ఉద్యోగాలు చేసేవారు, నెలవారీ ఆదాయం ఉన్నవారు క్రెడిట్ కార్డులపై ఎక్కువగా ఆధారపడతారు. వీటిని సరిగా వాడటం తెలియనివారు వడ్డీల ఉచ్చులో కూరుకుపోవాల్సి ఉంటుంది. బ్యాంకులు నిర్ణీత వడ్డీరేటుతో క్రెడిట్ కార్డులను అందిస్తాయి. అర్హతను బట్టి ఎంతవరకు ఖర్చు చేసుకోవచ్చనేది బ్యాంకు నిర్దేశిస్తుంది. ఆర్థిక క్రమశిక్షణ లేనివారు వీటి ద్వారా ఇబ్బందులు పడతారు. గడువు లోపు బిల్లు రీ పేమెంట్ చేస్తూ, ఒకటికంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడటం వల్ల కస్టమర్లు లబ్ధి పొందవచ్చు. ఐతే ఎక్కువ క్రెడిట్ కార్డుల వల్ల కలిగే లాభాలు, నష్టాలపై అవగాహన పెంచుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
లాభాలేంటి?
అవసరాలు తీరుతాయి
కస్టమర్లు తమ అవసరాలను దృష్టిలో పెట్టుకొని క్రెడిట్ కార్డు తీసుకోవాలి. వీటిల్లో చాలారకాలు ఉంటాయి. తరచుగా ప్రయాణాలు చేసేవారికి ట్రావెల్ క్రెడిట్ కార్డులు సరిపోతాయి. దీని ద్వారా కస్టమర్లకు ప్రయాణ టికెట్లపై డిస్కౌంట్లు, ఫ్రీ లాంజ్ యాక్సెస్, హోటల్ వోచర్లు వంటివి లభిస్తాయి. వీటి ద్వారా ప్రయాణాలకు సంబంధించిన ఖర్చులపై బ్యాంకులు ఎక్కువ రివార్డ్ పాయింట్లను అందిస్తాయి. వీటితో పాటు ఫ్యూయెల్ క్రెడిట్ కార్డుల ద్వారా బ్యాంకులతో ఒప్పందం చేసుకున్న కంపెనీల పెట్రోల్ బంకుల్లో ప్యూయెల్ నింపుకోవచ్చు. బ్యాంకులు కొన్ని కో- బ్రాండెడ్ రిటైల్ సంస్థలతో, ఆన్లైన్ షాపింగ్ కోసం వివిధ ప్లాట్‌ఫాంలతో ఒప్పందం చేసుకుంటాయి. వాటి ద్వారా క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేసినప్పుడు అదనపు ప్రయోజనాలు పొందవచ్చు.
* క్రెడిట్ స్కోర్ మెరుగుపడుతుంది
ఒకటికంటే ఎక్కువ క్రెడిట్ కార్డులను వాడటం ద్వారా క్రెడిట్ యుటిలైజేషన్ రేషియో (CUR)ను తగ్గించుకోవచ్చు. కస్టమర్లు ఉపయోగించిన మొత్తం క్రెడిట్ లిమిట్ రేషియోనే CUR అంటారు. ఇది 30 శాతం కంటే ఎక్కువ ఉంటే క్రెడిట్ బ్యూరోలు కస్టమర్ల క్రెడిట్ స్కోరును తగ్గిస్తాయి. క్రెడిట్ కార్డుల లిమిట్‌ను దృష్టిలో పెట్టుకొన్ని క్రమశిక్షణతో చెల్లింపులు చేస్తే CUR తగ్గుతుంది. దీంతో క్రెడిట్ స్కోరు కూడా మెరుగుపడుతుంది. ఉదాహరణకు.. క్రెడిట్ కార్డు లిమిట్ లక్ష రూపాయలు ఉండి, ఒక నెలలో కస్టమర్లు రూ.40,000 వరకు లావాదేవీలు చేశారు అనుకుందాం. ఇప్పుడు CUR 40 శాతంగా ఉంటుంది. అదే వ్యక్తికి రూ.80,000 లిమిట్ ఉండే మరో క్రెడిట్ కార్డు ఉంటే.. ఆ నెలలో CUR 22.22 శాతానికే పరిమితమవుతుంది. దీంతో దీర్ఘకాలంలో మంచి క్రెడిట్ స్కోర్ నమోదవుతుంది.
వడ్డీ
బ్యాంకులు కస్టమర్లకు నిర్ణీత గడువు వరకు వడ్డీ మినహాయింపును ఇస్తాయి. డబ్బు వాడుకున్నవారు, ఆ గడువు లోపు మళ్లీ రీ పేమెంట్ చేస్తే వినియోగదారులు ఎలాంటి వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా లావాదేవీ చేసిన తేదీని బట్టి ఇంట్రస్ట్ ఫ్రీ పీరియడ్ 18 నుంచి 55 రోజుల వరకు ఉంటుంది. ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే ఎక్కువ రోజులు వడ్డీ మినహాయింపు పొందవచ్చు.
రివార్డ్ పాయింట్లకు పరిష్కారం
బ్యాంకులు క్రెడిట్ కార్డులకు రివార్డ్ పాయింట్ల పరిమితిని విధిస్తాయి. ఎక్కువ లావాదేవీలు చేసినప్పుడు ఎక్కువ రివార్డ్ పాయింట్లు వస్తాయి. ఆ లిమిట్ వరకు చేరుకున్న తరువాత కస్టమర్లు క్రెడిట్ కార్డుతో లావాదేవీలు చేయలేరు. ఇలాంటప్పుడు ఒకటికన్నా ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉంటే.. వాటిని అవసరాలకు వాడుకోవచ్చు.
కార్డు పోయినప్పుడు..
ఒకవేళ కస్టమర్లు క్రెడిట్ కార్డును పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా.. బ్యాంకులు కొత్త కార్డును ఇవ్వడానికి కొంత సమయం పడుతుంది. ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు మరొక కార్డును అవసరాల కోసం ఉపయోగించుకోవచ్చు.
నష్టాలు
అన్నీ గుర్తుపెట్టుకోవాలి
ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు వాటి బిల్లులు, రీ పేమెంట్ గడువులు గుర్తుపెట్టుకోవడం కష్టమవుతుంది. నిర్ణీత గడువులోపు క్రెడిట్ కార్డు బిల్లుల రీపేమెంట్ చేయకపోతే ఎక్కువ మొత్తంలో వడ్డీ, లేట్ పేమెంట్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ క్రెడిట్ స్కోరును తగ్గిస్తాయి. కస్టమర్లు సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆటోమెటిక్ డిడక్షన్ ఆప్షన్‌ను ఎంచుకుంటే.. ఇలాంటి సమస్యలు ఎదురుకావు.
ఎక్కువ ఖర్చు చేసే ప్రమాదం
క్రెడిట్ కార్డులు మంచి డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తాయి. దీంతో ఆఫర్లను పొందడానికి ఆర్థిక క్రమశిక్షణ లేని వారు అవసరం ఉన్నా లేకపోయినా క్రెడిట్ కార్డులతో ఎక్కువగా ఖర్చుపెడతారు. ఎక్కువ క్రెడిట్ కార్డులు ఉన్నప్పుడు బిల్లుల రీ పేమెంట్ కెపాసిటీకి మించి ఖర్చు చేసే అవకాశం ఉంది.
క్రెడిట్ స్కోరు తగ్గుతుంది
కస్టమర్లు కొత్త క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసిన ప్రతిసారీ, క్రెడిట్ లిమిట్‌ను అంచనా వేయడానికి బ్యాంకులు క్రెడిట్ రిపోర్టును బయటకు తీస్తాయి. ఇది ఒకరకమైన విచారణ లాంటిది. దీని వల్ల స్వల్ప కాలంలో క్రెడిట్ బ్యూరోలు క్రెడిట్ స్కోర్‌ను కొన్ని పాయింట్ల వరకు తగ్గిస్తాయి. బకాయిలను గడువులోపు చెల్లిస్తూ, CUR 30 శాతంలోపు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే క్రెడిట్ స్కోరు మళ్లీ పెరుగుతుంది.