కేంద్రప్రభుత్వం(Central Government) ఆడపిల్లల కోసం ప్రత్యేకంగా సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ పథకంలో తల్లిదండ్రులు తమ కుమార్తెల కోసం రెండు ఖాతాలు ఓపెన్(Open) చేసుకొనే సదుపాయం ఉంది. ఈ పథకం కేవలం అడ పిల్లలకు మాత్రమే వర్తిస్తుంది. అమ్మాయిలకు ఆర్థిక భద్రత కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని తీసుకువచ్చింది. 10 ఏళ్ల వయసు ఉన్నఆడపిల్లలు మాత్రమే పథకంలో చేరడానికి అర్హులు. ఒక ఇంట్లో గరిష్టంగా ఇద్దరు అమ్మాయిలు ఈ స్కీమ్(Scheme) కింద చేరొచ్చు. కేంద్రం అందిస్తున్న సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరాలని భావించే వారు దగ్గరిలోని బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లితే సరిపోతుంది.
ఫిబ్రవరి 9, 10న అకౌంట్ మేళా..
అయితే ప్రస్తుతం పోస్టల్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించబోతున్న AMRTPEX-2023 (జాతీయ స్థాయి స్టాంపుల ప్రదర్శన) లో భాగంగా ఈ ఫిబ్రవరి 9, 10వ తేదీల్లో సమృద్ధి యోజన అకౌంట్ మేళా నిర్వహించబోతున్నట్లు హైదరాబాద్ తపాలా సిటీ డివిజన్ సీనియర్ సూపరింటెండెంట్ ఏ.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి జిల్లాల్లో సుకన్య సమృద్ధి ఖాతాలు తెరిచేందుకు అవకాశం కల్పించినట్లు తెలిపారు.
మొత్తం 7.5 లక్షల ఖాతాలను తెరవడమే లక్ష్యంగా ఈ మేళా నిర్వహించనునట్లు చెప్పారు. సుకన్య సమృద్ధి యోజన పథకంపై ప్రస్తుతం 7.6 శాతం చక్రవడ్డీ లభిస్తుందన్నారు. పోస్టాఫీసుల్లో కేవలం రూ.250తో ఖాతా తీసుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, బాలికల మంచి భవిష్యత్ కు తోడ్పడాల్సిందిగా ఆయన కోరారు.
ఖాతాకు ఇవి అవసరం..
అంతే కాకుండా.. ఖాతాలో జమైన మొత్తం సొమ్ము మీద ఆదాయపు పన్ను మినహాయింపు పొందవచ్చన్నారు. అంటే.. ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకోవచ్చు. అందువల్ల ఉద్యోగం చేసే వారికి ఈ స్కీమ్ చాలా అనువుగా ఉండనుంది. సుకన్య సమృద్ధి యోజన స్కీమ్‌లో చేరాలని భావించే వారు తల్లి లేదా తండ్రి పాన్ కార్డు, ఆధార్ కార్డు మరియు రెండు పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు , పాప బర్త్ సర్టిఫికెట్ వెంట తీసుకొని వెళ్లాలి. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ఖాతా ద్వారా ఆన్ లైన్ లో నగదు జమ చేసుకునే సౌకర్యం కూడా ఉంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Business, Post office, Post office scheme, Sukanya samriddhi yojana