• HOME
  • »
  • NEWS
  • »
  • BUSINESS
  • »
  • ALL COINS WERE DEPOSITED IN GREEZE ON REQUEST FOR SALARY STRANGE INCIDENT IN GEORGIA MK GH

జీతం అడిగితే నాణేలన్నీ గ్రీజులో పోసి అందించారు.. జార్జియాలో వింత ఘటన..

జీతం అడిగితే నాణేలన్నీ గ్రీజులో పోసి అందించారు.. జార్జియాలో వింత ఘటన..

ప్రతీకాత్మక చిత్రం

అన్ని కాయిన్లను తాము ఎత్తడానికి లేకుండా దానిపై గ్రీజు, ఇంజిన్ ఆయిల్ పోశారని.. వాటిని ఇంకెక్కడైనా ఇవ్వడానికి కూడా లేకుండా పోయిందని వెల్లడించింది. ఒక వ్యక్తి తన ఉద్యోగి తనని వదిలివెళ్తే ఇంతగా అతడిని ద్వేషిస్తూ అతడి కోసం 90,000 పెన్నీలను సేకరించారంటే అతడు ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చని ఆమె వెల్లడించింది.

  • Share this:
సాధారణంగా ఏ ఉద్యోగి అయినా ఒక కంపెనీలో ఉద్యోగం మానేసిన తర్వాత ఆఖరి నెల జీతం పొందేందుకు ఒక నెల నుంచి మూడు నెలల వరకూ సమయం పడుతుంది. సంస్థలో ఉన్న నిబంధనల ప్రకారం వీటిని అందజేస్తారు. మనం ఏ కారణంతో మానేసినా దీన్ని మాత్రం సంస్థ కాదనడానికి లేదు. అయితే జార్జియాకి చెందిన ఓ వ్యక్తికి అతడి కంపెనీ ఈ ఆఖరి నెల జీతాన్ని అందించడానికి ముప్పు తిప్పలు పెట్టిందట. ఇప్పుడు అతడికి డబ్బు ఇచ్చిన తర్వాత కూడా దాన్ని ఖర్చు చేయడానికి ఇబ్బందులు పడాల్సి వస్తోంది. అసలు కథలోకి వెళ్తే..

జార్జియాకి చెందిన ఆండ్రియాస్ ఫ్లాటెన్ అనే వ్యక్తి Ok వాకర్ ఆటోవర్క్స్ అనే సంస్థలో నవంబర్ వరకూ పనిచేసి ఆ తర్వాత మానేశాడు. ఆ తర్వాత అతడి చివరి నెల జీతం కోసం ఆ సంస్థను చాలా సార్లు అడిగినా రాకపోవడంతో చివరికి జార్జియా లేబర్ డిపార్ట్ మెంట్ ని కూడా సంప్రదించాడు. మార్చి మధ్యలో ఒకరోజు ఇంటి నుంచి బయటకు వస్తున్న అతడికి మధ్యలో ఓ కుప్ప కనిపించింది. అదేంటా అని చూసేందుకు వెళ్తే అక్కడ డబ్బులు కుప్పగా పోసి ఉన్నాయి. అవన్నీ గ్రీజులో ముంచి , కప్పబడి ఉన్నాయి. అవేంటా అని చూస్తే దానిపై ఉన్న కవర్ లో తాను పనిచేసిన సంస్థ నుంచి మీ ఫైనల్ పేమెంట్ మీకు అందిస్తున్నాం అంటూ మెసేజ్ ఉండడం అతడిని ఆశ్చర్యపరిచింది. తనకు చట్టబద్ధంగా ఇవ్వాల్సిన 915 డాలర్లను పైసల రూపంలో అంటే 90,000 పెన్నీల రూపంలో అందించారట. వీటిని అలాగే ఇచ్చినా బ్యాంకులో ఇచ్చి మార్పించుకునే అవకాశం ఉండేది కానీ వాటిని గ్రీజులో ముంచి ఇవ్వడం వల్ల వాటిని ఖర్చు చేయాలంటే ఆ గ్రీజు మొత్తం తొలగిపోయేలా వాటిని సబ్బుతో కడగాల్సిన అవసరం ఉంటుంది.

ప్రస్తుతం రోజూ రాత్రి ఆండ్రియాస్ కొన్ని కొన్ని నాణేలను తీసుకొని వాటిని శుభ్రం చేస్తున్నాడట. రోజూ గంట పాటు శుభ్రం చేస్తే కొన్ని వందల నాణేలు మాత్రమే శుభ్రమవుతున్నాయి. ఇవన్నీ శుభ్రం చేయడానికి చాలా రోజులే పట్టేలా ఉంది. నేను శ్రమించి సంపాదించిన డబ్బును నేను పొందేందుకు ఇంత పనిచేయాల్సి రావడం నాకు చాలా బాధ కలిగిస్తోంది. ఇలాంటి మూర్ఖపు పని ఏ సంస్థా చేయదనుకుంటాను. అంటూ తన బాధను వెళ్లగక్కుతున్నాడు ఆండ్రియాస్.

దీనిపై ఆండ్రియాస్ గర్ల్ ఫ్రెండ్ ఒలీవియా ఇన్ స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. దీనివల్ల ఈ విషయం ప్రపంచమంతా పాపులర్ గా మారింది. ఈ పోస్టులో ఇప్పటివరకూ జరిగిన ప్రతి విషయాన్ని ఆమె వెల్లడించింది. ఉద్యోగులను సంస్థలు ఎలా చూడకూడదో ఈ పోస్టులో భాగంగా బాధతో వెల్లడించింది. తన బాయ్ ఫ్రెండ్ ఉద్యోగానికి రిజైన్ చేసిన రెండు వారాల తర్వాత ఉద్యోగాన్ని వదిలిపెట్టాడని, అతడి కాంట్రాక్టు ప్రకారమే అలా చేసినా ఉన్న పదిహేను రోజులు ఆ యజమాని తన గురించి, తన కుటుంబం గురించి కామెంట్లు చేస్తూ అతడిని బాధపెట్టాడని చెప్పుకొచ్చింది. దీన్ని భరించలేక అతడు ఐదు రోజులకే మానేశాడు. యూనిఫాంలు ఉతికి బాక్సులో పెట్టి దానితో పాటు ఎందుకు తాను ముందే ఉద్యోగాన్ని వదిలేయాల్సి వచ్చిందో చెబుతూ లెటర్ కూడా రాసినట్లు తెలిపింది. మూడు నెలలు దాటినా డబ్బు ఇవ్వకపోవడంతో లాయర్ సహాయం తీసుకోవాల్సి వచ్చిందని ఆ తర్వాత ఇలా పెన్నీలను అందజేశారని చెప్పుకొచ్చింది. అన్ని కాయిన్లను తాము ఎత్తడానికి లేకుండా దానిపై గ్రీజు, ఇంజిన్ ఆయిల్ పోశారని.. వాటిని ఇంకెక్కడైనా ఇవ్వడానికి కూడా లేకుండా పోయిందని వెల్లడించింది. ఒక వ్యక్తి తన ఉద్యోగి తనని వదిలివెళ్తే ఇంతగా అతడిని ద్వేషిస్తూ అతడి కోసం 90,000 పెన్నీలను సేకరించారంటే అతడు ఎలాంటి వ్యక్తో అర్థం చేసుకోవచ్చని ఆమె వెల్లడించింది. అయితే ఇందులోని పాజిటివ్ విషయం చెబుతూ.. ఈ పెన్నీల్లో మాకు కొన్ని పురాతన కాలానికి చెందినవి కూడా కనిపిస్తున్నాయి. వీటి విలువ ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి అతడు మాకు ఈ విధంగా మంచి చేసినట్లే.. అంటూ వెల్లడించింది ఒలీవియా.

దీనిపై ఓ స్థానిక న్యూస్ ఛానల్ ఆ సంస్థ యజమాని మైల్స్ వాకర్ ని కూడా సంప్రదించింది. ఆండ్రియాస్ ఇంటి ముందు అలా పెన్నీ నాణేలను వదిలానో లేదో తనకు గుర్తులేదని ఆయన చెప్పడం గమనార్హం. అంతే కాదు.. ఆండ్రియాస్ కి ఏ పనీ చేతకాదంటూ అతడు చెప్పడం కూడా విశేషం. అవి ఏ రూపంలో ఇచ్చినా అతడికి నేను ఇవ్వాల్సిన డబ్బు అందింది. అది మాత్రమే నాకు కావాల్సింది అంటూ అతడు చెప్పడం అందరికీ విచిత్రంగా అనిపిస్తోంది. ఒలీవియా పోస్టును చూసి.. ఆ తర్వాత ఈ యజమాని రియాక్షన్ చూసినా చాలామంది కోపంగా కామెంట్లు చేస్తుండడం విశేషం. ఇలాంటి యజమాని ఎవరికీ ఉండకూడదని.. అలాంటి చోట ఎవరూ పనిచేయకూడదని వారు కామెంట్లు చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ చానెల్ సబ్ స్క్రయిబ్ చేసుకోండి...

First published:

అగ్ర కథనాలు