ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీ అమ్మకాలు రికార్డు స్థాయిలో దూసుకెళ్తున్నాయి. పండుగ సీజన్ తర్వాత ఆయా కంపెనీలు ప్రకటిస్తున్న ఫలితాలు మంచి వృద్ధిని సూచిస్తున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌లో ఆటోమొబైల్ సేల్స్ 48 శాతం వార్షిక వృద్ధిని సాధించాయని ఆటోమోటివ్ డీలర్స్ బాడీ ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) సోమవారం తెలిపింది. గత నెల మొత్తం రిటైల్ సేల్స్ 20,94,378 యూనిట్లుగా ఉన్నాయి. ఇది 2021 అక్టోబర్‌లో నమోదైన 14,18,726 రిజిస్ట్రేషన్ల కంటే 48 శాతం ఎక్కువ.
కోవిడ్‌కు ముందు నెల అయిన 2019 అక్టోబర్‌తో పోలిస్తే గత నెలలో రిజిస్ట్రేషన్లు 8 శాతం మేర మెరుగ్గా ఉన్నాయి. గత నాలుగేళ్లతో పోలిస్తే ఈ ఏడాది పండుగ సీజన్లో ఆటోమొబైల్స్ కంపెనీలు బెస్ట్ రిజల్ట్స్ అందుకున్నాయి. గత నెలలో ప్యాసింజర్, వాణిజ్య వాహనాలు, ద్విచక్ర వాహనాలు, ట్రాక్టర్లు, మూడు చక్రాల వాహనాలు వంటి అన్ని వాహనాల విభాగాలు గత సంవత్సరంతో పోలిస్తే మెరుగైన పనితీరును కనబరిచాయి.
* అన్ని సెగ్మెంట్స్‌లో అభివృద్ధి
ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గత నెలలో 3,28,645 యూనిట్లకు చేరుకున్నాయి. 2021 అక్టోబర్‌లో నమోదైన 2,33,822 యూనిట్ల కంటే ఈ విభాగంలో 41 శాతం వృద్ధి నమోదైంది. అదే విధంగా ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు గత నెలలో 15,71,165 యూనిట్లకు చేరుకున్నాయి. గతేడాది ఇదే సమయంలో నమోదైన 10,39,845 యూనిట్ల కంటే ఇది 51 శాతం పెరుగుదల కావడం గమనార్హం. కమర్షియల్ వెహికల్ రిటైల్ అమ్మకాలు గత నెలలో 25 శాతం పెరిగి 74,443 యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 59,363 యూనిట్లు సేల్ అయ్యాయి. త్రీవీలర్, ట్రాక్టర్ రిటైల్‌లు వరుసగా 66, 17 శాతం వృద్ధి చెందాయి.
* ఇవే బెస్ట్ సేల్స్
దీని గురించి ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్స్ (FADA) అధ్యక్షుడు మనీష్ రాజ్ సింఘానియా మాట్లాడుతూ.. పండుగ కాలంలో అన్ని వర్గాల డీలర్‌షిప్‌లలో సెంటిమెంట్లు చాలా సానుకూలంగా ఉన్నాయని చెప్పారు. మొత్తం రిటైల్ అమ్మకాలు మొదటిసారిగా గ్రీన్‌లో ముగిశాయని వివరించారు. గత నెలలో పండుగల కారణంగా చాలా బలమైన డిమాండ్ కనిపించిందని చెప్పారు. గత నాలుగు సంవత్సరాలలో అత్యుత్తమ ఫలితాలను ఆటోమొబైల్ కంపెనీలు అందుకున్నాయని పేర్కొన్నారు. పర్సనల్ వెహికల్ సెగ్మెంట్ 2020 సంఖ్యలను 2 శాతం పెంచిందని అన్నారు. 2019 ప్రీ-COVID పండుగ సీజన్‌తో పోల్చినప్పుడు మొత్తం రిటైల్‌లు 6 శాతం పెరిగాయని సింఘానియా చెప్పారు.
FD Rates Hike: ఫిక్స్డ్ డిపాజిట్ రేట్లు పెంచిన మరో బ్యాంక్.. గరిష్టంగా 8 శాతం.. పూర్తి వివరాలు
* 42 రోజుల్లో రిటైల్ విక్రయాలలో 29 శాతం వృద్ధి
గ్రామీణ స్థాయిలో కూడా సెంటిమెంట్లు మెరుగుపడటం ప్రారంభించాయన్నారు. కనీసం వచ్చే 3-4 నెలల వరకు అదే కొనసాగించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ఏడాది 42 రోజుల పండుగ కాలంలో మొత్తం రిటైల్ విక్రయాలు 22,42,139 యూనిట్ల నుంచి 29 శాతం వృద్ధితో 28,88,131 యూనిట్లుగా ఉన్నాయని వివరించారు. ప్యాసింజర్ వాహనాల రిటైల్‌లు గత ఏడాది పండుగ కాలంలో 3,39,780 యూనిట్ల నుంచి 34 శాతం పెరిగి 4,56,413 యూనిట్లకు చేరుకున్నాయని తెలిపారు. అదే విధంగా ద్విచక్ర వాహనాల రిజిస్ట్రేషన్లు 26 శాతం వృద్ధితో 17,05,456 యూనిట్ల నుంచి 21,55,311 యూనిట్లకు పెరిగాయి. త్రీవీలర్, వాణిజ్య వాహనాలు, ట్రాక్టర్ అమ్మకాలు వరుసగా 68, 29, 30 శాతం పెరిగాయని FADA తెలిపింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Auto mobile