మాంసం ప్రియులు ప్రస్తుతం ఆర్గానికి వ్యవసాయం ఊపు అందుకుంటున్న నేపథ్యంలో నాటు కోడిమాంసం వైపు మొగ్గు చూపుతున్నారు. నాటు కోడి గుడ్డు, మాంసం బలవర్ధక ఆహారం అంతేకాదు, రోగ నిరోధక శక్తి పెంచడంలో నాటు కోడి కూర కూడా చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుందని తేలింది. దీంతో ప్రస్తుతం మాంసం ప్రియుల ఆహర అలవాట్లలో మార్పులు వచ్చాయి. క్రమంగా నాటు కోడి వైపు ఆసక్తి చూపిస్తున్నారు. బ్రాయిలర్ కోళ్లకు ఇంజెక్షన్లు ఇచ్చి వాటిని కలుషితం చేస్తున్నారనే వార్తలు తరచూ చూస్తున్నాం. ఈ హార్మోన్ ఇంజెక్షన్లతో నెల రోజుల కోడి పిల్లను రెండు, మూడు కేజీలకు పెంచుతున్న ఘటనలు చూసాము. మరోవైపు మందులతో పెంచిన చికెన్ రుచి తగ్గిపోవడం వంటి కారణాలతో కూడా బ్రాయిలర్ మాంసం వినియోగాన్ని క్రమంగా తగ్గించేస్తున్నారు. పూర్వకాలంలో రైతులు పెరట్లో నాటు కోళ్లు విరివిగా పెంచేవారు. కాలక్రమేణా వచ్చిన మార్పులతో..ఇటీవల గ్రామాల్లో నాటు కోళ్ల పెంపకం కూడా పెరిగింది. రైతులు మళ్లీ నాటుకోళ్లు పెంపకంపై ఆసక్తి చూపిస్తున్నారు. ప్రతి జిల్లాలో చిన్న చిన్న ఫామ్లు వెలుస్తున్నాయి. పల్లెటూళ్లలో పెంచుతున్న నాటుకోళ్లను పట్టణాలు, నగరాలకు తీసుకొచ్చి వారాంతంలో విక్రయిస్తున్నారు. నాటు కోడికి పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ఇటీవల కాలంలో బ్రాయిలర్ కోళ్ల ఫారాలు మాదిరిగా నాటు కోళ్ల ఫారాలు కూడా కొత్తగా పెరిగాయి. అయితే వీటికి పిల్లలు సైతం చాలా అవసరం ఇదే వ్యాపార అవకాశంగా మారింది. కేవలం అర ఎకరం పొలం ఉంటే చాలు నాటు కోడి పిల్లల వ్యాపారం మంచి లాభసాటిగా మారింది. అయితే నాటుకోడి పిల్లల హేచరీ ఏర్పాటు కోసం మొదటగా స్థానికంగా ఉన్న రైతుల వద్ద నుంచి నాటు కోడి గుడ్లను సేకరించాల్సి ఉంటుంది. ఆ గుడ్లను పొదిగి కోడి పిల్లలను తయారుచేసే యంత్రం 'ఇంక్యుబేటర్స్'ను కూడా కొనుగోలు చేయాల్సి ఉంటుంది. వీటి ధరలు సామార్థ్యాన్ని బట్టి రూ. 50 వేల నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఇంక్యూబేటర్స్ లో నాటు కోడి పిల్లలను సేకరించి వాటిని పెద్దగా చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం షెడ్డు నిర్మాణం చేసుకోవాలి. అలాగే వాటికి రసాయనాలు కాకుండా నిపుణుల సూచనల మేరకు హార్మోన్స్, అలాగే దాణా ఏర్పాటు చేసుకోవాలి. సుమారు 500 నుంచి 800 వరకూ నాటు కోళ్లను పెంచితే వాటి నుంచి కోడి గుడ్లను సేకరించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ కోడి గుడ్లను ఇంక్యూబేటర్స్ ద్వారా పిల్లలుగా పొదిగిన తర్వాత వాటిని కొద్ది కాలం పెంచి నాటుకోడి ఫారం రైతులకు అమ్మాల్సి ఉంటుంది. అయితే నాటు కోళ్ల నుంచి కోడి గుడ్లను సేకరించిన వెంటనే కోళ్ల ముందుగా ఫార్మాల్డిహైడ్ ద్రావణంతో శుభ్రం చేస్తారు. తర్వాత, 6 గంటల పాటు బ్యాక్టీరియా, సూక్ష్మక్రిములు, వైరస్ లేకుండా ఉండేందుకు ప్యూమిగేషన్ చేస్తారు. 21 రోజుల పాటు ఎలాంటి వైరస్ గుడ్లకు సోకకుండా కాపాడుతుంది. ఈ కోడి పిల్లలు మార్కెట్లో సుమారు 20 నుంచి 35 రూపాయల వరకూ ధర పలుకుతున్నాయి. 500-800 నాటు కోళ్ల నుంచి సుమారు నెలకు 3-5 వేల కోడి పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు. ఈ లెక్కన ఖర్చులు పోయినా నెలకు 1 లక్ష రూపాయల వరకూ సంపాదించవచ్చు.