కొత్త బడ్జెట్ ఊరటనిచ్చేనా? కేంద్ర బడ్జెట్ 2021లో సొంతింటి కల సాకారం చేసుకునే మార్గాలకు కొత్త రోడ్ మ్యాప్ ఇస్తారా? వచ్చే నెలాఖరున కేంద్ర ఆర్థికశాఖామంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) పార్లమెంట్ లో బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇప్పుడిదే హాట్ టాపిక్ గా మారింది. వ్యవసాయ రంగం తర్వాత మనదేశంలో అత్యధికులకు ఉపాధి కల్పిస్తున్న రంగంగా నిలిచిన రియల్ ఎస్టేట్ కరోనా కారణంగా మందగమనంలో కొట్టుమిట్టాడుతోంది. బ్యాంకులు అత్యల్ప వడ్డీకే హోం లోన్లు ఇస్తున్నప్పటికీ ..ఈ కంటితుడుపు చర్యలు సరిపోవని మరిన్ని రాయితీలు భారీ ఎత్తున ఇస్తేనే ఈ రంగం కోలుకుంటుందని రియాల్టీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందరికీ సొంత ఇల్లు తమ అజెండా అంటున్న కేంద్రం ఈమేరకు సరికొత్త చర్యలతో నిలువనీడను కొనే వెసులుబాటు కల్పించేలా ఎలాంటి ఉద్దీపన చర్యలు తీసుకుంటుందోనని సామాన్యులు ఎదురుచూపులు చూస్తున్నారు. మహారాష్ట్ర వంటి పలు రాష్ట్రాల్లో ఇప్పటికే స్టాంప్ డ్యూటీ తగ్గించటంతో ముంబైలో రియల్ ఎస్టేట్ రంగం బాగా పుంజుకున్న నేపథ్యంలో ఈసారి మధ్యతరగతి వారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కేంద్ర బడ్జెట్ పై భారీగా ఆశలున్నాయి.
హౌజింగ్ ఫర్ ఆల్ కోసం..
కోవిడ్-19 (Covid-19) కారణంగా రియల్ ఎస్టేట్ కుదేలవటం, లాక్ డౌన్ (lockdown)తో నిర్మాణ రంగ కూలీలంతా తమ సొంతూళ్లకు వలసపోవటంతో ఈ రంగానికి చికిత్స చేయటం అత్యవసరంగా మారింది. మరోవైపు ఆకాశాన్నంటున్న ఇళ్ల ధరల కారణంగా సేల్స్ నేలచూపులు చూస్తున్నాయి. ఇప్పటికే కట్టి అమ్ముడుబోని ఇన్వెంటరీలకు, నిర్మాణంలో ఉన్న ఇళ్లకు డిమాండ్ సృష్టించాలంటే కేంద్రం పలు చర్యలు తీసుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఇందుకు మొదటిసారి ఇల్లు కొంటున్న వారికి మరింత ఆదాయపు పన్ను (income tax) మినహాయింపు ఇవ్వాలని కోరుతున్నారు. ఆర్థిక వ్యవస్థకు పరుగులు జోడించేందుకు నోషనల్ రెంటల్ ఇన్కంపై పన్నులు వంటివి రద్దు చేయాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. "అందరికీ ఇల్లు" (housing for all) అనే ప్రభుత్వ పథకం సాకారం కావాలంటే దిగువ, మధ్యతరగతివారు ఇల్లు కొనే పరిస్థితులు సృష్టించక తప్పదు, ఎందుకంటే మనదేశంలో వీరి జనాభా అత్యధికం. సేల్స్ లేక ఇబ్బందులో పడిన చిన్న బిల్డర్లను ఆదుకునేలా కేంద్ర బడ్జెట్ లో చర్యలుండాలని బిల్డర్ల సంఘం కోరుతోంది. ఇక లిటిగేషన్లు, రియల్ ఎస్టేట్ సంస్థలు దివాళా తీసినప్పుడు ఇళ్లను కొన్న లబ్దిదారులు ఎదుర్కొనే సమస్యలపై శాశ్వత పరిష్కార మార్గాలను కేంద్రం రూపొందిస్తే చాలామంది ఇల్లు కొనేందుకు సాహసం చూపుతారు. ఆకాశాన్నంటుతున్న భూముల ధరలను ప్రభుత్వం నియంత్రిస్తేనే సరసమైన ధరలకు ఇళ్లు అందుబాటులోకి వస్తాయి.
జీఎస్టీ
విదేశీ నిర్మాణ సంస్థలు మనదేశంలో పెట్టుబడులు పెట్టేందుకు అత్యధిక ఆసక్తి చూపుతున్నప్పటికీ జీఎస్టీ (GST) వంటివి ఇంటి ధరలను విపరీతంగా పెంచేస్తూ, సేల్స్ పై దుష్ప్రభావం చూపుతున్నాయి. ఈఎంఐలపై వడ్డీ రాయితీని కనీసం 5 ఏళ్ల పాటు పొడగించటం ద్వారా గృహ నిర్మాణ రంగానికి టానిక్ ఇవ్వచ్చు. సెక్షన్–24 కింద హోం లోన్ మీద వడ్డీ మినహాయింపును 10 లక్షల రూపాయలకు పెంచాలి. కోవిడ్–19 నేపథ్యంలో దేశంలో రియల్ ఎస్టేట్ సెంటిమెంట్ ఏప్రిల్, మే, జూన్ నెలల్లో ఆల్టైమ్ కనిష్ట స్థాయికి పడిపోయింది. కనుక కొంతకాలం పాటు పన్నులు, లెవీలు, స్టాంప్ డ్యూటీలు, జీఎస్టీ తగ్గింపు అత్యవసరంగా మారింది. రుణ పునర్వ్యవస్థీకరణ దిశగానూ చర్యలు బడ్జెట్ లో చేపట్టేలా కొత్త కేంద్ర బడ్జెట్ ఉండాలనే ఆశలు ఊపందుకుంటున్నాయి.
Published by:Sumanth Kanukula
First published:January 18, 2021, 13:48 IST