ALERT FOR CREDIT CARD AND DEBIT CARD HOLDERS NEW CARD RULES WILL COME INTO EFFECT FROM JULY 1 SS
Credit Cards: జూలై 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ రూల్స్
Credit Cards: జూలై 1 నుంచి కొత్త క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ రూల్స్
(ప్రతీకాత్మక చిత్రం)
Credit Cards | క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) జూలై 1 నుంచి కొత్త రూల్స్ అమలు చేయనుంది. ప్రత్యామ్నాయ పద్ధతి పూర్తి స్థాయిలో లేకపోవడంతో సమస్యలు తప్పవంటున్నారు వ్యాపారులు.
బిల్ పేమెంట్స్, ఆన్లైన్ షాపింగ్ (Online Shopping) కోసం క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వాడేవారికి అలర్ట్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఆదేశాల ప్రకారం పేమెంట్ అగ్రిగేటర్స్, పేమెంట్ గేట్వేస్ జూలై 1 నుంచి కస్టమర్ల క్రెడిట్ కార్డ్ (Credit Card), డెబిట్ కార్డ్ డేటాను తమ ప్లాట్‌ఫామ్స్‌పై స్టోర్ చేయడం కుదరదు. ప్రస్తుతం ఎవరైనా కస్టమర్ ఆన్లైన్ షాపింగ్ కోసం లేదా బిల్ పేమెంట్ కోసం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ఉపయోగిస్తే ఆ కార్డు వివరాలు ఆ ప్లాట్ఫామ్లో సేవ్ చేసి ఉంటాయి. ఆ కస్టమర్ మళ్లీ పేమెంట్ చేయాలనుకున్నప్పుడు కార్డ్ వివరాలు మరోసారి ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. అయితే ఈ పద్ధతి ఇక మారిపోనుంది. ఆర్బీఐ విధించిన గడువుకు నెల రోజులు మాత్రమే సమయం ఉండటంతో ప్రత్యామ్నాయ పద్ధతి అందుబాటులోకి వస్తుందో లేదోనని వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.
పేమెంట్ అగ్రిగేటర్స్, పేమెంట్ గేట్వేస్, మర్చంట్స్ తమ కస్టమర్ల కార్డ్ వివరాలను తమ డేటాబేస్‌లో జూన్ 30 వరకు మాత్రమే స్టోర్ చేసే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ గడువును ఇప్పటికే రెండుసార్లు పొడిగించింది ఆర్బీఐ. చివరిసారిగా డిసెంబర్ 23 వరకు ఉన్న గడువును మరో ఆరు నెలలు పొడిగించి జూన్ 30 చేసింది. ఈ గడువు మరో నెలరోజుల్లో ముగియనుంది.
పేమెంట్ కంపెనీలు, కార్డ్ నెట్వర్క్స్ అయిన వీసా, మాస్టర్‌కార్డ్, రూపే లాంటి ప్లాట్‌ఫామ్స్, కార్డ్ ఆన్ ఫైల్ టోకెనైజేషన్ (CoFT) పద్ధతిని ప్రత్యామ్నాయంగా అమలు చేస్తున్నాయి. కార్డ్ వివరాలకు ప్రత్యామ్నాయంగా ప్రతీ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డుకు ప్రత్యామ్నాయంగా టోకెన్ క్రియేట్ అవుతుంది. అయితే ఈ ప్రత్యామ్నాయ పద్ధతి గురించి కస్టమర్లకు పూర్తిగా అవగాహన లభించలేదు.
నెట్‌ఫ్లిక్స్, డిస్నీ+ హాట్‌స్టార్, స్పాటిఫై, జూమ్, మైక్రోసాఫ్ట్, పాలసీబజార్ లాంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్స్ సభ్యులుగా ఉన్న మర్చంట్ పేమెంట్స్ అలయెన్స్ ఆఫ్ ఇండియా అన్ని సందర్భాలలో CoFTని అమలు చేయడానికి వ్యవస్థ సిద్ధంగా లేదని చెబుతోంది. ప్రత్యామ్నాయ పద్ధతి పూర్తిగా అందుబాటులో లేకపోవడంతో ఉన్న డేటా మొత్తాన్ని డిలిట్ చేస్తే తమ ఆదాయం దెబ్బతింటుందని సదరు కంపెనీలు వాదిస్తున్నాయి.
ఇప్పటికే యాపిల్ తాము క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ పేమెంట్స్ అంగీకరించమని, నెట్ బ్యాంకింగ్, యూపీఐ లేదా యాపిల్ ఐడీ బ్యాలెన్స్ ఉపయోగించాలని తెలిపింది. ఆర్బీఐ విధించిన గడువు ముగిస్తే కస్టమర్లు జూలై 1 నుంచి ప్రతీ లావాదేవికి తమ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ వివరాలను ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అంటే ట్రాన్సాక్షన్ చేసిన ప్రతీ సారి 16 అంకెల కార్డ్ నెంబర్, ఎక్స్పైరీ డేట్, సీవీవీ ఎంటర్ చేయడం తప్పనిసరి. మరి ఆర్బీఐ గడువు పొడిగిస్తుందా లేదా అన్నది చూడాలి.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.