news18-telugu
Updated: November 5, 2020, 4:38 PM IST
ప్రతీకాత్మక చిత్రం
ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ విదేశీ మారక నిర్వహణ చట్టం (FEMA) నియమ నిబంధనలను ఉల్లంఘిస్తోందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) ఆరోపిస్తోంది. భారతదేశంలో మల్టీ బ్రాండ్ రిటైల్ వ్యాపారంలోకి ప్రవేశించడానికి అమెజాన్ కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకోకపోవడాన్ని సీఏఐటీ తప్పుబడుతోంది. ఈ విషయంపై కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్‌కు లేఖ రాసినట్టు ఆ సంస్థ ప్రకటించింది.
రిటైల్ చైన్ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టిన అమెజాన్, మల్టీ బ్రాండ్ రిటైల్ విభాగంలో పరోక్షంగా ప్రవేశిస్తోందని CAIT చెబుతోంది. ఫ్యూచర్ రిటైల్ సంస్థతో అమెజాన్ న్యాయ పోరాటం చేస్తుంది. ఫ్యూచర్ రిటైల్ సంస్థను కొనుగోలు చేస్తామని రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్ ప్రతిపాదించిన ప్రయత్నాలను అడ్డుకోవడానికి అమెజాన్ ప్రయత్నిస్తున్న నేపథ్యంలో ఆ సంస్థపై ఇలాంటి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
నిబంధనలను పాటించాలి
అమెజాన్ భారత చట్టాల ప్రకారమే MBRT (మల్టీ-బ్రాండ్ రిటైల్) రంగంలోకి ప్రవేశించాలని సీఏఐటీ లేఖలో మంత్రిని కోరింది. ‘ఈ వ్యాపారంలోకి అడుగుపెట్టేముందు భారత ప్రభుత్వం వద్ద అమెజాన్ ముందస్తు అనుమతి తీసుకోవాలి. ఒకవేళ ప్రభుత్వం అనుమతించినా, పరిమితులు విధించాలి. గుత్తాధిపత్యానికి, పోటీని తొక్కి పట్టేందుకు ఎలాంటి ప్రయత్నాలు చేయకూడదు. దేశీయ రిటైల్ రంగం నియమాలతోనే వ్యాపారం చేసుకోవాలి’ అని లేఖలో పేర్కొన్నారు.
అక్రమంగా పెట్టుబడులు
అమెజాన్ ఇండియా ప్లాట్ఫామ్లో అమెజాన్ మాతృ సంస్థ సుమారు రూ.35,000 కోట్టు పెట్టుబడులు పెట్టిందని CAIT సెక్రెటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ చెబుతున్నారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. ‘కానీ ఆ సంస్థ పరోక్షంగా మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోకి అడుగు పెడుతోంది. మోర్ రిటైల్ లిమిటెడ్ (మల్టీ-బ్రాండ్ రిటైల్ కంపెనీ)లో సుమారు రూ.4,200 కోట్లు, ఫ్యూచర్ కూపన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో సుమారు రూ.1,430 కోట్లను అమెజాన్ పెట్టుబడిగా పెట్టింది. ఈ పెట్టుబడులన్నీ FEMA నియమ, నిబంధనలను ఉల్లంఘించి చేసినవే. ఆ సంస్థపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాం’ అని ఖండేల్వాల్ చెప్పారు.
అమెజాన్ ఏమంటోంది?ఈ ఆరోపణలపై అమెజాన్ స్పందించింది. బాధ్యతాయుతమైన పెట్టుబడిదారుడిగా ఉన్న తమ సంస్థ భారతదేశానికి సంబంధించిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల చట్టాలకు (Foreign Direct Investment laws) లోబడి ఉంటుందని ఆ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు. ఇందులో భాగంగా కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి అనుమతులు తీసుకుంటున్నామని తెలిపారు. నియమ, నిబంధనలకు అనుగుణంగానే దేశంలోని వివిధ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టామని ఆయన వివరించారు.
Published by:
Kishore Akkaladevi
First published:
November 5, 2020, 4:38 PM IST