రూపాయి పతనంతో ఇప్పటికే పెట్రోల్, డీజిల్ ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకు పెరుగుతూ సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. ఐతే ఒక్క పెట్రో ఉత్పత్తుల ధరలే కాదు..ఫ్రిజ్, ఏసీ, టీవీ, మైక్రోవేవ్ ఓవెన్లు, వాషింగ్ మెషీన్ల ధరలు సైతం పెరుగుతున్నాయి. రూపాయి మారకపు విలువ క్షీణించడంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులు, లోహాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేయాల్సి వస్తుంది. దాంతో ఆయా కంపెనీలు ఆ భారాన్ని కస్టమర్లకు బదలాయిస్తూ రేట్లు పెంచుతున్నాయి. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు కూడా మరో కారణం..!
ఆర్థిక సంవత్సరం ప్రాంరంభంలో రూ.65గా ఉన్న అమెరికా డాలరు మారకపు విలువ..ప్రస్తుతం రూ.71.75కి చేరింది. రూపాయి విలువ ఏకంగా జీవన కాల కనిష్ఠానికి పడిపోయింది. రూపాయి విలువ పడిపోయినప్పుడల్లా కంపెనీలు వాటి ఉత్పత్తులధరలను పెంచలేవు. కొద్ది కాలం పాటు ఎదురుచూస్తాయి. కానీ ఇప్పుడు పరిస్ధితి వేరు. రోజురోజుకూ రూపాయి విలువ రికార్డు స్థాయికి పడిపోతుండడంతో .. కంపెనీలు ధరలను పెంచాలని నిర్ణయం తీసుకున్నాయి. ఉక్కుతో పాటు రాగి కండెన్సర్ దిగుమతి వ్యయం పెరగడంతో వాటి ధరలు పెరిగిపోయాయి. ఈ క్రమంలోనే ఏసీ, రిఫ్రిజిరేటర్ల ధరలను పెంచాయి కంపెనీలు.
టీవీలు సహా ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల ధరలను 5-7 శాతం పెంచింది ఎల్జీ. శాంసంగ్ 4-5 శాతం, గోద్రేజ్, వర్ల్పూల్ వంటి సంస్థలు కూడా 2-3 శాతం వరకు పెంచాయని ఆయా కంపెనీల డీలర్లు తెలిపారు. తక్కువ ధర కలిగిన ఉత్పత్తులపై రూ.1000 వరకు, అధిక ధర ఏసీలపై రూ.2,500 వరకు పెంచినట్లు వెల్లడించారు.
సెల్ఫోన్లపైనా 5-6శాతం ధరలు పెంచాలని కంపెనీలు భావిస్తున్నాయి. సాధారణంగా వేసవి తర్వాత సెల్ఫోన్ అమ్మకాలు తక్కువ ఉంటాయి. డాలర్ విలువ రూ.65 గా ఉన్నప్పుడు కొనుగోలు చేసిన విడిభాగాలతో ఇప్పటికే లక్షలాది ఫోన్లను తయారుచేశారు. వాటి నిల్వలు అధికంగా ఉండడంతో ధరలను పెంచేందుకు సాహసించడం లేదు. ఐతే డాలర్ విలువ క్రమంగా క్షీణిస్తుండడంతో..ధరల పెంచక తప్పదని కంపెనీలు భావిస్తున్నాయి. ఈ క్రమంలోనే సెప్టెంబర్ ద్వితీయార్థంలో ధరలను పెంచేందుకు యోచిస్తున్నాయి.