ఏటా పన్ను చెల్లింపుదారులు నిర్ణీత గడువులోగా ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ (ITR) ఫైల్ చేయాల్సి ఉంటుంది. చాలా మంది గడువులోగా ఫైల్ చేయలేరు. కొందరు ఫైల్ చేసిన రిటర్న్‌లో ఏవైనా తప్పులు దొర్లవచ్చు. అటువంటి వారికి ఉపయోగపడేలా కొన్ని ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇందులో భాగంగానే ఫైనాన్స్ యాక్ట్ 2022 (Finance Act 2022), అప్‌డేటెడ్ రిటర్న్ దాఖలు చేయడానికి ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 139లో సబ్‌సెక్షన్ (8A)ని చేర్చింది. 2022లో సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ ముగిసిన రెండు సంవత్సరాలలోపు అదనపు పన్ను చెల్లింపుపై అప్‌డేటెడ్ రిటర్న్(ITR-U) ఫైల్ చేసే అవకాశం పన్ను చెల్లింపుదారులకు కల్పించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి కేంద్ర బడ్జెట్‌ను సమర్పిస్తూ కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్ ఈ నిబంధనను ప్రకటించారు.
* అప్‌డేటెడ్ రిటర్న్ నిబంధనను ప్రభుత్వం ఎందుకు తీసుకొచ్చింది?
నిర్మలా సీతారామన్ 2022-23 బడ్జెట్ ప్రసంగంలో.. ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసినప్పుడు ఏవైనా లోపాలు, తప్పులు జరిగినట్లు పన్ను చెల్లింపుదారులు గుర్తిస్తే, వాటిని సరిదిద్దుకోవడానికి అప్‌డేటెడ్ రిటర్న్ ఉపయోగపడుతుందని చెప్పారు.
పన్ను చెల్లింపులో అవకతవకలకు పాల్పడినట్లు ఐటీ డిపార్ట్‌మెంట్ గుర్తిస్తే, చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. అయితే కొత్త ప్రతిపాదన పన్ను చెల్లింపుదారులపై నమ్మకాన్ని కలిగిస్తుందని పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చే మార్పును తీసుకురావడంలో ఇది కీలక అడుగని ఆమె చెప్పారు.
* అప్‌డేటెడ్ రిటర్న్ ఫీచర్స్
అదనపు పన్ను చెల్లింపుపై అప్‌డేటెడ్ రిటర్న్ ఫైల్ చేసే అవకాశం కల్పిస్తుంది. ముందస్తుగా ఫైల్ చేసిన ఇన్‌కం ట్యాక్స్ రిటర్న్‌లో పేర్కొనడం మర్చిపోయిన ఆదాయాన్ని ప్రకటించడానికి వీలు ఉంటుంది. సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ ముగిసిన రెండు సంవత్సరాలలోపు అప్‌డేటెడ్ రిటన్న్ దాఖలు చేయవచ్చు.
ఇన్‌కం టాక్స్ ఇండియా వెబ్‌సైట్ సమాచారం ప్రకారం.. సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్‌కి సంబంధించిన ఒరిజినల్, బిలేటెడ్, రివైజ్డ్ రిటర్న్‌తో సంబంధం లేకుండా అప్‌డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయవచ్చు. సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ ముగిసిన 24 నెలలలోపు ఎప్పుడైనా అప్‌డేటెడ్ రిటర్న్‌ను ఫైల్ చేయవచ్చు.
ఇది కూడా చదవండి : సమయం లేదు మిత్రమా.. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకున్నారో లేదో చెక్ చేయండి..!
* అప్‌డేటెడ్ రిటర్న్ ఫైల్ చేయలేని సందర్భాలు
అయితే అప్‌డేటెడ్ రిటర్న్‌ను ఫైల్ చేయలేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఉదాహరణకు అప్‌డేటెడ్ రిటర్న్ నష్టానికి సంబంధించినది అయితే ఫైల్ చేసే అవకాశం లేదు. అసెస్సీ ఫైల్ చేసిన ఒరిజినల్, రివైజ్, బిలేటెడ్ రిటర్న్‌లో పేర్కొన్న పన్నును తగ్గించే విధంగా ఉంటే అప్‌డేటెడ్ రిటర్న్‌ను ఫైల్ చేయలేరు. రివైజ్, బిలేటెడ్, ఒరిజినల్ రిటర్న్ ఆధారంగా అప్‌డేటెడ్ రిటర్న్ రీఫండ్ డ్యూని పెంచుతున్న సందర్భంలోనూ అప్‌డేటెడ్ రిటర్న్‌ను ఫైల్ చేసే అవకాశం లేదు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget 2023, Income tax, ITR