ALERT FOR BANK CUSTOMERS ICICI BANK WARNS CUSTOMERS ABOUT NEW BANKING SCAM FOLLOW THESE SAFETY TIPS SS
Online Fraud: కొత్త తరహా మోసం... అకౌంట్ ఖాళీ... జాగ్రత్త పడండి ఇలా
Online Fraud: కొత్త తరహా మోసం... అకౌంట్ ఖాళీ... జాగ్రత్త పడండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)
Online Fraud | ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త తరహా మోసంపై కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. కస్టమర్లు మోసగాళ్ల వలలో పడి మోసపోవద్దంటూ అప్రమత్తం చేస్తోంది. ఏటీఎం కార్డ్ (ATM Card) విషయంలోనూ జాగ్రత్తల్ని సూచించింది.
భారతదేశంలో బ్యాంకింగ్ మోసాలు కొత్తేమీ కాదు. బ్యాంకింగ్ లావాదేవీలు జరిగే తీరుపై కస్టమర్లకు పూర్తిగా అవగాహన లేకపోవడం, మొదటిసారి బ్యాంకింగ్ సేవల్ని పొందుతుండటం, కొత్త తరహా సర్వీసుల్ని ఉపయోగిస్తుండటం లాంటి అనేక కారణాలు బ్యాంకింగ్ మోసాలకు (Banking Frauds) దారితీస్తున్నాయి. సైబర్ నేరగాళ్లు నాలుగు అడుగులు ముందుండి బ్యాంకు కస్టమర్లను బురిడీ కొట్టిస్తున్నారు. కొంతకాలం క్రితం యూపీఐ మోసాలు ఇలాగే జరిగాయి. యూపీఐ ద్వారా డబ్బులు (UPI Transactions) స్వీకరించాలంటే యూపీఐ పిన్ ఎంటర్ చేయాల్సిన అవసరం లేదన్న విషయం తెలియక అనేక మంది నిలువునా మోసపోయారు. ఇలా టెక్నాలజీ గురించి పెద్దగా తెలియని కస్టమర్లను దోచేస్తున్నారు సైబర్ నేరగాళ్లు.
తాజాగా ఐసీఐసీఐ బ్యాంక్ కొత్త తరహా మోసాన్ని గుర్తించింది. కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇమెయిల్ ద్వారా కస్టమర్లకు తెలియజేస్తోంది. మోసగాళ్లు కస్టమర్ల వాట్సప్, ఫేస్బుక్ అకౌంట్లను హ్యాక్ చేస్తున్నారు. తాము ఆపదలో ఉన్నామని, తమకు అర్జెంట్‌గా డబ్బులు కావాలని ఆ కస్టమర్ల కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు మెసేజెస్ చేస్తున్నారు. వారి అధికారిక అకౌంట్ల నుంచి ఇలాంటి మెసేజెస్ వస్తుండటంతో ఇదంతా నిజమని నమ్మి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తున్నవారు ఉన్నారు.
జరిగినదేంటో తెలుసుకునేసరికి మోసగాళ్ల అకౌంట్లలోకి డబ్బులు వెళ్లిపోతున్నాయి. అందుకే వాట్సప్ అకౌంట్ లేదా ఫేస్బుక్ అకౌంట్ హ్యాక్ అయినట్టైతే వెంటనే అప్రమత్తం కావాలని హెచ్చరిస్తోంది ఐసీఐసీఐ బ్యాంక్. ఇదే కాదు డెబిట్ కార్డ్ సేఫ్టీ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు సూచిస్తోంది ఐసీఐసీఐ బ్యాంక్. కస్టమర్లు ఎట్టి పరిస్థితుల్లో తమ ఏటీఎం కార్డును ఇతరులకు ఇవ్వకూడదు. ఏటీఎం కార్డ్ పిన్ ఎవరితో షేర్ చేయకూడదు. ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేప్పుడు మీ వెనక ఎవరూ ఉండకుండా చూసుకోవాలి. మీ ఏటీఎం పిన్ ఎంటర్ చేసేప్పుడు కీప్యాడ్పైన మరో చేతి అడ్డంపెట్టాలి.
బ్యాంకు అధికారుల పేరుతో ఎవరైనా కాల్ చేసి లేదా వాట్సప్, ఇమెయిల్ ద్వారా సంప్రదించి కార్డు వివరాలు, పిన్ లాంటివి అడిగితే అస్సలు షేర్ చేయకూడదు. ఐసీఐసీఐ బ్యాంక్ మాత్రమే కాదు ఏ బ్యాంకు సిబ్బంది కస్టమర్ల కార్డు వివరాలు అడగరన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఇదే కాదు మీ ఆర్థిక అంశాలకు సంబంధించిన వివరాలేవీ ఎవరితో ఫోన్లో లేదా ఇమెయిల్ ద్వారా షేర్ చేయకూడదు. అవసరమైతే దగ్గర్లోని మీ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి వివరాలు తెలుసుకోవాలి. ఏవైనా వివరాలు అప్డేట్ చేయాలంటే బ్యాంకుకు వెళ్లి చేయాలి. లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా మీ వివరాలు అప్డేట్ చేయాలి.
ఇక ఇమెయిల్ ద్వారా బ్యాంకు నుంచి వచ్చినట్టుగా ఏవైనా మెయిల్స్ వస్తే మెయిల్ ఐడీ చెక్ చేయాలి. బ్యాంకు అధికారిక ఇమెయిల్ ఐడీ కాకపోతే వాటిని పట్టించుకోకూడదు. మీ బ్యాంకింగ్ లావాదేవీలకు సంబంధించి ప్రతీ సమాచారం ఎప్పటికప్పుడు అందాలంటే మీ ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ అప్డేట్ అయి ఉండాలి. మీ ప్రమేయం లేకుండా ఏదైనా లావాదేవీ జరిగితే వెంటనే బ్యాంకుకు సమాచారం ఇవ్వాలి. మీ ఏటీఎం కార్డు, క్రెడిట్ కార్డ్ వివరాలు మీ స్మార్ట్‌ఫోన్‌లో, కంప్యూటర్లో, ల్యాప్‌టాప్‌లో షేర్ చేయకూడదు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.