పెట్రోల్ (Petrol) ధరల భారం నుంచి ఉపశమనం కలిగించడానికి ఎలక్ట్రిక్ స్కూటర్లు (Electric Scooters) వచ్చాయని వాహనదారులు ఎంతో సంతోషపడ్డారు. కానీ వారి సంతోషం ఎంతో కాలం నిలిచేలా కనిపించడం లేదు. ఎందుకంటే రీసెంట్ టైమ్స్‌లో ఈ వెహికల్స్ వరుసగా కాలిపోతూ వారిలో భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. సేఫ్టీ (Safety) పెద్ద ప్రశ్నార్థకంగా మారిన నేపథ్యంలో వాటిపై ప్రయాణించేందుకు రైడర్స్ జంకుతున్నారు. ఈ క్రమంలోనే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎంత డేంజరో చెప్పే మరో దుర్ఘటన చోటు చేసుకుంది. తెలంగాణలోని వరంగల్‌లో సోమవారం ప్యూరీఈవీ (PureEV)కి చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్లో (PureEV E-Scooter Catches Fire) మంటలు చెలరేగాయి. దీనితో కలిపి గత ఏడు నెలల్లో ఏకంగా 4 ప్యూర్ ఈవీ స్కూటర్లు మంటల్లో దగ్ధం కావడం గమనార్హం.
భారీ ఎత్తున పొగలు..
మూడు వారాల కిందటే ఒక ప్యూర్ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ (Electric Scooters) అగ్ని ప్రమాదానికి గురయ్యింది. మళ్లీ ఇప్పుడు ఈ కంపెనీ స్కూటర్‌కు మంటలు అంటుకున్నాయి. ఏప్రిల్ 18న వరంగల్‌లో Epluto 7G ఎలక్ట్రిక్ స్కూటర్లో మంటలు చెలరేగినట్లు ప్యూరీఈవీ డీలర్షిప్ తెలిపింది. ఈ ఘటనపై కంపెనీ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. గత నెలలో తమిళనాడులోని చెన్నైలో ప్యూర్ ఈవీ ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇలాంటి ఘటనలోనే చిక్కుకుంది. ఈ స్కూటర్ నుంచి భారీ ఎత్తున పొగలు వెలువడ్డాయి.
సాఫ్ట్‌వేర్‌లో లోపాలున్నా..
మార్చి 26 నుంచి దేశవ్యాప్తంగా ఓలా ఎలక్ట్రిక్, ఒకినావా, ప్యూర్ఈవీ (PureEV), జితేంద్ర న్యూ ఈవీ టెక్ వంటి కంపెనీల ఎలక్ట్రిక్ స్కూటర్లకు (Electric Scooters) సంబంధించి ఏడు అగ్ని ప్రమాదాలు వెలుగు చూశాయి. దీన్నిబట్టి వేసవికాలం (Summer)లో అధిక ఉష్ణోగ్రతల్లో ఈ-స్కూటర్లు ఎక్కువగా కాలిపోతున్నాయని తెలుస్తోంది. ఇతర కాలాల్లోనూ వీటిలో మంటలు ఎగిసిపడుతున్నాయి. గత ఏడాది సెప్టెంబరులో హైదరాబాద్‌లో రెండు ప్యూర్ ఈవీ స్కూటర్లు అగ్నికి ఆహుతయ్యాయి. వీటిలో వాడే బ్యాటరీలో తయారీ లోపం ఉన్నా లేదా బ్యాటరీలో ఉష్ణోగ్రత అధికంగా పెరిగినా లేదా బ్యాటరీని కంట్రోల్ చేసే సాఫ్ట్‌వేర్‌లో లోపాలున్నా మంటలు చెలరేగే ప్రమాదం ఉంది.
ఈ ఘటనలపై ప్రభుత్వం ఇప్పటికే విచారణకు ఆదేశించింది. అగ్నిప్రమాదానికి గల కారణాలను పరిశోధించి, ఈ నెలాఖరులోగా నివేదిక సమర్పించాలని రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ సెంటర్ ఫర్ ఫైర్ ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES)ని కోరింది. విశాఖపట్నంలోని నేవల్ సైన్స్ & టెక్నలాజికల్ లాబొరేటరీ (NSTL), సెంటర్ ఫర్ ఫైర్ & ఎక్స్‌ప్లోజివ్ అండ్ ఎన్విరాన్మెంట్ సేఫ్టీ (CFEES), ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి నిపుణులను ఈ దర్యాప్తు కోసం నియమించింది.
మంటలు చెలరేగుతున్న ఘటనలపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అగ్ని ప్రమాదాలు జరగవచ్చనే అనుమానం ఉన్న ఈ-స్కూటర్ల బ్యాచ్‌ను ఆయా తయారీదారులు రీకాల్ చేస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. గత ఆరు నెలల్లో ఒకినావా ఆటోటెక్ (Okinawa Autotech) రెండు స్కూటర్లకు మంటలు అంటుకున్నాయి. దీంతో అప్రమత్తమైన సదరు కంపెనీ కనెక్టర్, బ్యాటరీలను తనిఖీ చేయడానికి.. అవసరమైతే వాటిని రిపేర్ చేయడానికి ఏప్రిల్ 15న 3,215 యూనిట్ల ప్రైజ్ ప్రో స్కూటర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.