BMW Cars: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ కంపెనీ బీఎమ్‌డబ్ల్యూ (BMW) ఇండియాలో తన సేల్స్ పెంచుకునేందుకు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. ఈ కంపెనీ తమ రెండంకెల అమ్మకాల వృద్ధిని కొనసాగించడానికి ఈ ఏడాది ఎలక్ట్రిక్ వాహనాలతో(Electric vehicles) సహా ఏకంగా 19 కారు మోడళ్లను భారత మార్కెట్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేసింది. BMW గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ అయిన విక్రమ్ పవా సోమవారం మాట్లాడుతూ.. 2023లో భారతదేశంలో మొత్తం 22 ఉత్పత్తులను లాంచ్ చేయబోతున్నట్లు ప్రకటించారు. వీటిలో 19 కార్లు, మూడు బైక్‌లు ఉంటాయన్నారు. ఇక BMW సంస్థ 2023 సంవత్సరంలో భారతదేశంలో మునిపెన్నడూ లేని విధంగా అత్యధిక కార్లను విక్రయించి, అధిక ఆదాయాన్ని సాధించడం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికే, భారత్‌లో ఎలక్ట్రిక్ వాహనాలతో సహా పెద్ద ఎత్తున కొత్త కారు మోడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. కొత్త కారు మోడళ్లకు, ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు భారత మార్కెట్‌లో మంచి ఆదరణ లభిస్తుండగా.. తమ ఎలక్ట్రిక్ వెహికల్స్ విక్రయాలు కూడా గణనీయంగా పెరుగుతాయని కంపెనీ భావిస్తోంది. దేశీయ మార్కెట్‌లో మొత్తం BMW కార్ల అమ్మకాలలో ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ దాదాపు 15% వరకు వాటా కలిగి ఉంటాయని కంపెనీ అంచనా వేస్తోంది. ఇంకా, కంపెనీ ఈ సంవత్సరం భారత్‌లో బీఎమ్‌డబ్ల్యూ మోటోరాడ్ బిజినెస్ కింద మూడు కొత్త బైక్ మోడళ్లను తీసుకొచ్చేందుకు ప్లాన్ చేసింది. ప్రొడక్ట్ పోర్ట్‌ఫోలియోను విస్తరించడం ద్వారా, కంపెనీ మరింత మంది కస్టమర్లను ఆకర్షించాలని, భారతదేశంలో తన అమ్మకాలను పెంచుకోవాలని ఆశిస్తోంది.
కంపెనీ అధికారి ప్రకారం, అప్‌కమింగ్ లాంచ్‌లలో సరికొత్త మోడళ్లు, ఇప్పటికే ఉన్న వాటి ఫేస్‌లిఫ్ట్‌లు ఉండనున్నాయి. BMW రీసెంట్ ఇయర్స్‌లో ఏటా 20 కంటే ఎక్కువ వాహనాలనే పరిచయం చేస్తోంది. అయితే 2023 లైనప్‌లో కొత్త లేదా రిఫ్రెష్డ్ మోడళ్లు ఎక్కువగా ఉండనున్నాయి. గతేడాది డిసెంబర్, ఈ ఏడాది జనవరి నెలల మధ్య ఎనిమిది వారాల వ్యవధిలో, BMW ఎనిమిది ఉత్పత్తులను లాంచ్ చేసిందని.. ఫలితంగా 5 వేల 500 కార్లు, 4 వేల 500 బైక్‌లకు డిమాండ్ ఏర్పడిందని పవా పేర్కొన్నారు.
కార్ల మొత్తం డిమాండ్‌లో 600 బీఎమ్‌డబ్ల్యూ ఎలక్ట్రిక్ వెహికల్ మోడళ్లకు డిమాండ్ ఉన్నట్టు పవా తెలిపారు. పవా ప్రకారం, మొత్తం డిమాండ్‌లో ఎలక్ట్రిక్ కార్లకు 11% డిమాండ్ ఉంది. ఈ సంవత్సరం చివరి నాటికి, BMW తమ ఎలక్ట్రిక్ మోడళ్లతో డిమాండ్‌లో 15%ని తాకాలని భావిస్తోంది. ఇక అధికారిక ప్రకటన ప్రకారం, ప్రస్తుతం భారతదేశంలో నాలుగు ప్రత్యేకమైన ఎలక్ట్రిక్ వాహనాల మోడళ్లను అందిస్తున్న ఏకైక వాహన తయారీ సంస్థగా BMW నిలుస్తోంది.
Indian Railways: 2014 కంటే మూడు రెట్లు వేగంతో పూర్తవుతున్న రైల్వే ప్రాజెక్టులు..ఎలా సాధ్యమైంది?
ప్రపంచవ్యాప్తంగా, BMW 2023 చివరి నాటికి 12 ఫుల్లీ-ఎలక్ట్రిక్ ప్రొడక్ట్స్ తీసుకురావాలని యోచిస్తోంది. సరఫరాలు, నియంత్రణ ఆమోదాల ఆధారంగా కాలక్రమేణా వాటన్నింటినీ భారతదేశానికి తీసుకురావాలని ప్రణాళికలు రచిస్తోంది. పవా ప్రకారం, భారతదేశంలో పెట్రోల్, డీజిల్ మోడళ్లను అందించడాన్ని కూడా కొనసాగించాలని కంపెనీ యోచిస్తోంది. అలానే దేశంలో ప్రీమియం కార్లకు డిమాండ్ పెరుగుతోంది. ఆ డిమాండ్ ను కంపెనీ చేరుకోవడానికి, సద్వినియోగం చేసుకోవడానికి తన వంతు కృషి చేస్తోంది. సప్లయ్ చైన్ సవాళ్లు అలాగే ఉన్నా, డిమాండ్ బలంగా ఉన్నా కంపెనీ మేనేజ్ చేయగలుగుతుందని పవా అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.