శంకర్‌కు ప్రస్తుతం 14.61 శాతం అంటే ఇవి 90,15,624 ఈక్విటీ షేర్లు ఉన్నాయి. అలాగే పేటీఎం చైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా శర్మ కొనసాగనున్నారు.
కాగా, ఐపీవో సమీపిస్తున్న తరుణంలో పేటీఎంకు చెందిన కొందరు టాప్ మేనేజ్మెంట్ అధికారులు విధుల నుంచి తప్పుకున్నారు. పేటీఎం ప్రెసిడెంట్‌గా ఉంటూ కంపెనీ ఫైనాన్సియల్ డివిజన్ బాధ్యతలు చూసుకున్న అమిత్ నాయర్ గత నెలలోనే తన పదవికి రాజీనామా చేశారు. అలాగే 18 నెలల పాటు చీఫ్ హ్యూమన్ రిసోర్స్ ఆఫీసర్‌గా పని చేసిన రోహిత్ ఠాకూర్ ఈ ఏడాది మొదట్లోనే విధుల నుంచి తప్పుకున్నారు. అలాగే షియోమీ ఇండియాలో చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్‌గా చేరేందుకు మార్కెటింగ్ హెడ్‌గా ఉన్న జైకిషన్ సింగ్ కపనీ కూడా ఈ సంవత్సరం మొదట్లోనే పేటీఎంను వీడారు.
Published by:Shiva Kumar Addula
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.