news18-telugu
Updated: December 2, 2020, 4:54 PM IST
అమూల్ ప్రతినిధితో సీఎం వైఎస్ జగన్ (Image; AndhraPradesh CMO/Twitter)
ఆంధ్రప్రదేశ్లో అమూల్ ప్రాజెక్టుతో పాల సహకార విప్లవం మొదలైందని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. ఈ రోజు అమరావతి సచివాలయంలోని మొదటి బ్లాక్ లో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏపీ-అమూల్ ప్రాజెక్టును ప్రారంభించారు. ఏపీ అముల్- వెబ్ సైట్ , డాష్ బోర్డును కూడా ఆవిష్కరించారు. ఏపీలో అమూల్ ప్రాజెక్టు కింద రాష్ట్రంలో 9899 పాల సేకరణ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయి. ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఉంటాయి. తొలిదశలో చిత్తూరు, కడప, ప్రకాశం జిల్లాలో పాల సేకరణ ప్రారంభించనున్నారు. అమూల్ తో ఒప్పందం ద్వారా రైతులకు మేలు జరుగుతుందని సీఎం జగన్ అన్నారు. ‘పాడి రైతులకు ఎక్కువ ధర వస్తుంది. లీటర్ కు రూ.5 నుంచి రూ.7 మేర అధిక ఆదాయం వస్తుంది. మార్కెట్ లో పోటీతత్వం వస్తేనే అందరికీ మంచిది. అమూల్ సంస్థ పాల మార్కెటింగ్ ద్వారా వచ్చిన లాభాలను తదుపరి బోనస్ గా రైతులకు చెల్లిస్తుంది. సహకార రంగంలో ఏర్పాటైన అమూల్ ప్రపంచ స్థాయి కంపెనీలతో పోటీ పడుతోంది. అమూల్ రావటంతో ఏపీలో పాలసహకార విప్లవం మొదలైందని చెప్పొచ్చు. దశలవారీగా రూ.6551కోట్ల వ్యయంతో ఆటోమేటెడ్ పాల సేకరణ కేంద్రాలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం’ అని సీఎం జగన్ ప్రకటించారు.
గుజరాత్ కోపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (అమూల్) ఎండీ ఆర్.ఎస్.సోధి, కైరా మిల్క్ యూనియన్ (అమూల్ డెయిరీ) ఎండీ అమిత్ వ్యాస్, సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీఎం పటేల్ నిన్న అమరావతిలోని సీఎం జగన్ నివాసంలో ఆయన్ను కలిశారు. ప్రాజెక్టు గురించి చర్చించారు. ఏపీతో అమూల్ భాగస్వామ్యం కావడం ఆనందంగా ఉందన్నారు.
Published by:
Ashok Kumar Bonepalli
First published:
December 2, 2020, 4:47 PM IST