పోషక ఆహారంపై పెరిగిన అవగాహనతో ఈ మధ్య కాలంలో ఆకుకూరల వినియోగం పెరిగింది. ఆకుకూరల్లో కావాల్సిన ఖనిజ లవణాలు, విటమిన్లు పుష్కలంగా లభ్యమవుతాయనే ఉద్దేశ్యంతో రోజూ ఆహారంలో వాటిని చేర్చుకుంటున్నారు. ఆకుకూరలను దఫ దఫాలుగా వేసుకుంటూ రైతులు సంవత్సరం పొడుగునా ఆదాయాన్ని పొందేలా ప్లాన్ చేసుకుంటున్నారు. రైతులు పండించే ఆకుకూరల్లో ముఖ్యమైనది తోటకూర. ఇందులో ఉండే ఇనుము రక్త వృద్ధికి ఉపకరిస్తుంది. విత్తనాలు వేసిన 25 రోజులకే కోతకు వచ్చే తోటకూర.. ఆ తర్వాతమూడు, నాలుగు కోతలు అందిస్తుంది. తక్కువ కాలంలో నిర్దిష్ట ఆదాయాన్నిచ్చే తోటకూర సాగుకు అందుకే రైతులు ఆసక్తి చూపిస్తారు.
వరంగల్ శివారు ప్రాంతమైన ఖిల్లా వరంగల్ కు చెందిన కొప్పుల కుమారస్వామి గత 30 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాడు. సాధారణంగా రకరకాల కూరగాయలు పండించే కుమారస్వామి.. ఇప్పుడు ఎండాకాలం రావడంతో ఆకుకూరలు మాత్రమే పండిస్తున్నాడు. తోటకూర సాగునువేసవి కాలం పంటగా జనవరి నుండి మే వరకు వేసుకోవచ్చని చెప్పిన రైతు.. ఇసుకతో కూడినటువంటి గరపు నేలలు దీనికి అనుకూలమని చెప్తున్నారు.
ఒక ఎకరానికి నాలుగు నుంచి ఐదు టన్నుల వరకు దిగుబడి వస్తుంది. అయితే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసేటప్పుడు రైతులు మార్కెటింగ్ దృష్టిలో ఉంచుకొని వారం నుంచి పది రోజుల వరకుకొంతమడి, వారం నుంచి పది రోజుల తర్వాత ఇంకొంత మడి పెట్టుకుంటే నిత్యం మార్కెట్ కు తోటకూర సప్లై చేయడానికి అవకాశం ఉంటుందని.. తగినంత ధర కూడా లభిస్తుందని చెప్పారు. రైతులు ముఖ్యంగా మార్కెటింగ్ జాగ్రత్త తీసుకోవాలని రైతు కొప్పుల కుమారస్వామి కోరారు.
ఈ మధ్య కాలంలో, ముఖ్యంగా కరోనా తర్వాత ప్రజలు ఆరోగ్య కరమైన ఆహారంపై మక్కువ చూపుతున్నారని.. అందులో భాగంగానే ఆకుకూరల వినియోగం పెరిగిందని.. డిమాండ్ ఉండనే ఉద్దేశ్యంతోనే తోటకూరను సాగు చేస్తున్నట్లు రైతు కుమారస్వామి చెప్పారు. తోటకూరలో పోషకాలు ఎక్కువగా ఉండడం వలన రోగనిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు చెప్తున్నారని.. ఇప్పటికే ఆకుకూరలపై అవగాహన పెరగడంతో ప్రతి ఒక్కరూ ఆకుకూరలపై మొగ్గు చూపుతున్నారని చెప్పారు. ముఖ్యంగా మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వాళ్లు ఆకుకూరలు తినడం ద్వారా మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చని రైతు సలహా ఇస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Local News, Telangana, Warangal