మరో రెండు వారాల్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్లో రైతులపై వరాలు కురిసే అవకాశం కనిపిస్తోంది. వ్యవసాయ రంగానికి చేయూతనిచ్చేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2019-20 బడ్జెట్‌లో రైతులకు వడ్డీ లేని స్వల్పకాలిక రుణాలు ప్రకటించే అవకాశం ఉందన్నది మనీకంట్రోల్ కథనం. ఎన్నికలకు ముందు బీజేపీ మేనిఫెస్టోలో రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని బీజేపీ హామీ ఇచ్చింది. రైతులకు వడ్డీలేని స్వల్పకాలిక రుణాలు ఇస్తామన్నది బీజేపీ హామీల్లో ఒకటి. వ్యవసాయం కోసం రూ.1 లక్ష వరకు రుణాలు తీసుకునే రైతులు వడ్డీ చెల్లించాల్సిన అవసరం లేకుండా 1-5 ఏళ్లలో అసలు చెల్లిస్తే చాలని బీజేపీ మేనిఫెస్టోలో వివరించింది.
లోక్‌సభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంతో రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని రైతులందరికీ వర్తింపజేస్తామని కూడా బీజేపీ హామీ ఇచ్చింది. రెండోసారి ప్రధానిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలి కేబినెట్ మీటింగ్‌లోనే ఆ హామీ నెరవేరుస్తూ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు... రైతులకు కనీస పెన్షన్ నెలకు రూ.3,000 ఇచ్చే పథకానికీ ఆమోదముద్ర తెలిపారు. ఇప్పుడు రైతులకు ఇచ్చిన మరో హామీ అయిన వడ్డీ లేని రుణాలను కూడా ప్రకటించనున్నారు. 2019 జూలై 5న పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌లో రైతులకు రూ.1 లక్ష వరకు వడ్డీ లేని స్వల్పకాలిక రుణాలు ప్రకటించొచ్చని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు మనీకంట్రోల్‌తో మాట్లాడుతూ తెలిపారు.
Motorola One Vision: మోటోరోలా వన్ విజన్... ఎలా ఉందో చూడండి