గోల్డ్ ఇన్వెస్టర్లు (Gold Investors) బంగారంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో వారం రోజుల పాటు వేచి ఉండాలి. జులై 13న విడుదల కానున్న యునైటెడ్ స్టేట్స్ ద్రవ్యోల్బణం (United States Inflation) వివరాలను పెట్టుబడిదారులు ఆసక్తిగా అనుసరిస్తారు. కాబట్టి రాబోయే కొద్ది రోజుల్లో బులియన్(Bullion) ఒత్తిడిలో ఉంటుంది. మల్టీ-కమోడిటీ ఎక్స్ఛేంజ్(MCX)లో, మునుపటి వారంలో బంగారం ధర ఫ్యూచర్ 10 గ్రాములకు రూ.50,810 వద్ద ముగిసింది. ఇది 2 శాతం వీక్లీ నష్టాన్ని నమోదు చేసింది. యూఎస్ డాలర్ రెండు దశాబ్దాల గరిష్ట స్థాయి నుంచి తగ్గడంతో.. బంగారంపై నుంచి కొంత ఒత్తిడి తొలగింది.
ఈ వారం బంగారం ధరలను పెంచే ముఖ్య అంశాలు
పెరుగుతున్న డాలర్(Dollor) ధర, యునైటెడ్ స్టేట్స్ జూన్ వినియోగదారుల ధరల డేటా, యునైటెడ్ స్టేట్స్ ఫెడరల్ రిజర్వ్, ముడి చమురు ధరల భవిష్యత్తు వంటివి ఈ వారం బులియన్ ధరను నిర్దేశించే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం ధర ఎక్కువగా యూఎస్ డాలర్‌పై ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న మాంద్యం ప్రమాదాల మధ్య, పెట్టుబడిదారులు విలువైన లోహానికి బదులుగా డాలర్‌ను ఎంచుకున్నారు. దీంతో గత వారం తాజా రెండు దశాబ్దాల గరిష్ట స్థాయికి చేరుకుంది. రాబోయే కొద్ది రోజుల వరకు యూఎస్ డాలర్ ఈ ఊపును కొనసాగిస్తుందని నిపుణులు భావిస్తున్నారు. డాలర్ విలువ పెరిగితే, ఇతర కరెన్సీలలో బంగారం విలువ పెరుగుతుంది.
దీనికి సంబంధించి ICICI డైరెక్ట్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘ఎలివేటెడ్ డాలర్ ఇండెక్స్ మధ్య MCX బంగారం ధరలు ప్రతికూలంగా మారవచ్చని భావిస్తున్నాం. MCX బంగారం ధర రూ.50,900 సగటు స్థాయిల దిగువన ట్రేడవుతోంది. ఇది ఈ స్థాయి కంటే తక్కువగా ఉన్నంత కాలం, రాబోయే సెషన్లలో రూ.49,900 సగటు-2 సిగ్మా స్థాయిలకు చేరే అవకాశం ఉంది’ అని పేర్కొంది.
ఈ వారం అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలపైనే అందరి దృష్టి ఉంటుంది. రాయిటర్స్ నిర్వహించిన పోల్ ప్రకారం.. జూన్‌లో వినియోగదారుల ధరల సూచీ తాజాగా 40 ఏళ్ల గరిష్ట స్థాయి 8.8 శాతానికి చేరుకుంటుందని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే నెలవారీ కోర్ ఇండెక్స్ మే నెలలో 6.0 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గే అవకాశం ఉంది. బ్లూమ్‌బర్గ్ సర్వేలో.. ఆర్థికవేత్తల ప్రొజెక్షన్ ఆధారంగా, వినియోగదారు ధరల సూచిక జూన్‌లో ఒక సంవత్సరం క్రితం కంటే దాదాపు 9 శాతం పెరిగింది. మే నెలలో తాజా నాలుగు దశాబ్దాల గరిష్టంతో పోలిస్తే, సీపీఐ 1.1 శాతం పెరిగింది.
ద్రవ్యోల్బణం పెరుగుతున్నందున, యూఎస్ ఫెడ్ అధికారులు జులై 27న జరిగే సమావేశంలో తమ బెంచ్‌మార్క్ రేటును 75 బేసిస్ పాయింట్లు పెంచవచ్చు. జూన్‌లో యూఎస్ ఉపాధి నివేదిక ఊహించిన దాని కంటే బలంగా ఉంది. జూన్ నెలలో నాన్‌ఫార్మ్ పేరోల్‌లు 372,000 పెరిగాయి. నిరుద్యోగిత రేటు 3.6 శాతంగా ఉంది. మే నుంచి ఈ డేటా మారలేదు .. అంచనాలకు అనుగుణంగా ఉంది.
బ్లూమ్‌బర్గ్ ఆర్థికవేత్తలు యెలెనా షుల్యత్యేవా, ఆండ్రూ హస్బీ మాట్లాడుతూ..‘ఉపాధి డేటా లేబర్ మార్కెట్ స్ట్రాంగ్‌గా ఉందని చూపించిన తర్వాత, పెరుగుతున్న గ్యాసోలిన్ ధరలు వినియోగదారుల ధరల సూచీని తాజా గరిష్ట స్థాయికి చేరుస్తాయి. వృద్ధి మందగించి నప్పటికీ, సేవల వైపు మారడం వల్ల ఆర్థిక వ్యవస్థ రెండో త్రైమాసికంలో సాంకేతిక మాంద్యంలో పడకుండా నిరోధిస్తుంది.’ అని పేర్కొన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Gold coins, Gold loans, Gold price down, Investments