Digital Gold: బంగారంలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారా..? రూ.1 తోనే ఇన్వెస్ట్ చేసే అవకాశం.. పూర్తి వివరాలివే..!

ప్రతీకాత్మక చిత్రం

Digital Gold: ఇకపై డిజిటల్ బంగారంపై పెట్టుబడి పెట్టడం చాలా చౌక. ఎందుకంటే పెట్టుబడిదారులు తమ బంగారు కార్పస్‌ను ఏర్పరచుకోవడానికి రోజువారీ/ వారం/ నెలవారీగా చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు.

  • Share this:
పండుగ వేళ బంగారం (Gold) కొనుగోలు చేయడం వల్ల అదృష్టం వరిస్తుందని చాలామంది విశ్వసిస్తుంటారు. ప్రస్తుతం పండుగ సీజన్ కొనసాగుతుండగా.. భారతీయులు ఎంతోకొంత పసిడి కొనుగోలు చేయాలని ప్రయత్నిస్తున్నారు. బంగారాన్ని ఓ పెట్టుబడి సాధనంగా కూడా పరిగణిస్తూ ఫెస్టివల్ సీజన్‌లో డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలో డిజిటల్ గోల్డ్ విక్రేతలు కస్టమర్లను ఆకట్టుకునేందుకు ఆకర్షణీయమైన ఆఫర్స్ ప్రకటిస్తున్నారు. తాజాగా బంగారు కడ్డీలు, నాణేల తయారీదారు ఎంఎంటీసీ-పీఎఎంపీ (MMTC-PAMP) ఒక్క రూపాయితోనే డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టొచ్చని ఇన్వెస్టర్లకు బంపరాఫర్ ఇచ్చింది. 999.9 స్వచ్ఛమైన బంగారు కడ్డీలు, నాణేల తయారు చేసే కంపెనీగా ఎంఎంటీసీ-పీఎఎంపీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది.

"ఇకపై డిజిటల్ బంగారంపై పెట్టుబడి పెట్టడం చాలా చౌక. ఎందుకంటే పెట్టుబడిదారులు తమ బంగారు కార్పస్‌ను ఏర్పరచుకోవడానికి రోజువారీ/ వారం/ నెలవారీగా చిన్న మొత్తాల్లో పెట్టుబడులు పెట్టవచ్చు. లేదా ఎంఎంటీసీ-పీఎఎంపీ 24 క్యారట్ 999.9 స్వచ్ఛమైన బంగారు నాణేలు, కడ్డీలను రీడీమ్ చేయొచ్చు. ఈ ప్రత్యేకమైన ప్రతిపాదన బంగారంపై బిట్ సైజులో పెట్టుబడి పెట్టడానికి అనుమతిస్తుంది.

డిజిటల్ బంగారంలో పెట్టుబడి పెట్టడం చాలా సులభం. అలాగే ఇది పారదర్శకంగా ఉంటుంది. కొనుగోలు సమయంలో 3% జీఎస్టీ పన్ను మినహా, డిజిటల్ బంగారాన్ని కొనుగోలు చేసేటప్పుడు అదనపు పన్నులు లేదా హిడెన్ చార్జీలు ఉండవు” అని ఎంఎంటీసీ-పీఎఎంపీ మేనేజింగ్ డైరెక్టర్ & సీఈఓ వికాస్ సింగ్ అన్నారు.

భారతదేశంలోని బంగారం, వెండి రెండింటికీ లండన్ బులియన్ మార్కెట్ అసోసియేషన్ (LBMA) గుర్తింపు పొందిన ఏకైక రిఫైనరీగా ఉన్న ఎంఎంటీసీ-పీఎఎంపీ డిజిటల్ గోల్డ్ ధర ప్రపంచ మార్కెట్లతో ముడిపడి ఉంటుంది. కాబట్టి స్థానిక మార్కెట్ పరిస్థితులతో సంబంధం లేకుండా పెట్టుబడిదారులు విక్రయించాలని నిర్ణయించుకున్నప్పుడు వారి పెట్టుబడికి తగిన ధరను పొందుతారని వికాస్ వివరించారు.

ఇది కూడా చదవండి : ఆదిత్య బిర్లా సన్ లైఫ్ నుంచి సరికొత్త ఐటీ ఫండ్.. దీని ప్రత్యేకతలు ఏంటంటే..

* డిజిటల్ గోల్డ్ అంటే ఏమిటి?
డిజిటల్ గోల్డ్ అనేది ఆన్‌లైన్ లో వర్చువల్ గా ఉంచగలిగిన బంగారం అని అర్థం. ఇది పేటీఎం, గూగుల్ పే తదితర ప్లాట్ ఫామ్స్ ద్వారా కొనుగోలు చేయవచ్చు. డిజిటల్ బంగారాన్ని రూ.1 కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. మీరు ఎంఎంటీసీ-పీఎఎంపీలో కొనుగోలు చేసిన డిజిటల్ బంగారానికి పూర్తి బీమా లభిస్తుంది. బంగారం భౌతికంగా మీ దగ్గర లేకపోయినా దీనికి యజమాని మీరే అవుతారు. మీరు కొనుగోలు చేసిన బంగారం ఎంఎంటీసీ-పీఎఎంపీలోని సురక్షిత ఖజానాలో ఉంచుతారు. ఫలితంగా భౌతికంగా మీరు గోల్డ్ స్టోర్ చేయాల్సిన ఇబ్బంది ఉండదు.

* డిజిటల్ గోల్డ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి?
పెట్టుబడిదారులు 24క్యారట్, 999.9 స్వచ్ఛత గల బంగారాన్ని అదనపు పన్ను లేకుండా లావాదేవీ ఛార్జీలు లేకుండా 3% జీఎస్టీ మినహాయింపుతో కొనుగోలు చేయొచ్చు. అలాగే బంగారం ఎవరైనా దొంగలు ఎత్తుకుపోతారోననే భయం లేకుండా డిజిటల్ బంగారాన్ని సురక్షితంగా భద్రపరుచుకోవచ్చు.
Published by:Sridhar Reddy
First published: