ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఎయిరిండియా (Air India)ను గతేడాది టాటా గ్రూప్ (Tata Group) టేకోవర్ చేసిన సంగతి తెలిసింది. అప్పటికే భారీ నష్టాల్లో ఉన్న ఎయిరిండియాలో నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవడం కోసం టాటా గ్రూప్ గతేడాది జూన్‌లో స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్ ఫస్ట్ ఫేజ్‌ను ప్రారంభించింది. ఈ ప్రయత్నం మంచి ఫలితాలను ఇవ్వడంతో, తాజాగా నాన్-ఫ్లయింగ్ స్టాఫ్‌కు సెకండ్ ఫేజ్ వాలంటరీ రిటైర్మెంట్ ఆఫర్ ప్రకటించింది. 40 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్న పర్మినెంట్ జనరల్ కేడర్ సిబ్బందికి మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ సిబ్బంది ఎయిర్‌లైన్‌లో కనీసం ఐదేళ్లు నిరంతరాయంగా సర్వీస్‌ను పూర్తిచేసి ఉండాలి.
క్లరికల్, అన్‌స్కిల్డ్ కేటగిరీ ఉద్యోగులకు సైతం ఈ ఆఫర్ వర్తిస్తుందని, అయితే వీరు కూడా కనీసం ఐదు సంవత్సరాల నిరంతర సర్వీసును పూర్తి చేసి ఉండాలని ఎయిరిండియా పేర్కొంది. వాలంటరీ రిటైర్మెంట్ ఆఫర్ ఏప్రిల్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. ఈ స్వచ్ఛంద పదవీ విరమణ ఆఫర్‌కు అర్హత పొందే ఉద్యోగులు ప్రస్తుతం 2,100 మంది ఉన్నట్లు ఎయిరిండియా వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం, ఎయిరిండియాలో ఫ్లయింగ్, నాన్-ఫ్లయింగ్ సిబ్బందితో కలిపి మొత్తం 11,000 మంది సిబ్బంది ఉన్నట్లు సమాచారం.
* ఆఫర్ బెనిఫిట్స్ ఇవే..
వాలంటరీ రిటైర్మెంట్ ఆఫర్‌కు అప్లై చేసుకునే ఉద్యోగులకు వన్-టైమ్ బెనిఫిట్ కింద ఎక్స్-గ్రేషియా చెల్లించనున్నారు. మార్చి 31 వరకు అప్లై చేసుకునే అర్హత ఉన్న ఉద్యోగులకు ఎక్స్‌గ్రేషియాతో పాటు అదనంగా రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ మొత్తం వచ్చే అవకాశం ఉంది.
ఇది కూడా చదవండి : ఆన్‌లైన్‌లో జాబ్ సెర్చింగ్ చేస్తున్నారా..? ఈ కొత్త తరహా స్కామ్‌తో జాగ్రత్త..!
* ఫేజ్-1లో 4,200 మంది ఉద్యోగులు అర్హులు
గతేడాది జూన్‌లో ప్రకటించిన వాలంటరీ రిటైర్మెంట్ ఆఫర్ ఫేజ్-1లో ఫ్లయింగ్, నాన్-ఫ్లయింగ్ సిబ్బంది కవర్ అయ్యారు. ఆ సమయంలో సుమారు 4,200 మంది ఉద్యోగులు ఈ ఆఫర్‌కు అర్హులు కాగా కేవలం1,500 మంది మాత్రమే వాలంటరీ రిటైర్మెంట్ ఆఫర్ స్వీకరించినట్లు సమాచారం. స్వచ్ఛంద పదవీ విరమణ అదనపు ప్రయోజనాన్ని ఇతర పర్మినెంట్ ఉద్యోగులకు కూడా వర్తింపజేయాలన్న డిమాండ్ ఎయిరిండియాలో ఎప్పటి నుంచో ఉంది. అందుకు అనుగుణంగా తాజా ఆఫర్‌ను ప్రకటించింది.
* లక్ష్యాల సాధనకు విహాన్ ప్లాన్
ఎయిరిండియా గతేడాది సెప్టెంబర్‌లో ట్రాన్స్‌ఫర్మేషన్ ప్లాన్ ‘విహాన్’ (Vihaan)ను ప్రకటించింది. ఈ ప్లాన్ ద్వారా నిర్దేశించుకున్న వివిధ లక్ష్యాలను వచ్చే ఐదేళ్ల కాలంలో సాధించాలని నిర్దేశించుకుంది. స్థిరమైన వృద్ధి, లాభాలతో పాటు విమానయాన రంగంలో లీడర్‌గా ఎదగాలనే లక్ష్యంతో ఎయిరిండియా ఈ ప్లాన్‌ను తీసుకొచ్చింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Air India, Personal Finance, Retirement, Tata Group