• Home
  • »
  • News
  • »
  • business
  • »
  • AIR INDIA TO START FLIGHTS TO NOWHERE FOR PASSIONATE TOURISTS BA GH

Air India: విహార యాత్ర‌ల‌కు ఎయిర్ ఇండియా ప్ర‌త్యేక స‌ర్వీసులు

ఎయిర్ ఇండియా

విహార యాత్ర‌ల‌కు వెళ్లాల‌నుకునే ప్రయాణికులకు మాత్ర‌మే ఈ స‌ర్వీస్ ద్వారా ప్ర‌త్యేక‌ సేవ‌లు అందించ‌నుంది.

  • Share this:
భార‌త్‌లో మొట్ట‌మొద‌టి “ఫ్లైట్స్ టూ నోవేర్‌” విమాన స‌ర్వీసుల‌ను ప్రారంభించ‌డానికి ఎయిర్ ఇండియా ప్ర‌ణాళిక‌లు వేస్తోంది. విహార యాత్ర‌ల‌కు వెళ్లాల‌నుకునే ప్రయాణికులకు మాత్ర‌మే ఈ స‌ర్వీస్ ద్వారా ప్ర‌త్యేక‌ సేవ‌లు అందించ‌నుంది. సాధార‌ణంగా ఇలాంటి స‌ర్వీసులు అందించే విమానం ఒక ప్ర‌దేశం నుంచి బ‌య‌లుదేరి వివిధ ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను చుట్టివస్తుంది. ఇందులో ప్ర‌యాణించే వ్య‌క్తులు ఆయా ప్రాంతాల‌ను విమానం నుంచే చూడ‌వ‌చ్చు. క్వాంటాస్ ఎయిర్‌వేస్, రాయల్ బ్రూనై ఎయిర్‌లైన్స్ వంటి ఇతర ప్రపంచ విమానయాన సంస్థల తరహాలోనే ఈ కొత్త స‌ర్వీసును ఎయిర్ ఇండియా ప్లాన్ చేసింది.

హిందూస్తాన్ టైమ్స్ వార్తా సంస్థ దీనికి సంబంధించిన క‌థ‌నాన్ని ప్ర‌చురించింది. ఒకే విమానాశ్ర‌యం నుంచి టేకాఫ్, ల్యాండిండ్ అయ్యే సేవలను ప్రారంభించాలని ఎయిర్ ఇండియా యోచిస్తోంది. ఇది ప్రయాణికులను ఆహ్లాద‌క‌ర‌మైన అనుభూతిని పంచుతుంది. తాము ఈ ర‌క‌మైన‌ విమాన స‌ర్వీసును ప్రారంభించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని ఆ సంస్థ అధికారి ఒక‌రు చెప్పిన‌ట్లు హిందూస్తాన్ టైమ్స్ వెల్ల‌డించింది.

విదేశాల్లో స‌క్సెస్‌

ఇప్ప‌టికే విదేశీ విమాన‌యాన సంస్థ‌లు ఇలాంటి సేవ‌ల‌ను అందిస్తున్నాయి. క్వాంటాస్ ఎయిర్‌వేస్ తాజాగా ఇలాంటి స‌ర్వీసును అందుబాటులోకి తెచ్చింది. ఏడు గంటల విమాన ప్ర‌యాణంలో ఆ సంస్థ ప్ర‌యాణికుల‌కు వివిధ టూరిస్ట్ స్పాట్‌ల‌ను చూపిస్తుంది. దీనిలో ప్ర‌యాణించేవారు గ్రేట్ బారియర్ రీఫ్, సిడ్నీ హార్బర్ వంటి ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలను విమానం నుంచే చూడ‌వ‌చ్చు. క్వాంటాస్ ఎయిర్ వేస్ ఈ స‌ర్వీసును ప్ర‌క‌టించిన త‌రువాతే ఎయిర్ ఇండియా కూడా ఇందుకు ప్ర‌ణాళిక వేసిన‌‌ట్టు నివేదిక పేర్కొంది.

మార్కెటింగే ముఖ్యం

క్వాంటాస్ ఎయిర్‌వేస్ తన “ఫ్లైట్స్ టూ నోవేర్” స‌ర్వీసును మార్కెటింగ్ చేసుకోవ‌డం‌లో విజయవంతమైంది. దీని స‌ర్వీసు ధరలు రూ.42,000 నుంచి రూ.2 లక్షల మధ్య ఉన్నాయి. ఈ కొత్త స‌ర్వీసును ప్ర‌క‌టించిన త‌రువాత‌, ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంచిన‌ టిక్కెట్లు 10 నిమిషాల్లో అమ్ముడయ్యాయని ఆ సంస్థ ప్ర‌క‌టించింది. భారతదేశంలోనూ ఇలాంటి స‌ర్వీసు విజ‌య‌వంత‌మైతే ఎయిర్ ఇండియాతో పాటు ఇతర ప్రైవేట్ క్యారియర్‌లకు ఇది పెద్ద ఉపశమనం కలిగిస్తుంది.

క‌రోనా ప్ర‌భావం ఎంత‌?

కోవిడ్ -19 మహమ్మారి విమాన‌యానానికి ఒక పెద్ద అడ్డంకిలా మారింది. మిగతా వాటిలాగే ఈ రంగాన్ని కూడా మహమ్మారి తీవ్రంగా దెబ్బ‌తీసింది. సామాజిక దూరం పాటించ‌డంతో పాటు, క‌రోనా వ్యాప్తిని నియంత్రించాలంటే ప్రయాణాలు మానుకోవాల్సిందేన‌ని నిపుణులు ప్రజలకు సూచిస్తున్నారు. వీట‌న్నింటి నేప‌థ్యంలో ఈ కొత్త విమాన సేవలు ప్రయాణికులకు సురక్షితం కాక‌పోవ‌చ్చ‌ని కొంతమంది ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎయిర్ ఇండియా ఫ్లైట్స్ టూ నోవేర్ స‌ర్వీస్‌పై అధికారిక ప్ర‌క‌ట‌న చేసిన త‌రువాతే దీని గురించి పూర్తి వివ‌రాలు తెలియ‌నున్నాయి.
Published by:Ashok Kumar Bonepalli
First published: