రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ (Mukesh Ambani) ఇంట్లో సంబరాలు మొదలయ్యాయి. ముకేశ్ అంబానీ, నీతా అంబానీల తనయుడు అనంత్ అంబానీ (Anant Ambani), విరెన్ మర్చెంట్, శైల దంపతుల కూతురైన రాధికా మర్చంట్ (Radhika Merchant) నిశ్చితార్థం జరిగింది. అంబానీ నివాసంలో కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో సంప్రదాయాల వేడుకల మధ్య ఎంగేజ్‌మెంట్ సెలబ్రేషన్స్ జరిగాయి. గుజరాతీ హిందూ కుటుంబాలు తరతరాలుగా పాటిస్తున్న గోల్ ధన, చునారి విధి కార్యక్రమాలు కుటుంబ దేవాలయంలో నిర్వహించారు. కుటుంబ సభ్యులు బహుమతులు ఇచ్చిపుచ్చుకుని ఎంతో ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
గోల్ ధన అంటే అక్షరాలా బెల్లం, కొత్తిమీర గింజలు అని అర్ధం. ఇది గుజరాతీ సంప్రదాయాలలో వివాహానికి ముందు జరిగే వేడుక. ఇది నిశ్చితార్థం లాగా ఉంటుంది. వరుడి ఇంట్లో ఈ వస్తువులు పంపిణీ చేయబడతాయి. వధువు కుటుంబం బహుమతులు, స్వీట్లతో వరుడి నివాసానికి వస్తారు. ఆపై జంట ఉంగరాలు మార్చుకుంటారు. ఉంగరాలు మార్చుకున్న తర్వాత దంపతులు తమ పెద్దల నుంచి ఆశీర్వాదం తీసుకుంటారు.
అనంత్ సోదరి ఇషా నేతృత్వంలో అంబానీ కుటుంబ సభ్యులు రాధికను ఆహ్వానించడానికి మర్చంట్ నివాసానికి వెళ్లడంతో ఈ వేడుకలు ప్రారంభమయ్యాయి. అంబానీ కుటుంబ సభ్యులు హారతి, మంత్రోచ్ఛారణల మధ్య రాధికా మర్చంట్ కుటుంబ సభ్యులకు ఘనంగా స్వాగతం పలికారు.
కుటుంబసభ్యులు అనంత్, రాధికలను వెంట ఆలయానికి చేరుకుని, శ్రీకృష్ణుని ఆశీస్సులను పొందారు. ఆ తర్వాత గణేష్ పూజతో నిశ్చితార్థం మొదలైంది. ఆ తర్వాత లగాన్ పత్రికను చదివారు. అంటే వివాహానికి ఆహ్వాన పత్రికను రూపొందించారు. గోల్ ధన, చునారి విధి తర్వాత అనంత్, రాధిక కుటుంబీకుల మధ్య ఆశీర్వాదాలు, బహుమతులు ఇచ్చిపుచ్చుకున్నారు.
నీతా అంబానీ నేతృత్వంలో అంబానీ కుటుంబ సభ్యులు చేసిన ఆశ్చర్యకరమైన నృత్య ప్రదర్శన అందర్నీ ఆకట్టుకుంది. హాజరైన వారందరిలో ఉత్సాహాన్ని, కుటుంబ బంధాన్ని పెంచింది. అనంత్ సోదరి ఇషా ఉంగరాలు మార్చుకునే కార్యక్రమం ప్రారంభమైనట్లు ప్రకటించారు. అనంత్, రాధిక కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో ఉంగరాలు మార్చుకున్నారు.
అనంత్, రాధిక కొన్నేళ్లుగా ఒకరికొకరు తెలుసు. త్వరలో వారి వివాహం తర్వాత అధికారిక ప్రయాణం ప్రారంభం అవుతుంది. అనంత్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో పలు హోదాల్లో పనిచేసశారు. జియో ప్లాట్‌ఫామ్స్, రిలయన్స్ రీటైల్ వెంచర్స్ బోర్డుల్లో సభ్యుడిగా కూడా ఉన్నారు. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఎనర్జీ బిజినెస్‌ను లీడ్ చేస్తున్నారు. రాధికా మర్చంట్ న్యూయార్క్ యూనివర్సిటీలో విద్యాభ్యాసం పూర్తి చేశారు. ఎన్‌కోర్ హెల్త్‌కేర్ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Anant Ambani and Radhika Merchant Wedding, Isha Ambani, Mukesh Ambani, Nita Ambani, Radhika Merchant