గత ఆరు నెలలుగా బంగారం ధరలు భారీగా పెరుగుతూ వస్తున్నాయి. అంతేకాదు బంగారం ధరలు భవిష్యత్తులో భారీగా పెరుగుతాయని ప్రముఖ ఇన్వెస్టర్ మార్క్ ఫేబర్ పేర్కొన్నారు. 2015 డిసెంబర్ నుంచీ బంగారం ధరలు ర్యాలీ చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటివరకూ పసిడి ధరలు డాలర్లలో చూస్తే 26 శాతం లాభపడ్డాయి. వెండి ధరలు మరింత అధికంగా 33 శాతం జంప్ చేశాయి. ఈ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. బంగారంలో లాభాలు పొందాలంటే ఫిజికల్ బంగారం కొంటే అంత లాభదాయకం కాదు. కానీ అందుబాటులో ఉన్న బంగారం పథకాలను ఎంచుకోవడం మేలని నిపుణులు పేర్కొన్నారు. ఆభరణాలు కొనుగోలు చేసే సమయంలో తయారీ చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. నాణ్యత, భద్రతతోపాటు బీమా కవరేజీ కొనుగోలు చేయాల్సిన బెడద ఉండదు. లాభం కోసం బంగారాన్ని తిరిగి అమ్మే సమయంలో తరుగు తీస్తారన్న చింత అక్కర్లేదు. పైగా ఆర్థిక సాధనాలు, పథకాల ద్వారా పసిడి పెట్టుబడులు పెట్టడం, వెనక్కి తీసుకోవడం సులువే. బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో నాలుగు ఆప్షన్లు అందుబాటులో ఉన్నాయి. గోల్డ్ ఫండ్స్, .గోల్డ్ ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్ (ఈటీఎఫ్), మల్టీ అసెట్ ఫండ్స్, ఇంటర్నేషనల్ గోల్డ్ ఫండ్స్. వాటి వివరాలు..
గోల్డ్ ఫండ్స్
ఇది ఓపెన్ ఎండెడ్ మ్యూచువల్ ఫండ్ పథకం. ఈ ఫండ్ ద్వారా గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్లు కొనుగోలు చేయవచ్చు. ఇందుకు డీమ్యాట్ అకౌంట్ కూడా అవసరం లేదు. ఇతర మ్యూచువల్ ఫండ్ల తరహాలోనే ఇన్వెస్టర్లు గోల్డ్ ఫండ్లలో పెట్టుబడులు పెట్టవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు.
గోల్డ్ ఈటీఎఫ్
వీటి యూనిట్లు స్టాక్ ఎక్స్ఛేంజ్లలో ప్రస్తుత మార్కెట్ ధరల వద్ద ట్రేడవుతాయి. ఒక్కో గోల్డ్ ఈటీఎఫ్ యూనిట్ అర గ్రాము బంగారం (24 క్యారెట్లు)తో సమా నం. ఇన్వెస్టర్లు ఈటీఎఫ్ యూనిట్లను మార్కెట్లో ఆ సయమానికి ట్రేడవుతున్న ధరకు కొనుగోలు చేయవచ్చు. లేదా విక్రయించవచ్చు. కొనుగోలుకు ప్రీమయం చెల్లించాల్సిన లేదా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన అవసరం లేదు.
మల్టీ అసెట్ ఫండ్
ఇది హైబ్రిడ్ మ్యూచువల్ ఫండ్ పథకం. భారత్‌లో ఈ ఫండ్స్ నిర్వాహకులు చాలావరకు ఇన్వెస్టర్ల సొమ్ము ను మూడు అసెట్ క్లాస్ (ఈక్విటీ, డెట్, గోల్డ్)ల లో పెట్టుబడిగా పెడతారు. నిబంధనల ప్రకారం.. ఫండ్ తన పోర్ట్‌ఫోలియోలో కనీసం 10 శాతాన్ని మూడు అసెట్ క్లాస్‌లలో ఇన్వెస్ట్ చేయాలి. అయితే, ఈ పథకాల ఇన్వెస్టర్లు తమ సొమ్ము గోల్డ్‌లో ఉందా లేదా అన్న విషయాన్ని మాత్రం తెలుసుకోవడం సాధ్యపడదని ఎంఎఫ్ అడ్వైజర్లు చెబుతున్నారు.
ఇంటర్నేషనల్ గోల్డ్ ఫండ్స్
దేశంలో కొన్ని మ్యూచువల్ ఫండ్ సంస్థలు ఇంటర్నేషనల్ గోల్డ్ ఫండ్స్‌ను సైతం నిర్వహిస్తున్నాయి. ఈ పథకాలు విదేశీ గోల్డ్ ఫండ్ యూనిట్లలో పెట్టుబడులు పెడతాయి. అయితే, రిటైల్ ఇన్వెస్టర్లకు వీటితో రిస్క్ ఎక్కువని మ్యూచువల్ ఫండ్ అడ్వైజర్లు సూచిస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరల ట్రెండ్‌ను నిశితంగా గమనించే వారే ఈ పథకాల్లో పెట్టుబడులు పెట్టడం మేలని వారంటున్నారు.
అయితే పెట్టుబడులను మొత్తం ఒకేదానిలో పెట్టుబడి పెట్టకుండా షేర్లు, బాండ్లు, రియల్ ఎస్టేట్, బంగారం, ఇతర కమోడిటీలు వంటి పలు అసెట్ క్లాస్‌ల్లోకి మళ్లించడం మేలు. మొత్తం పెట్టుబడుల్లో గోల్డ్‌లోకి మళ్లించే వాటా 10-15 శాతానికి మించకుండా చూసుకోవాలని ఫైనాన్షియల్ అడ్వైజర్లు సూచిస్తున్నారు.