AKSHAYA TRITIYA 2022 ARE YOU PLANNING TO BUY GOLD JEWELLERY FOLLOW THESE TIPS SS
Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే
Akshaya Tritiya 2022: అక్షయ తృతీయ రోజు గోల్డ్ కొంటున్నారా? ఈ టిప్స్ మీకోసమే
(ప్రతీకాత్మక చిత్రం)
Akshaya Tritiya 2022 | అక్షయ తృతీయ రోజున బంగారం కొనాలనుకుంటున్నారా? గోల్డ్ జ్యువెలరీ (Gold Jewellery) కొనే ఆలోచనలో ఉన్నారా? బంగారం కొనేప్పుడు కొన్ని అంశాలు పరిశీలించకపోతే నష్టపోవాల్సి వస్తుంది.
భారతదేశంలో బంగారం పెట్టుబడి మాత్రమే కాదు. సెంటిమెంట్ కూడా. పెళ్లిళ్లు, ఫంక్షన్లకు బంగారు ఆభరణాలు (Gold Jewellery) కొనడం మామూలే. ఇక అక్షయ తృతీయ, ధంతేరాస్ లాంటి పర్వదినాల్లో బంగారం తప్పనిసరిగా కొనేవాళ్లు ఉంటారు. అక్షయ తృతీయ (Akshaya Tritiya), ధంతేరాస్ సందర్భంగా బంగారం కొంటే అంతా శుభమే కలుగుతుందన్న నమ్మకం కస్టమర్లలో ఉంటుంది. అందుకే ఈ రెండు రోజులు నగల దుకాణాలు కిటకిటలాడుతుంటాయి. మే 3న అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనడానికి పసిడిప్రేమికులు సిద్ధం అవుతున్నారు. ఇప్పటికే ప్రముఖ జ్యువెలర్స్ ఆఫర్స్ ప్రకటించాయి. అక్షయ తృతీయ సందర్భంగా బంగారు నగలు కొనేవారికి ఉచితంగా గోల్డ్ కాయిన్స్ (Free Gold Coins) ఇస్తున్నాయి. మరి మీరు కూడా అక్షయ తృతీయ రోజున గోల్డ్ కొంటున్నారా? గోల్డ్ కొనేముందు ఏఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలో తెలుసుకోండి.
బంగారం స్వచ్ఛత ఎలా తెలుసుకోవాలి?
బంగారం స్వచ్ఛతను క్యారట్లలో కొలుస్తారు. ప్రధానంగా బంగారం స్వచ్ఛత రెండు రకాలుగా ఉంటుంది. 24 క్యారట్ గోల్డ్, 22 క్యారట్ గోల్డ్ ఎక్కువగా లభిస్తుంది. ఇది కాకుండా 18 క్యారట్ గోల్డ్ కూడా ఉంటుంది. 18 క్యారట్ గోల్డ్ కొనేవారు తక్కువ. 24 క్యారట్ గోల్డ్ అంటే స్వచ్ఛమైన బంగారం అని అర్థం చేసుకోవచ్చు. ఈ బంగారం కాయిన్స్, బిస్కిట్ల రూపంలో ఉంటుంది. 22 క్యారట్ గోల్డ్‌లో బంగారం 91.6 శాతం మాత్రమే ఉంటుంది. మిగతా మొత్తం ఇతర లోహాలు ఉంటాయి. అందుకే 22 క్యారట్ ఆభరణాలను 916 గోల్డ్ అని కూడా పిలుస్తుంటారు.
మీరు బంగారు ఆభరణాలు కొనేందుకు వెళ్తే 24 క్యారట్ నగలు అని చెబితే మీరు అస్సలు నమ్మకూడదు. 24 క్యారట్ గోల్డ్‌తో ఆభరణాలు తయారు చేయడం సాధ్యం కాదు. ఖచ్చితంగా ఇతర లోహాలు కలపాల్సిందే. మీరు ఆభరణాలు కొంటున్నట్టైతే 22 క్యారట్ బంగారమేనా అన్న విషయం తెలుసుకోవాలి. నగల షాపుల్లో 22 క్యారట్ గోల్డ్ పేరుతో 18 క్యారట్ నగల్ని అమ్మే అవకాశం ఉంటుంది.
హాల్‌మార్క్ అంటే ఏంటీ?
బంగారం స్వచ్ఛతను తెలుపుతూ వేసే ముద్రను హాల్‌మార్క్ అంటారు. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ప్రమాణాల ప్రకారం బంగారం స్వచ్ఛతను పరిశీలించి హాల్‌మార్క్ వేస్తారు. హాల్‌మార్క్ నగలు ప్రతీ నగల షాపులో లభిస్తాయి. మీరు 22 క్యారట్ బంగారు నగలు కొంటే హాల్‌మార్క్‌తో పాటు 916 ముద్ర ఉంటుంది. ఆ ముద్ర ఉంటే అవి 22 క్యారట్ నగలేనని నమ్మొచ్చు.
ముద్దగా ఉన్న బంగారన్ని కరిగించి మీకు కావాల్సిన నగలు తయారు చేయాలంటే కళాకారుల కృషి, లేదా మెషీన్ కావాలి. బంగారాన్ని నగలుగా తయారు చేయడానికి అయ్యే ఖర్చునే మేకింగ్ ఛార్జీలు ఉంటారు. మేకింగ్ ఛార్జీలు మీరు ఎంచుకున్న డిజైన్‌ను బట్టి ఉంటుంది. మేకింగ్ ఛార్జీలు 3 శాతం నుంచి 25 శాతం మధ్య ఉంటాయి. అయితే అక్షయ తృతీయ, ధంతేరాస్ లాంటి సీజన్లో మేకింగ్ ఛార్జీలపై డిస్కౌంట్స్ లభిస్తుంటాయి. మేకింగ్ ఛార్జీలనే మజూరీ అని కూడా అంటారు. మజూరీ అంటే కూలీ అని అర్థం. అంటే నగలు తయారు చేయడానికి వసూలు చేసే కూలీనే మజూరీ అని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప మేకింగ్ ఛార్జీలు, మజూరీ వేర్వేరు కాదు.
బంగారం ధర ఎలా తెలుసుకోవాలి?
బంగారం ధర ప్రతీరోజూ మారుతూ ఉంటుంది. ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ బంగారం ధరను నిర్ణయిస్తుంది. ఆ ధర ప్రకారమే నగల షాపులు బంగారాన్ని అమ్మాల్సి ఉంటుంది. మీరు నగలు కొనడానికి వెళ్లే ముందు ఓసారి రేట్లు చూసుకోవాలి. మార్కెట్ రేట్, షాపులో రేట్ ఒకేలా ఉందో లేదో చూసుకోవాలి.
మీరు నగలు కొనేప్పుడు ఒరిజినల్ బిల్ మాత్రమే తీసుకోవాలి. బిల్లులో తప్పనిసరిగా 22 క్యారట్ గోల్డ్ అన్న వివరాలు ఉండేలా చూసుకోవాలి. దీంతో పాటు మేకింగ్ ఛార్జీలు, ఇతర ఛార్జీల వివరాలను వేర్వేరుగా రాయించాలి. జీఎస్టీ చెల్లించాల్సి వస్తుందని జీరో బిల్ తీసుకోవద్దు. జీఎస్టీ చెల్లించినా సరే ఒరిజినల్ బిల్ ఉంటే నగల నాణ్యతలో ఎప్పుడైనా అనుమానం ఉన్నప్పుడు ఫిర్యాదు చేయడానికి ఒరిజినల్ బిల్ ఉపయోగపడుతుంది.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.