భారత వ్యాపార రంగంల్లో టాటా సన్స్, సైరస్ మిస్త్రీ వివాదం కొన్నాళ్లుగా చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంలో ఎట్టకేలకు టాటా సన్స్‌కు ఊరట లభించింది. వీరి వివాదానికి సంబంధించి శుక్రవారం సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సైరస్ మిస్త్రీని తిరిగి ఛైర్మన్‌గా నియమించాలంటూ నేషనల్ కంపెనీ లా అప్పిలేట్ ట్రైబ్యునల్ గతంలో ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు నిలిపివేసింది. ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది. ఈ ధర్మాసనంలో జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రహ్మణ్యం సభ్యులుగా ఉన్నారు. టాటా సన్స్ ఛైర్మన్‌గా సైరస్ మిస్త్రీ తొలగింపును అత్యున్నత న్యాయస్థానం పూర్తిగా సమర్థించింది.
2016లో సైరస్ మిస్త్రీని ఛైర్మన్ పదవి నుంచి తొలగిస్తూ టాటా సన్స్ బోర్డు నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఆ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సైరస్ మిస్త్రీ నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్‌లో కేసు వేశారు. దానిపై విచారించిన NCLT.. సైరస్ మిస్త్రీని తిరిగి ఛైర్మన్‌గా నియమించాలని 2019 డిసెంబరు 18న తీర్పు వెలువరించింది. ఆ తీర్పుపై 2020 జనవరి 2న టాటా సన్స్ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. అనంతరం టాటా కంపెనీ అధినేత రతన్ టాటా కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు అదే నెల 10న NCLT తీర్పుపై స్టే విధించింది. అంతేకాదు టాటా సన్స్ షేర్లను షాపూర్జీ పల్లోంజి సంస్థ ఎక్కడా తాకట్టు పెట్టకుండా ఆంక్షలు విధించింది. ఈ వివాదంపై డిసెంబరు 8న తుది వాదనలను విన్న సుప్రీంకోర్టు.. డిసెంబరు 17న తీర్పు రిజర్వ్‌లో పెట్టింది. తాజాగా తుది తీర్పు వెలువరించింది.
— Ratan N. Tata (@RNTata2000) March 26, 2021
సుప్రీంకోర్టు తీర్పుపై ట్విటర్ వేదికగా రతన్ టాటా స్పందించారు. ఇది ఒకరి విజయం, మరొకరి ఓటమో కాదని అన్నారు. కొన్నాళ్లుగా తనపైనా, టాటా కంపెనీపైనా ఎన్నో విమర్శలు వచ్చాయని.. ప్రస్తుతం చట్టం, న్యాయం తమ పక్షాన నిలవడంతో సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Ratan Tata, Tata Group