సార్వత్రిక ఎన్నికలకు ముందు చివరి బడ్జెట్ (Budget)ను ప్రవేశపెట్టేందుకు భాజపా ప్రభుత్వం సన్నద్ధమైంది. ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో ఉపశమనాలు లభిస్తాయని అన్ని వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో జనవరి 31 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదే రోజున(మంగళవారం) ప్రభుత్వం ఆర్థిక సర్వే (Economic Survey) నివేదికను విడుదల చేయనుంది. 2022-23 సంవత్సరానికి సంబంధించిన సర్వేను కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitaraman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఈ ఆర్థిక సర్వే అంటే ఏంటి? బడ్జెట్‌కు, ఆర్థిక సర్వేకు మధ్యనున్న వ్యత్యాసమేంటి? మొదటి ఆర్థిక సర్వేను ఎప్పుడు ప్రవేశపెట్టారు? వంటి విషయాలను తెలుసుకుందాం.
* ఆర్థిక సర్వే
దేశంలోని ఆర్థిక స్థితిగతులతో పాటు ప్రస్తుత, రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాల గురించి తెలియజేసేదే ఆర్థిక సర్వే. 2022-23 సంవత్సరంలో ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల రాబట్టిన ఫలితాలు, ఆర్థికపరమైన సంస్కరణలు, సాధించిన వృద్ధి తదితర వివరాలను ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది.
అదే సమయంలో రాబోయే సంవత్సరంలో అంటే 2023-24లో దేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొనే అవకాశం ఉంటుంది? వాటిని పరిష్కరించుకునే దిశగా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలనే అంశాలు ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది. విదేశీ మారకం నిల్వలు, మౌలిక సదుపాయాలు, ఎగుమతులు, దిగుమతులు, వ్యవయసాయోత్పత్తి, పారిశ్రామికోత్పత్తి, నగదు చలామణి వంటి అంశాలను కూడా ఆర్థిక సర్వే స్పష్టం చేస్తుంది.
* ఆర్థిక సర్వేలో రెండు భాగాలు
ఏటా విడుదలయ్యే ఆర్థిక సర్వే సాధారణంగా రెండు భాగాలుగా ఉంటుంది. పార్ట్ A, పార్ట్ B. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దేశం సాధించిన పురోగతి, ఆర్థిక స్థితిగతులు, ప్రభుత్వ విధానాలు తదితర వివరాలను పార్ట్ A వెల్లడిస్తుంది. ఇక పార్ట్ B.. విద్య , వైద్యం, సామాజిక భద్రత, పేదరికం, మానవాభివృద్ధి, వాతావరణం తదితర ముఖ్యమైన సమస్యల గురించి చర్చిస్తుంది. అయితే, గతేడాది ఆర్థిక సర్వేను ఒకే భాగంగా వెల్లడించడం గమనార్హం.
* ఆర్థికశాఖ ఆధ్వర్యంలో రూపకల్పన
సాధారణంగా కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు(Chief Economic Advisor-CEA) ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సర్వే నివేదికను రూపొందిస్తారు. అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్‌లో ఆర్థిక సర్వేను ప్రవేశపెడతారు. ఈ ప్రక్రియ ముగియగానే కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు ప్రెస్‌మీట్ నిర్వహించి ఆర్థిక సర్వేలోని అంశాల గురించి వివరిస్తారు. లైవ్‌లో ఈ ప్రెస్ కాన్ఫరెన్స్‌ని వీక్షించొచ్చు.
అయితే, సీఈఏ పదవి ఖాళీ ఏర్పడటంతో గతేడాది(2021-22) ఆర్థిక సర్వేను ప్రధాన ఆర్థిక సలహాదారు(Principal Economic Advisor) సంజీవ్ సన్యాల్ రూపొందించారు. 2021-22 సంవత్సరంలో 9.1శాతం ఆర్థిక వృద్ధిని సాధిస్తుందని ఈ సర్వే వెల్లడించింది. 2022-23 ఫైనాన్షియల్ ఇయర్‌లో 8- 8.5 మధ్య జీడీపీ వృద్ధి ఉంటుందని అంచనా వేసింది.
ఇది కూడా చదవండి : 2022లో ప్రకటించిన అప్‌డేటెడ్ రిటర్న్ అంటే ఏంటి? ఈ రూల్ పూర్తి వివరాలివే!
* తొలిసారి ఎప్పుడంటే
మొట్టమొదటి సారిగా ఆర్థిక సర్వేను 1950-51 సంవత్సరంలో పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టారు. అయితే, తొలుత బడ్జెట్‌తో పాటే ఆర్థిక సర్వేను వెల్లడించారు. 1964 వరకు ఈ సంప్రదాయాన్ని పాటించారు. 1964 అనంతరం విడిగా ప్రవేశపెడుతున్నారు. బడ్జెట్‌కు ముందు ఒకరోజు ఈ ఆర్థిక సర్వేను ప్రవేశపెడుతారు. పార్లమెంట్‌లో ప్రవేశ పెట్టిన అనంతరం సర్వేను www.indiabudget.gov.in/economicsurvey ద్వారా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* బడ్జెట్‌కు సర్వేకు వ్యత్యాసం
బడ్జెట్‌లో కేటాయింపులు, ప్రతిపాదనలు, ఖర్చులను మాత్రమే పేర్కొంటారు. ఆర్థిక సర్వేను ఆధారంగా చేసుకుని ఈ బడ్జెట్‌ని రూపొందిస్తారు. దేశ ఆర్థిక పరిస్థితులు, పనితీరు, విశ్లేషణ వంటివాటిని ఆర్థిక సర్వే వెల్లడిస్తుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023, Indian Economy, Nirmala sitharaman, Personal Finance