EPF Rules | ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లో మీరు జమ చేసే డబ్బులు విత్‌డ్రా చేసినా ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ విత్‌డ్రాయల్‌పై (EPF Withdrawal) ట్యాక్స్ రూల్స్ ఎలా ఉంటాయో తెలుసుకోండి.
మీకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF) ఉందా? పీఎఫ్ అకౌంట్లో మీ వేతనం నుంచి ప్రతీ నెలా కంట్రిబ్యూషన్ జమ చేస్తున్నారా? మీ పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా (EPF Withdrawal) చేయాలనుకుంటున్నారా? అయితే అంతకన్నా ముందు ట్యాక్స్ రూల్స్ తెలుసుకోవడం అవసరం. ఈపీఎఫ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారు వైద్య అవసరాలు, పెళ్లిళ్లు, ఇంటి కొనుగోలు, ఇంటి నిర్మాణం, హోమ్ లోన్ పేమెంట్, పిల్లల చదువు కోసం ఖర్చులు లాంటి అనేక కారణాలతో డబ్బులు డ్రా చేయొచ్చు. పీఎఫ్ డబ్బులు ఎలా డ్రా చేయాలో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోండి. అయితే ఈపీఎఫ్ డబ్బులు డ్రా చేస్తే పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన ఐదేళ్ల లోపు డబ్బులు డ్రా చేస్తే ట్యాక్స్ డిడక్టెడ్ ఎట్ సోర్స్ (TDS) వర్తిస్తుంది. టీడీఎస్ రూల్స్ గురించి తెలుసుకోండి.
ఈపీఎఫ్ అకౌంట్‌కు పాన్ కార్డ్ లింక్ చేస్తే ఈపీఎఫ్ విత్‌డ్రాయల్‌పై 10 శాతం టీడీఎస్ వర్తిస్తుంది. ఒకవేళ పాన్ నెంబర్ లింక్ చేయకపోతే 34.60 టీడీఎస్ వర్తిస్తుంది. ఈపీఎఫ్ అకౌంట్ హోల్డర్ డబ్బులు డ్రా చేసినా కొన్ని సందర్భాల్లో టీడీఎస్ వర్తించదు. ఒక ఈపీఎఫ్ అకౌంట్ నుంచి మరో ఈపీఎఫ్ అకౌంట్‌కు ఫండ్స్ ట్రాన్స్ఫర్ చేస్తే టీడీఎస్ ఉండదు. ఉద్యోగి అనారోగ్యం కారణంగా విధుల నుంచి తొలగించినా, ఆ వ్యాపారం మూతపడినా, ప్రాజెక్ట్ పూర్తైనా, ఇలా ఉద్యోగి నియంత్రణలోలేని పరిస్థితుల్లో టీడీఎస్ వర్తించదు. ఇక ఈపీఎఫ్ అకౌంట్ ఓపెన్ చేసిన ఐదేళ్ల తర్వాత డబ్బులు డ్రా చేసినా టీడీఎస్ ఉండదు.
అంతేకాదు... ఉద్యోగి సర్వీస్ ఐదేళ్ల లోపు ఉన్నప్పుడు, రూ.50,000 లోపు విత్‌డ్రా చేస్తే టీడీఎస్ వర్తించదు. ఒకవేళ ఉద్యోగి సర్వీస్ ఐదేళ్లలోపు ఉండి, విత్‌డ్రా చేసిన మొత్తం రూ.50,000 ఉన్నప్పుడు, పాన్ కార్డుతో పాటు ఫామ్ 15G/15H సబ్మిట్ చేసినా టీడీఎస్ ఉండదు. 60 ఏళ్ల లోపు వారైతే ఫామ్ 15G, సీనియర్ సిటిజన్లు ఫామ్ 15H తో పాటు పాన్ కార్డ్ తప్పనిసరిగా సబ్మిట్ చేయాలి.
ఏఏ సందర్భాల్లో టీడీఎస్ వర్తిస్తుందో చూస్తే ఉద్యోగి సర్వీస్ ఐదేళ్లలోపు ఉన్నప్పుడు రూ.50,000 కన్నా ఎక్కువ డ్రా చేస్తే టీడీఎస్ ఉంటుంది. ఒకవేళ ఫామ్ 15G/15H సబ్మిట్ చేయకుండా పాన్ కార్డ్ సబ్మిట్ చేస్తే 10 శాతం పన్ను చెల్లించాలి. ఒకవేళ పాన్ కార్డ్ కూడా సబ్మిట్ చేయకపోతే 34.60 శాతం ట్యాక్స్ ఉంటుంది.
వేతనం, ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా లభించే వడ్డీ, మ్యూచువల్ ఫండ్స్, షేర్ల ద్వారా వచ్చే డివిడెండ్లు, ఇతర ఆదాయాలకు ముందుగానే వసూలు చేసే పన్నును టీడీఎస్ అంటారు. పన్నుచెల్లింపుదారులు టీడీఎస్‌ను క్లెయిమ్ చేసుకొని రీఫండ్ పొందొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.