హోమ్ /వార్తలు /బిజినెస్ /

Term Insurance Plan: టర్మ్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ తీసుకుంటున్నారా?.. అయితే, మీరు ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన అంశాలివే

Term Insurance Plan: టర్మ్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ తీసుకుంటున్నారా?.. అయితే, మీరు ఖచ్చితంగా గుర్తించుకోవాల్సిన అంశాలివే

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

పాలసీదారుడు తన వార్షిక ఆదాయానికి 7 నుంచి 10 రెట్ల మేర టర్మ్​ లైఫ్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయడం ఉత్తమం. ఆదాయం పెరిగే కొద్ది ప్రతి సంవత్సరం కవరేజ్​ కూడా పెంచుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.

కరోనా సంక్షోభం నేపథ్యంలో ప్రజల్లో ఆరోగ్యంతో పాటు బీమాపై అవగాహన పెరిగింది. జీవితంలో బీమాకు ఉన్న ప్రాధాన్యత తెలిసొచ్చింది. దీంతో హెల్త్ ఇన్సూరెన్స్ తో పాటు టర్మ్​ ఇన్సూరెన్స్​ పాలసీలకు కూడా డిమాండ్​ అమాంతం పెరిగింది. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో టర్మ్​ ఇన్సూరెన్స్​ తీసుకునే వారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. వీటి కింద అనేక ప్రయోజనాలు లభిస్తాయి. పాలసీదారుడికి అనుకోని మరణం సంభవిస్తే అతని కుటుంబానికి ఆర్థిక రక్షణగా నిలుస్తాయి. పైగా పదవీ విరమణ తర్వాత కూడా ఆర్థిక ప్రయోజనాలు అందించేందుకు కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. ఈ టర్మ్​ పాలసీలు చౌకగా లభించడమే కాకుండా, అధిక మొత్తంలో క్లైయిమ్​ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. అయితే, టర్మ్​ పాలసీ తీసుకునే ముందు అనేక విషయాలను పరిగణలోకి తీసుకోవాలి. అవేంటో చూద్దాం.

కుటుంబ రక్షణ కోసం టర్మ్ ప్లాన్

టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఒక రకమైన జీవిత బీమా. ఈ టర్మ్​ ప్లాన్​ను నిర్ణీత సమయం వరకు కొనుగోలు చేయవచ్చు. ఇందులో మీరు ఎంచుకున్న కాలానికి కవరేజీ లభిస్తుంది. పాలసీ హోల్డర్​ మరణిస్తే.. పాలసీ కింద అతని నామినీకి హామీ మొత్తం చెల్లించబడుతుంది. కుటుంబంలో సంపాదించే వ్యక్తికి అనుకోని మరణం సంభవిస్తే ఆ కుటుంబం అప్పుల ఊబిలో కూరుకుపోతుంది. అలా జరగకుండా, ఆ కుటుంబానికి ఆర్థికంగా చేయూతనివ్వడమే ఈ టర్మ్​ ఇన్సూరెన్స్​ పాలసీల ముఖ్య ఉద్దేశ్యం. పాలసీదారుడు లేకున్నా సరే.. తన కుటుంబ ఆర్థిక లక్ష్యాలు, బాధ్యతలు కొంత మేర తీర్చేందుకు ఈ పాలసీలు ఉపయోగపడతాయి. అయితే, టర్మ్ ఇన్సూరెన్స్ కొనుగోలు చేసేటప్పుడు కొన్ని కీలక అంశాలను పరిగణించాలి అవేంటో చూద్దాం.

- మీపై ఆదారపడిన కుటుంబ సభ్యులు, లక్ష్యాలు లేదా బాధ్యతలు ఉంటే వెంటనే టర్మ్​ ఇన్సూరెన్స్​ పాలసీని తీసుకోండి. సంపాదించడం ప్రారంభించిన వెంటనే ఈ పాలసీని తీసుకోవడం ఉత్తమం. ఎంత తక్కువ వయసులో టర్మ్​ ఇన్సూరెన్స్ తీసుకుంటే అంత మంచిది. 18 సంవత్సరాల పైబడిన ప్రతి ఒక్కరూ టర్మ్​ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడానికి అర్హులు. వయసు ఎక్కువవుతున్న కొద్దీ టర్మ్​ ఇన్సూరెన్స్​ ప్రీమియం కూడా ఎక్కువవుతుంది. అందుకే, తక్కువ వయసు ఉన్నప్పుడే ఈ ఇన్సూరెన్స్​ తీసుకోవడం ఉత్తమం.

- టర్మ్​ ఇన్సూరెన్స్​ను ఆన్‌లైన్ ద్వారా కూడా కొనుగోలు చేయవచ్చు. ఆన్‌లైన్ ద్వారా కొనుగోలు చేస్తే చాలా తక్కువ ప్రీమియంతో అధిక మొత్తంలో బీమా పొందవచ్చు. ఉదాహరణకు, రూ. 5 లక్షల వార్షిక ఆదాయం గల 25 ఏళ్ల వ్యక్తి 35 సంవత్సరాల వ్యవధి (అనగా అతడికి 60 ఏళ్లు వచ్చే వరకు) రూ .1 కోటి విలువ చేసే టర్మ్​ ఇన్సూరెన్స్​ ప్లాన్​ను ఆన్​లైన్​లో కొనుగోలు చేయాలనుకుంటే.. అతడు, సంవత్సరానికి రూ .5 వేల నుండి 7 వేల ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది.

- పాలసీదారుడు తన వార్షిక ఆదాయానికి 7 నుంచి 10 రెట్ల మేర టర్మ్​ లైఫ్​ ఇన్సూరెన్స్​ను కొనుగోలు చేయడం ఉత్తమం. ఆదాయం పెరిగే కొద్ది ప్రతి సంవత్సరం కవరేజ్​ కూడా పెంచుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.


- టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్లు రైడర్స్/ యాడ్-ఆన్‌లతో వస్తాయి. పాలసీని కొనుగోలు చేసేటప్పుడు వీటిని కచ్చితంగా పరిగణించాలి. అదనపు ప్రీమియంతో ఇవి అదనపు ప్రయోజనాలను చేకూర్చుతాయి.

First published:

Tags: Business

ఉత్తమ కథలు