news18-telugu
Updated: November 26, 2020, 7:28 AM IST
అమెజాన్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియాకు కేంద్ర ప్రభుత్వం జరిమానా విధించింది. అమెజాన్ తమ ప్లాట్ఫామ్లో విక్రయించే ఉత్పత్తులకు సంబంధించి తప్పనిసరైన సమాచారం పొందుపరుచని కారణంగా జరిమానా విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. విక్రయించే ఉత్పత్తులు ఏ దేశంలో తయారవుతున్నాయనే వివరాలను కూడా అమెజాన్ తెలుపకపోవడంతో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఇక, గత నెలలో గ్రేట్ ఇండియన్ సేల్స్, బిగ్ బిలియన్ డేస్ పేరిట అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు భారీ ఆఫర్లు ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లు తమ వెబ్సైట్లలో అందుబాటులో ఉంచి వస్తువులు ఏ దేశంలో తయారయ్యాయి, ఇతర వివరాలు పొందుపరచకపోవడంపై వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ సీరియస్‌గానే స్పందించింది.
ఇందుకు సంబంధించి వెంటనే వివరణ ఇవ్వాలంటూ రెండు సంస్థలకు నోటీసులు జారీచేసింది. లీగల్ మెట్రాలజీ రూల్స్, 2011 ప్రకారం డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లపై కొన్ని ఇ-కామర్స్ సంస్థలు తప్పనిసరి డిక్లరేషన్‌ను ప్రదర్శించడం లేదని ప్రభుత్వం దృష్టికి వచ్చిందని నోటీసులో పేర్కొంది. నోటీసులపై వివరణ ఇచ్చేందుకు 15 రోజుల సమయం ఇచ్చింది. ఈ నిబంధనలను ప్రతి ఈ కామర్స్ సంస్థ పాటించాల్సిందేనని స్పష్టం చేసింది.
అయితే ఈ నోటీసులపై అమెజాన్ వివరణ సంతృప్తికరంగా లేకపోవడంతో జరిమానా విధిస్తున్నట్టు తెలిపింది. చట్టప్రకారం మొదటి తప్పిదానికి గానూ అమెజాన్‌కు 25,000 రూపాయల జరిమానా విధించినట్టు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అదే సమయంలో ఫ్లిప్‌కార్ట్‌కు ఎటువంటి జరిమానా విధించలేదని పేర్కొన్నారు. తగిన వివరాలు సమర్పించడంతోనే ఫ్లిప్‌కార్ట్‌కు ఫైన్ విధించలేదని ఆయన చెప్పారు. ఇక, రెండోసారి కూడా ఇదే రకమైన తప్పిదానికి పాల్పడితే రూ. 50వేల జరిమానా విధిస్తారు. అయితే అదేపనిగా నేరాలకు పాల్పడితే జైలు శిక్ష విధించే అవకాశం కూడా ఉంది.
Published by:
Sumanth Kanukula
First published:
November 26, 2020, 7:28 AM IST