FabIndia: దీపావళి పండుగను 'జష్న్- ఇ -రివాజ్' అని పేర్కొన్న ఫ్యాబ్​ ఇండియా..మత వర్గాల అభ్యంతరం

FabIndia

దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ఫ్యాబ్ ఇండియా తాజాగా రిలీజ్​ చేసిన యాడ్​పై దుమారం చెలరేగుతోంది.

  • Share this:
తనిష్క్, మాన్యవర్ వంటి ప్రముఖ వస్త్ర వ్యాపార, జ్యూవెలరీ సంస్థలు ఇటీవల నెటిజన్ల ఆగ్రహానికి గురైన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి పాపులర్​ డిజైనర్​ వస్త్ర వ్యాపార సంస్థ ఫ్యాబ్​ ఇండియా చేరింది. రానున్న దీపావళి పండుగను దృష్టిలో పెట్టుకొని ఫ్యాబ్ ఇండియా తాజాగా రిలీజ్​ చేసిన యాడ్​పై దుమారం చెలరేగుతోంది. ఫ్యాబ్​ ఇండియా ఇటీవల చేసిన ట్వీట్​ గమనిస్తే ‘‘ప్రేమకు, కాంతికి చిహ్నమైన దీపావళి పండుగకు స్వాగతం. జష్న్​–ఇ–రివాజ్​ పేరుతో ఫ్యాబ్​ ఇండియా తీసుకొస్తున్న దీపావళి కలెక్షన్​, భారతీయ సంస్కృతికి అందమైన సేకరణ” అంటూ దీపావళి యాడ్​ను ట్వీట్​ చేసింది. ఇదే ఇప్పుడు వివాదానికి కారణమైంది.

ఒక వర్గం పండుగైన దీపావళి గురించి ‘జష్న్–ఇ–రివాజ్’ పేరుతో మరో వర్గం పండుగలా బ్రాండింగ్ చేయడంపై నెటిజన్లు​ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాబ్​ ఇండియా ఒక వర్గం మనోభావాలను దెబ్బతీస్తుందని, కస్టమర్లపై మరో వర్గం సిద్దాంతాలను బలవంతంగా రుద్దుతుందని ఆర్​ఎస్​ఎస్​, బీజేపీ నాయకులు వాదిస్తున్నారు. దీంతో బాయ్​కాట్​ ఫ్యాబ్​ ఇండియా #BoycottFabIndia 'Jashn-e-Riwaaz' హ్యాష్​ట్యాగ్​ను ట్విట్టర్‌లో ట్రెండ్​ చేస్తున్నారు.

దీనిపై ఒక ట్విట్టర్​ యూజర్​ స్పందిస్తూ “ఈ సంవత్సరం ఫ్యాబ్​ ఇండియాలో కొనుగోళ్లను బైకాట్ చేస్తున్నా. దీపావళి పండుగకు ఎవరు జష్న్-ఇ-రివాజ్ అని పేరు పెట్టారు?? దీపావళి సెక్యులర్​ పండుగ కాదు. ఇది ఒక వర్గం పండుగ మాత్రమే.’’ అంటూ #BoycottFabIndia హ్యాష్​ట్యాగ్​తో ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. మరొక యూజర్ స్పందిస్తూ ‘‘ఫ్యాబ్​ ఇండియా ఒక వర్గం పండుగైన దీపావళిని జష్న్ -ఇ -రివాజ్​గా పేర్కొనడం ముమ్మాటికి ఒక వర్గం మనోభావాలను దెబ్బతీయడమే. ఒక వర్గం గుర్తింపును గౌరవించని కంపెనీ, ఒక వర్గం నుంచి వ్యాపారాన్ని ఆశించకూడదు. అందుకే ఫ్యాబ్​ ఇండియాను బాయ్ కాట్​ చేస్తున్నా" అంటూ ట్వీట్​ చేశారు. ఇదే తరహాలో అనేక మంది నెటిజన్లు కామెంట్​ చేస్తున్నారు. ఇలా వరస ట్వీట్లతో కంపెనీ దిద్దుబాటు చర్యలకు దిగింది. కంపెనీ తన ట్వీట్​ను తొలగించింది.

వైరల్​ అవుతున్న ‘బాయ్ కాట్​ఫ్యాబ్​ ఇండియా’ హ్యాష్​ట్యాగ్​..

బీజేపీ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వి సూర్య ట్విట్టర్​లో ఫ్యాబ్​ ఇండియా ప్రకటనను తీవ్రంగా ఖండించారు. ఫ్యాబ్​ ఇండియాకు మద్దతు పలికిన ఇన్ఫోసిస్​ మాజీ సీఈవో టీవీ మోహన్​ దాస్​పై కూడా ఆయన విమర్శలు గుప్పించారు. అనేక మంది నెటిజన్లు ఫ్యాబ్​ ఇండియాపై ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా కొంతమంది మాత్రం భిన్నంగా స్పందిస్తున్నారు. ఫ్యాబ్​ ఇండియా యాడ్​లో తప్పేమీ లేదని, దయచేసి వివాదం సృష్టించవద్దు అంటూ నెటిజన్లను కోరుతున్నారు.
Published by:Krishna Adithya
First published: