కేంద్ర బడ్జెట్ 2023 (Union Budget 2023)లో తమ వ్యాపారాన్ని మెరుగుపరిచే చర్యలను భారత ప్రభుత్వం ప్రకటించవచ్చని బీమా రంగం (Insurance Industry) ఆశిస్తోంది. ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ 2023 ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త పద్దుపై చాలా అంచనాలు ఉన్నాయని ప్రొబస్ ఇన్సూరెన్స్ బ్రోకర్ డైరెక్టర్ రాకేష్ గోయల్ పేర్కొన్నారు. ఇండియాలో ఇన్సూరెన్స్ తీసుకునేవారి సంఖ్యను పెంచడానికి, ముఖ్యంగా టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను మెరుగుపరచడానికి బీమాకు ప్రత్యేక విభాగాన్ని కేటాయించాల్సిన అవసరం ఉందన్నారు. న్యూస్18తో మాట్లాడుతూ.. సెక్షన్ 80C, 80D మాదిరిగానే, బీమాకు ప్రత్యేకంగా ఒక సెక్షన్‌ను కేటాయించాలని నొక్కి చెప్పారు.
* ట్యాక్స్ డిడక్షన్ లిమిట్ పెంచాలి
ఇన్‌కమ్ ట్యాక్స్ , 1961లోని సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ డిడక్షన్ లిమిట్ చాలా ఏళ్లుగా అలాగే ఉంటోందని, ఆ లిమిట్‌ను ఏడాదికి రూ.2.5 లక్షలకు పెంచితే ప్రయోజనకరంగా ఉంటుందని రాకేష్ గోయల్ పేర్కొన్నారు. నాన్-లైఫ్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకుంటే, హెల్త్ ఇన్సూరెన్స్ లిమిట్ ప్రస్తుతం రూ.25,000గానే ఉందని, దానిని రూ.50,000కి పెంచాలని సూచించారు.
ప్రస్తుతం యాన్యుటీలపై పెట్టుబడిదారులే పన్నులు విధిస్తున్నారని.. ఫలితంగా తక్కువ రిటర్న్స్ లభిస్తున్నాయని, యాన్యుటీలకు పన్ను మినహాయింపు ఉంటే పెట్టుబడిదారులకు భారీ ఉపశమనం కలుగుతుందని వివరించారు.
* జీఎస్‌టీ స్లాబ్ తగ్గించాలి
ఇన్సూరెన్స్ ఇండస్ట్రీకి చెందిన RenewBuy కో-ఫౌండర్ బాలచందర్ శేఖర్ మాట్లాడుతూ, బీమా కవరేజీతో తమను తాము రక్షించుకునేలా ప్రజలను ప్రోత్సహించడానికి బీమా పరిశ్రమలో పన్ను మినహాయింపులు, పన్ను ప్రోత్సాహకాల (Tax incentives)పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అన్నారు.
పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్‌కు అనుగుణంగా జీవిత బీమా కోసం జీఎస్‌టీ మినహాయింపు ఇవ్వాలని లేదా జీఎస్‌టీ స్లాబ్‌ను తగ్గించాలని కూడా ఆయన సూచించారు. GST రేటుతో పాటు ఆరోగ్య బీమాపై పన్ను మినహాయింపులు, అలాగే పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని బాలచందర్ పేర్కొన్నారు.
* ప్రభుత్వ సహకారం తప్పనిసరి
ఇండస్ట్రీ నిపుణుల ప్రకారం, భారతదేశంలో బీమా కవరేజీని పెంచడానికి బీమా కంపెనీలు, అగ్రిగేటర్లు, డిస్ట్రిబ్యూటర్లు తమకు సాధ్యమైనంత కృషి చేస్తున్నారు. అయితే ఈ విషయంలో సక్సెస్ సాధించాలంటే ప్రభుత్వ సహకారం తప్పనిసరి. ఈ ఇన్సూరెన్స్ వంటి రంగాలకు ఆర్థిక మంత్రి నిధులు కేటాయిస్తేనే ఇది సాధ్యమవుతుంది.
ఇది కూడా చదవండి : కేంద్ర బడ్జెట్‌లో రైల్వే బడ్జెట్ ఎప్పుడు, ఎలా భాగమైంది..? ఆసక్తికరమైన విషయాలు
మరోవైపు హెల్త్, లైఫ్ ఇన్సూరెన్స్‌ను GST నుంచి మినహాయించడం, ఐటీ సెక్షన్ 80D కింద ఆరోగ్య బీమా ప్రీమియంల కోసం డిడక్షన్ లిమిట్ పెంచడం వల్ల బీమా రంగంలో వృద్ధి పెరుగుతుందని ఇండస్ట్రీ నిపుణులు భావిస్తున్నారు. టర్మ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీలపై మినహాయింపుల కోసం ప్రత్యేక సెక్షన్ అందించాలని వారు సూచిస్తున్నారు. సెక్షన్ 80C, ఇతర సెక్షన్లలో పన్ను నిబంధనలను పెంచడం ప్రజలు జీవిత బీమాలో పెట్టుబడి పెట్టడానికి వీలు కల్పిస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023, Health Insurance, Insurance