నేటి తరం యువత రొటీన్‌కు భిన్నంగా ఆలోచిస్తోంది. ఉద్యోగిగా కొనసాగడం కంటే, కాస్త కష్టమైనప్పటికీ వ్యాపారం చేయడమే ఉత్తమం అని భావిస్తోంది. ఇటీవలి కాలంలో పెరుగుతున్న స్టార్టప్ కంపెనీలే దీనికి నిదర్శనం. అయితే, ఉద్యోగాన్ని వదిలేసి వ్యాపారాన్ని ప్రారంభించాలనుకోవడం జీవితంలో తీసుకునే చాలా కష్టమైన నిర్ణయంగా చెప్పవచ్చు. మీపై ఆధారపడిన కుటుంబం, పిల్లలు, వారి బాధ్యతలు ఇలా అన్ని లెక్కలేసుకొని జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఈ విషయంలో ఏమాత్రం తొందరపాటు పనికిరాదని గుర్తించుకోవాలి. మీ రెగ్యులర్ ఉద్యోగానికి వీడ్కోలు చెప్పే ముందు కొన్ని కీలకమైన ఆర్థిక చర్యలు తీసుకోవాలి. అవేంటో తెలుసుకుందాం.
పెట్టుబడి సిద్ధం చేసుకోండి
మీ జీవితకాల పొదుపులో ఎక్కువ భాగం కొత్త వ్యాపారంలోకి లాక్ అవుతుంది. కాబట్టి, మీ వ్యాపారంలో లాభాలు ప్రారంభమయ్యే వరకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కొంత క్యాపిటల్ ఫండ్‌ను సిద్ధం చేసుకోండి. సాధారణంగా బిజినెస్‌కు కావాల్సిన క్యాపిటల్ అమౌంట్ ఏర్పాటు చేసుకోకుండా కొంతమంది వ్యాపారాన్ని ప్రారంభిస్తుంటారు. అటువంటి వ్యాపారాలు ప్రారంభంలోనే విఫలమవుతుంటాయి. మీ మూలధన అవసరాల కోసం అధికారిక రుణ సంస్థల నుండి రుణాలు తీసుకోవడం ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ బ్యాంకులు కొత్త వ్యాపారాల కంటే, ఇది వరకే మార్కెట్లో మంచి లాభాలను ఆర్జిస్తున్న వ్యాపారాలకే రుణాలు మంజూరు చేస్తుంటాయి. అందువల్ల, వీటి ద్వారా మీకు తక్కువ మొత్తంలోనే రుణం మంజూరయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి, రుణ సంస్థలపై ఎక్కువ ఆధారపడకుండా, మీ వ్యాపార అవసరాలను తీర్చడానికి మీ వద్ద తగినంత మూలధనాన్ని కూడబెట్టుకోవడం చాలా ముఖ్యం.
మీ ఉద్యోగాన్ని వదిలేయడంలో మీరు ప్రధానంగా లెక్కలోకి తీసుకోవాల్సిన అంశం.. మీ నెలవారీ ఖర్చులు. యుటిలిటీ బిల్లులు, అద్దె, బీమా ప్రీమియంలు, రుణ ఈఎంఐలు, పిల్లల విద్య, వైద్య ఖర్చులు మొదలైనవి ప్రతి ఒక్కరు చెల్లించాల్సిన అనివార్య ఖర్చులు. అందువల్ల, మీ వ్యాపారం నిరంతర లాభాలను ఆర్జించడం ప్రారంభించే వరకు నెలవారీ ఖర్చులను తీర్చుకునేందుకు అదనపు కార్పస్ ఫండ్‌ను సృష్టించుకోవాలి. దీని కోసం మీరు వివిధ పొదుపు మార్గాల్లో పెట్టుబడి పెట్టండి. ఎక్కువ రిస్క్ తీసుకునే వారు తక్కువ వ్యవధి గల డెట్ ఫండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. తక్కువ రిస్క్ తీసుకునేవారు అధిక-దిగుబడి పొదుపు ఖాతాలలో లేదా షెడ్యూల్ చేసిన బ్యాంకుల స్థిర డిపాజిట్లలో పెట్టుబడి పెట్టవచ్చు.
టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోండి
మీరు వ్యాపారం ప్రారంభించడానికి సిద్ధమవుతున్నప్పుడు దృష్టిలో పెట్టుకోవాల్సిన మరో కీలక అంశం బీమా తీసుకోవడం. ఎందుకంటే, ఉద్యోగం ఉన్న సమయంలో కంపెనీ అందజేసే యాజమాన్య బీమా ఉంటుంది. అదే, ఉద్యోగం మానేస్తే మీకు యాజమాన్యం నుంచి ఎటువంటి సహకారం లభించదు. కాబట్టి, మీ అకాల మరణం విషయంలో మీ కుటుంబానికి ప్రత్యామ్నాయ ఆదాయాన్ని అందించడానికి తగిన జీవిత బీమాను తీసుకోండి. ఈ కవర్ మీ ప్రస్తుత వార్షిక ఆదాయంలో కనీసం 15 రెట్లు ఉండేలా చూసుకోండి. ప్రధానంగా, టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడాన్ని పరిగణించండి. ఎందుకంటే ఇది చాలా తక్కువ ప్రీమియంలతోనే ఎక్కువ లైఫ్ కవర్‌ను అందిస్తాయి. అలాగే, పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ ఖర్చులను తగ్గిస్తాయి.
మీ ఉద్యోగాన్ని వదిలేసిన తర్వాత కూడా కీలకమైన మీ జీవిత లక్ష్యాల వైపు పెట్టుబడులు కొనసాగాలి. ఉదాహరణకు, మీరు మీ పిల్లల ఉన్నత విద్య కోసం మీరు ఇప్పటివరకు SIP మ్యూచువల్ ఫండ్లలో పెట్టుబడి చేస్తుంటే.. దాన్ని అలాగే కొనసాగించండి. మీరు మీ వ్యాపారాన్ని నిర్మించేటప్పుడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎట్టిపరిస్థితుల్లోనూ వీటిని కొనసాగించడం ఆపవద్దు. ఒకవేళ, ఆపేస్తే దీర్ఘకాలంలో వాటి నుంచి వచ్చే ప్రయోజనాలు కోల్పోతారు. తిరిగి మీరు ఆ కార్పస్‌ను సృష్టించడానికి పెద్ద మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుందని గుర్తించుకోండి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.